RRR: ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించని విజయేంద్ర ప్రసాద్.. ఆ రూమర్ నిజమా ?
ఆర్ఆర్ఆర్ కి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో కనిపించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం శుక్రవారం నుంచి థియేటర్స్ లో సునామి సృష్టించేందుకు రెడీ అవుతోంది. బాహుబలి తర్వాత జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
రాజమౌలి ఇద్దరు హీరోలని వెంటబెట్టుకుని దేశం మొత్తం ప్రమోషన్స్ తో మోతెక్కిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, అమృత్ సర్, జైపూర్ లాంటి నగరాల్లో జోరుగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అలియా భట్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
అలాగే ఇంటర్వ్యూలతో కూడా ఆర్ఆర్ఆర్ టీం బిజీగా గడుపుతోంది. మీడియాకు దూరంగా ఉండే కీరవాణి కూడా ముందుకు వచ్చి రాంచరణ్, ఎన్టీఆర్ లని ఇంటర్వ్యూ చేశారు. ఎప్పుడూ మీడియా ఇంటర్వ్యూలతో యాక్టివ్ గా ఉండే విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించడం లేదు. మూడు నెలల క్రితం ముంబైలో నిర్వహించిన ఆర్ఆర్ఆర్ ఈవెంట్ లో విజయేంద్ర ప్రసాద్ సందడి చేశారు.
ఆ తర్వాత ఈ బాహుబలి రచయిత ఎక్కడా కనిపించలేదు. ఇటీవల బెంగుళూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరు కాలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి కథ అందించింది ఆయనే. ఆ మాటకు వస్తే రాజమౌళి సినిమాలన్నింటికీ కథ ఇచ్చేది విజయేంద్ర ప్రసాదే. ఆర్ఆర్ఆర్ షూటింగ్ దశలో ఉన్నపుడు ఈ చిత్రం గురించి పలు ఇంటర్వ్యూలలో విజయేంద్ర ప్రసాద్ అనేక విశేషాలు తెలిపారు. కానీ సరిగ్గా ప్రమోషన్స్ టైం కి ఆయన కనిపించకపోవడంతో అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఒక రూమర్ మాత్రం ప్రచారంలో ఉంది. ఇటీవల విజేంద్ర ప్రసాద్ కి కరోనా సోకినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో ఆయన ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారని, బయటకి రావడం లేదు అని అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని కీలక పాత్రలో నటించారు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ సాగుతున్నాయి.