ఎన్టీఆర్ ‘రామాయణం’లో సీతగా నటించిన అమ్మాయి, ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తోంది...
ప్రభాస్, శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా, జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఆరడుగుల అజానుబాహుడైన ‘బాహుబలి’ని, రాముడిగా చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు...

దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆదిపురుష్‌లో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, సీతగా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి టీజర్, ట్రైలర్‌లో కృతి సనన్ లుక్స్, ఫ్యాన్స్‌ని ఫిదా చేసేశాయి...
ప్రభాస్ కంటే ముందు ఈతరం నటుల్లో రాముడిగా నటించి మెప్పించాడు జూనియర్ నందమూరి తారక రామారావు. తాత సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో భరతుడిగా నటించిన తారక్, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రామాయణం’లో శ్రీరాముడి పాత్రలో కనిపించాడు..
1997 ఏప్రిల్ 11న విడుదలైన ‘రామాయణం’ సినిమాలో నటీనటులంతా స్కూల్ పిల్లలే. అందుకే ఈ సినిమా ‘రామాయణం’గా కంటే ‘బాలరామాయణం’గా ఎక్కువ ప్రాచుర్యం పొందింది. రాముడి పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్, గత ఏడాది ‘RRR’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు..
మరి ‘రామాయణం’లో ఎన్టీఆర్ పక్కన సీతగా నటించిన అమ్మాయి ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది? ‘రామాయణం’లో సీతగా నటించిన ఆ అమ్మాయి పేరు స్మిత మాధవ్. చిన్నతనం నుంచి భరతనాట్యంలో ప్రావీణ్యం సాధించింది స్మిత మాధవ్..
ఎన్టీఆర్ పక్కన సీత పాత్ర కోసం ఎంతోమంది అమ్మాయిలను లుక్ టెస్ట్ చేసిన గుణశేఖర్, స్మిత మాధవ్ భరతనాట్యంలో కళ్లతో ప్రదర్శించిన అభినయానికి మెచ్చి, ఆమెను ఫైనల్ చేశాడట... ఆ సినిమా తర్వాత స్మిత మాధవ్‌కి చాలా సినిమా అవకాశాలు వచ్చాయి..
అయితే సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించని స్మిత మాధవ్, గురు నృత్య చూడామణి శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. అక్కడే శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్న స్మిత మాధవ్, మాద్రాస్ యూనివర్సిటీలో మ్యూజిక్ ప్రోగ్రామ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందింది...
భారతదేశంలోని అన్ని నగరాల్లో, ప్రముఖ కార్యక్రమాల్లో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఇచ్చిన స్మిత మాధవ్, అమెరికా, ఆస్ట్రేలియా, వియత్నాం, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చింది..
సిసిర్ సహనా దర్శకత్వంలో వచ్చిన ‘పృథ్వీ’ అనే ఆర్ట్ మూవీలో నటించిన స్మిత మాధవ్, జెమినీ టీవీలో ‘జయం మనదే’ పేరుతో ఓ టీవీ షోను కూడా హోస్ట్ చేసింది. దానికి పెద్దగా ఆదరణ దక్కకపోవడంతో దాని నుంచి తప్పుకుంది.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛానెల్‌లో అన్నమయ్య సంకీర్తనార్చన అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన స్మిత మాధవ్, ఆ తర్వాత విజయ్ టీవీలో ‘సంగీత సంగమం’ పేరుతో ప్రోగ్రామ్స్ చేసింది..