- Home
- Entertainment
- Amala Akkineni: మా చెల్లితో సినిమాలు బలవంతంగా చేయించాము.. అక్కినేని అమల అన్నయ్య షాకింగ్ కామెంట్స్
Amala Akkineni: మా చెల్లితో సినిమాలు బలవంతంగా చేయించాము.. అక్కినేని అమల అన్నయ్య షాకింగ్ కామెంట్స్
Amala Akkineni: అక్కినేని అమల గురించి ఆమె అన్నయ్య సురేష్ చక్రవర్తి ఎన్నో విషయాలను పంచుకున్నారు. అమల సినిమాలు చేయడానికి మొదట్లో ఇష్టపడలేదని చెప్పారు. కానీ బలవంతంగా తామే చేయమని అడిగామని వివరించారు.

అమల అన్నయ్య గురించి తెలుసా?
సురేష్ చక్రవర్తి అనే పేరు చెబితే.. ఎవరూ గుర్తుపట్టలేరు. కానీ అతని ఫోటోను చూస్తే మాత్రం ఎన్నో సినిమాల్లో ఈయనను చూసినట్టు గుర్తుకు వస్తుంది. ఈయనకు అక్కినేని అమలకు ఎంతో మంచి అనుబంధం ఉంది. సినిమా ఇండస్ట్రీలో అమలకు సురేష్ చక్రవర్తిని అన్నయ్య అని చెప్పుకుంటారు. అయితే వీరిద్దరి మధ్య రక్త సంబంధం మాత్రం లేదు. అమల సినిమాల్లోకి రాకముందే ఫ్రెండ్స్ ద్వారా పరిచయమయ్యారు వీరిద్దరూ. ఒకే ఇంట్లోనే ఆరేళ్ల పాటు కలిసి నివసించారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో అమలకు అన్నయ్యగా సురేష్ ను పిలవడం ప్రారంభించారు. తనకు సొంత తమ్ముడు, చెల్లి లేకపోవడంతో అమలనే చెల్లిగా అనుకున్నానని సురేష్ చెప్పారు.
చెన్నైలో తనకు చాలా పెద్ద ఇల్లు ఉండడం, తాను ఒంటరిగానే నివసించడంతో అమల కూడా వచ్చి అక్కడే నివసించేదని చెప్పారు. అలాగే తన ప్రేమ విషయంలో కూడా అమల ఎంతో సాయం చేసిందని, తాను తన భార్యను ప్రేమించిన విషయం అమలకే చెప్పానని ఆయన వివరించారు. తన భార్య, తాను, అమలా కలిసి ఒకే ఇంట్లో జీవించేవారమని తెలిపారు. మొదటినుంచి ఆమెకు జంతు ప్రేమ ఎక్కువ అని, లెదర్ వస్తువులు కూడా మమ్మల్ని వాడనిచ్చేది కాదని తెలిపారు. నగలు కూడా వేసుకోవడం ఇష్టం ఉండదని, చాలా సింపుల్ గా ఉండేదని చెప్పుకొచ్చారు. చెన్నైలోనే కళాక్షేత్రలో ఆమె భరత నాట్యం నేర్చుకునేదని, కళాక్షేత్రంలో అహింస బోధిస్తారని, అందుకే అమలకు మూగజీవాల పట్ల ఎంతో ప్రేమ కలిగిందని చెప్పారు.
సినిమా చేసేందుకు ఇష్టపడలేదు
దర్శకుడు టి రాజేంద్ర ఒక సినిమా తీస్తున్నారని ఆ సినిమాలో తనకు ఛాన్స్ ఇచ్చారని, అయితే మరో క్యారెక్టర్‌కు చక్కటి అమ్మాయి కావాలని అడిగారని వివరించారు.ఆ పాత్ర వినగానే తనకు అమలు గుర్తొచ్చిందని, వెంటనే అమల ఇంటికి ఫోన్ చేసి డైరెక్టర్ ను ఇంటికి తీసుకొస్తున్నానని, చీర కట్టుకొని సిద్ధమై ఉండమని చెప్పినట్టు తెలిపారు. అప్పుడు అమల తాను సినిమాల్లో నటించనని చెప్పేసిందని అన్నారు. అయితే తాను కేవలం చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని ఉండు చాలు అని రిక్వెస్ట్ చేసినట్టు చెప్పారు. అమలా ఎప్పుడూ జీన్స్ వేసుకునే ఉంటుందని వివరించారు. అందుకే చీర కట్టుకోమని చెప్పినట్టు తెలిపారు. ఎప్పుడూ సైకిల్ మీదే బయటకు వెళ్తూ ఉంటుందని, మంచి నటిగా పేరు తెచ్చుకున్నాక కూడా సైకిల్ మీద తిరిగేందుకు ఇష్టపడేదని సురేష్ చక్రవర్తి వివరించారు.
అప్పుడు ఎంత సింపుల్ గా ఉందో, అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత కూడా అమల అలాగే ఉందని..ఏ మార్పు లేదని వివరించారు. అమలను చూసేందుకు వచ్చిన దర్శకుడు రాజేంద్రన్ ఒక పాట పాడమని అడిగారని, అమల తెలుగు పాటే పాడిందని, ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి వెంటనే అడ్వాన్స్ కూడా ఇచ్చి తనను సినిమాకు బుక్ చేసుకున్నారని తెలిపారు. అప్పుడు అమల ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్టు చెప్పారు.
అమల కండిషన్ ఇదే
అమల తాను ఉంటేనే సినిమాలో నటిస్తానని కండిషన్ పెట్టిందని, దీంతో అమల మొదటి సినిమా నుంచి చివరి సినిమా వరకు తాను అమలతోనే ఉన్నానని, ఆమెకు మేనేజర్ గా పని చేశానని చెప్పుకొచ్చారు సురేష్ చక్రవర్తి. చిన్న వయసులోనే ఎంతో మెచ్యూరిటీ అమలకు సొంతమని, ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, తనకు చెల్లి కంటే గురువుగానే అమలను చెప్పుకోవాలని సురేష్ వివరించారు. నాగార్జునతో పెళ్లి అయిపోయాక కూడా తనతో టచ్‌లో ఉందని, తాను సినిమాల్లో బిజీ అయిపోయి మధ్యలో మాటలు తగ్గాయని వివరించారు. కానీ ఇప్పటికీ కూడా తాము ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకుంటామని, మెసేజ్ చేసుకుంటామని చెప్పారు సురేష్ చక్రవర్తి. అమలకు రంజనా అనే అక్క, సొంత అన్నయ్య కూడా ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం అన్నయ్య సిడ్నీలో నివసిస్తున్నారని వివరించారు.
నాగార్జునే ప్రపోజ్ చేశారు
నాగార్జున అమల ప్రేమలో పడినప్పుడు అమల తమ ఇంట్లోనే ఉండేదని చెప్పారు సురేష్ చక్రవర్తి. కానీ వాళ్ళ ప్రేమ విషయం ఎప్పుడూ తనకు చెప్పలేదని తెలిపారు. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ తన ప్రైవసీకి అమల భంగం కలిగించలేదని, అలాగే తాను కూడా అమలను అంతే ప్రైవసీని ఇచ్చానని అన్నారు. ‘నాగార్జున - అమల కలిసి షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకునేవారు కాదు, ఎవరు పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయేవారు అని చెప్పారు. అమల ప్రేమను, షూటింగ్ను విడివిడిగా చూసేది, నాగార్జున అమల ఒకే సెట్ లో ఉన్న ఎవరి పని వారు చేసుకునే వెళ్లిపోయేవారు, కానీ ఒకచోట కూర్చుని మాట్లాడుకోవడం, తిరగడం వంటివి చేసేవారు కాదు. అందుకే వారి ప్రేమ గురించి మొదట తెలియలేదు. నాకు తెలిసినంతవరకు అమల వ్యక్తిత్వం గురించి తెలిసి నాగార్జున ప్రపోజ్ చేసి ఉంటారు’ అని సురేష్ చక్రవర్తి అన్నారు. ఇంటర్వ్యూ మధ్యలో ‘నాగ్.. నేను చెప్పింది తప్పు అయితే క్షమించు’ అని కామెంట్ చేశారు.

