- Home
- Entertainment
- నువ్వు నాకు నచ్చావ్ మూవీ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ? ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కూడా లేరు
నువ్వు నాకు నచ్చావ్ మూవీ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ? ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కూడా లేరు
విక్టరీ వెంకటేష్ నవ్వుల వర్షం కురిపించిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ నూతన సంవత్సర కానుకగా జనవరి 1న రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలు తెలుసుకోండి.

నువ్వు నాకు నచ్చావ్ మూవీ
విక్టరీ వెంకటేష్ నటించిన ఆల్ టైం క్లాసిక్ ఎంటర్టైనర్ నువ్వు నాకు నచ్చావ్ మూవీ జనవరి 1న నూతన సంవత్సర కానుకగా రీ రిలీజ్ అవుతోంది. విజయ భాస్కర్ దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం అందుకోవడమే కాదు.. రిలీజై దాదాపు 25 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ టీవీల్లో తెలుగు ప్రేక్షకులని నవ్విస్తూనే ఉంది.
తరుణ్ తో అనుకున్నారు కానీ..
ఈ చిత్రం రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. నువ్వే కావాలి చిత్ర విజయం తర్వాత స్రవంతి రవికిశోర్ నిర్మాతగా, విజయ భాస్కర్ దర్శకుడిగా, త్రివిక్రమ్ రచయితగా మరో సినిమా ఒకే అయింది. నువ్వు నాకు నచ్చావ్ కథని త్రివిక్రమ్ స్రవంతి రవికిశోర్ కి వినిపించారు. ఈ సినిమాలో కూడా తరుణ్ నే హీరోగా అనుకున్నారు. కానీ కామెడీ, ఎమోషనల్ డోస్ ఎక్కువ ఉండే సీన్లు ఉండడంతో మరో హీరోతో ప్రయత్నిద్దాం అని అనుకున్నారు.
త్రిషకి ఛాన్స్ మిస్
ఆ టైంలో వెంకటేష్ డేట్లు ఉండడంతో హీరోగా.. వెంకీ ఫిక్స్ అయ్యారు. హీరోయిన్ పాత్ర కోసం ముందుగా త్రిష, గజాల లాంటి హీరోయిన్లని అనుకున్నారు. కానీ వాళ్ళు ఈ కథకి సెట్ కారని భావించారు. అదే సమయంలో ఆర్తి అగర్వాల్ హిందీలో ఓ చిత్రంలో నటించింది. కొత్త అమ్మాయి అయితే ఈ సినిమాకి బావుంటుందని ఆర్తి అగర్వాల్ ని ఫిక్స్ చేశారు. నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ఆర్తి అగర్వాల్ కి తెలుగులో డెబ్యూ మూవీ.
ప్రకాష్ రాజ్ పాత్రలో ఆ సీనియర్ నటుడు
ఆర్తి ఎంట్రీ ఇవ్వడంతో త్రిష, గజాల లాంటి వారికి ఛాన్స్ మిస్ అయింది. ముందుగా కథ అనుకున్నప్పుడు చిత్ర యూనిట్ ఆలోచనల్లో ప్రకాష్ రాజ్ కూడా లేరు. హీరోయిన్ తండ్రి పాత్ర కోసం ముందుగా నాజర్ ని అనుకున్నారు. స్రవంతి రవికిశోర్ మాత్రం ప్రకాష్ రాజ్ అయితే బావుంటుంది అని భావించారు. చివరికి ఆయన నిర్ణయమే ఫైనల్ అయింది.
కథలో బ్రహ్మానందం పాత్ర లేదు
బ్రహ్మానందం పాత్ర అసలు కథలోనే లేదు. వాటర్ వరల్డ్ సన్నివేశాల్లో బ్రహ్మానందం లాంటి కమెడియన్ ఉండాలి అనేది విక్టరీ వెంకటేష్ ఆలోచన. ఆ విధంగా బ్రహ్మానందం ఈ చిత్రంలో జాయిన్ అయ్యారు. వీరందరితో పాటు ఫ్లోరా షైనీ, సునీల్, ఎమ్మెస్ నారాయణ సన్నివేశాలు కూడా సినిమాలో హైలైట్ గా నిలిచాయి.

