`పుష్ప 2` పై మండిపడ్డ డైరక్టర్, ఇది పద్దతి కాదంటూ విమర్శలు
`పుష్ప 2` సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్నప్పటికీ, మల్టీప్లెక్స్‌లలో స్క్రీన్స్ గుత్తాధిపత్యంపై దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Allu Arjun, #Pushpa2, sukumar
అల్లు అర్జున్ "పుష్ప 2: ది రూల్" సినిమా, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రిలీజైన ఆరు రోజుల్లోనే రూ.1002 కోట్ల గ్రాస్ వసూలు చేసి, భారతీయ సినీ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది. నార్త్ లో పుష్పరాజ్ హవా మామూలుగా లేదు.
ఇప్పటికే హిందీలో అనేక రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు ₹500 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతూ షాక్ ఇస్తోంది. ఈ ఉపు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో బాలీవుడ్ లో చాలా మందికి ఈ సినిమాని చూస్తుంటే మండుకొస్తోంది. కొందరు ఆ అక్కసును బయిటపెట్టేస్తున్నారు. తాజాగా దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే ఈ సినిమాపై ఘాటుగా విమర్శలు చేసారు.
పుష్ప 2 సినిమాకి మల్టీప్లెక్స్ లలో ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడం పట్ల దర్శకుడు విక్రమాదిత్య మోత్వానికు కోపం వచ్చింది. 'పుష్ప 2' కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' సినిమాకు స్క్రీన్స్ దొరకటం లేదంటూ ఆయన నిరసన వ్యక్తం చేశాడు. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ మేరకు ఓ సుదీర్ఘ నోట్ ని పంచుకుని, ప్రస్తుతం 'పుష్ప 2' వల్ల ఇండస్ట్రీలో ఏర్పడ్డ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
''పుష్ప 2'' నిర్మాతలు మల్టీప్లెక్స్‌లలో గుత్తాధిపత్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని అంగీకరిస్తూనే, మొదటి పది రోజుల పాటు మరే ఇతర చిత్రాన్ని ప్రదర్శించకూడదని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని విమర్శించారు. దీని కారణంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్-2025 కు నామినేట్ చేయబడిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రానికి స్క్రీన్స్ లభించలేదన్నారు.
Allu Arjun, #Pushpa2, sukumar
ఆ పోస్ట్ లో మొత్వాని రాస్తూ "పుష్ప-2 నిస్సందేహంగా బ్లాక్ బస్టర్ మూవీ. కానీ 3 గంటల 20 నిమిషాల నిడివి కారణంగా నార్మల్ కంటే థియేటర్లలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ను ఆక్రమిస్తోంది. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు వేరే చిత్రాన్ని వేయకూడదని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని, వేరే సినిమా కోసం ఒక్క షో వేసినా తమపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఓ ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ మేనేజర్ చెప్పాడు" అని పేర్కొన్నారు.
"ఏమైనప్పటికీ, ఇదొక భయంకరమైన ఉదాహరణ. మల్టీప్లెక్స్‌లను ఈ విధంగా గుత్తాధిపత్యం చేయకూడదు. ప్రతి పెద్ద సినిమా ఇలా చేయడం మొదలుపెడితే అది వినాశకరంగా మారుతుంది" విక్రమాదిత్య అన్నారు. అంతకుముందు 'పుష్ప 2' షోలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పంచుకుంటూ "ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ డైరెక్టర్ పాయల్ యొక్క అద్భుతమైన విజయాలు మనందరికీ అవసరం లేదు.
ఎందుకంటే మనం ఆ సినిమాను బయటికి విసిరేస్తాం. ప్రేక్షకులు చూడటానికి థియేటర్లు ఇవ్వం.. ఊపిరి పీల్చుకోనివ్వం. కానీ ఒక చిత్రానికి మాత్రం ఒకే మల్టీప్లెక్స్‌లో రోజుకు 36 షోలు వేస్తాము. ఇలా ఒకే సినిమాకు ఎక్కువ షోలు వేయడం వల్ల... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మరో సినిమా ఆడుతోంది అనే విషయం కూడా ప్రేక్షకులకు తెలీదు. అభినందనలు. మేము దీనికి అర్హులం" అంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు.