సమాధి ప్రాంతాన్ని ముందే ఎంపిక చేసుకున్న రామోజీరావు, ఎందుకు అలా చేశాడు, ఎక్కడ?
రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎన్నో రంగాల్లో రాణించారు.

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామోజీ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నో రామోజీరావు గారి గురించి అనేక ఇంట్రస్టింగ్ విషయాలు బయిటకు వస్తున్నాయి. తాజాగా ఆయన మరణానికి ముందే సమాధి ఎక్కడ నిర్మించాలో ఆ ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్న విషయం బయిటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...
మూడురోజుల క్రితం రామోజీ రావు కు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్ వేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు.
రామోజీరావు మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
రామోజీరావు పేరు జనాల్లోకి ఎంతలా వెళ్లిపోయిందంటే ఆయన గురించి తెలియని తెలుగు వారు ఉండరు. ప్రింట్ మీడియాలో నూతన ఒరవడి సృష్టించిన ఆయన సినిమా రంగంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా దేశంలో అత్యద్భుతంగా రామోజీ ఫిలిమ్ సిటినీ నిర్మించారు. అక్కడే ఆయన సమాధికి ఏర్పాటు చేయమన్నట్లు తెలిసింది.
రీసెంట్ గా కూటమి తరుపున ఎలక్షన్స్ లో పోటీ చేసి ఉండి నియోజకవర్గంలో ఎమ్మల్యే గా గెలిచిన రఘురామ కృష్ణ రాజు ..రామోజీరావుకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో కొన్ని విషయాలు రివీల్ చేసి ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా రామోజీరావు గారు తన సమాధి కోసం రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఓ ప్రదేశాన్ని ఎన్నో సంవత్సరాల క్రితమే ఎంపిక చేసుకున్నారని చెప్పుకొచ్చి ఆశ్చర్యపరిచారు. ఆ సమాధి ప్రాంతాన్ని ఓ ఉద్యానవనంలా మార్చాలని అన్నారు. ఆయనకు మొక్కలంటే చాలా ఇష్టమని అన్నారు. ఎన్ని కోట్లు నష్టపోయినా రామోజీ ఫిల్మ్ సిటీలాంటిదాన్ని సృష్టించటం మాటలు కాదన్నారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో ఈ విషయం ప్రస్తావించారు.
పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, ఈనాడు మరియు మార్గదర్శి సంస్థల అధినేత శ్రీ చెరుకూరి రామోజీరావు గారి మహాభినిష్క్రమణం చాలా ఆవేదనకు గురిచేసింది. ఆరు నెలల క్రితం శ్రీ రామోజీరావు గారితో మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశంలో వారు నాతో మాట్లాడిన ప్రతిమాట ఇంకా గుర్తుంది. అలాంటి పట్టుదల, వ్యక్తిత్వం, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు కోటికొక్కరు మాత్రమే ఉంటారు. అరాచక పాలన నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను కాపాడటం కోసం ఆయన చేసిన కృషి అద్వితీయం. తెలుగు ప్రజలను కాపాడిన తృప్తితో ఆయన కన్ను మూశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
రామోజీ రావు పత్రికా, డిజిటల్ రంగంలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి నూతన ఒరవడి సృష్టించారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఎంతో మంది నూతన నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు. హైదరాబాద్ లో హాలీవుడ్ తరహాలో ఒక ఫిలిమ్ సిటీ నిర్మించాలని ఆయన చిరకాల కోరిక. ఆ కల నెరవేర్చుకోవడానికి ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించారు. ఇక్కడికి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు షూటింగ్స్ జరుగుతున్నాయి. ఆయన మరణ వార్త విన్న సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన వారు దిగ్బ్రాంతికి గురయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్తీక దేహాన్ని తరలించనున్నారు.