డైరెక్ట్ ఓటీటీలో దృశ్యం2, నారప్ప, విరాటపర్వం ? పెద్ద సినిమాల మధ్య నలిగిపోవడం కంటే ఇదే బెటరా?
సురేష్ ప్రొడక్షన్‌లోని మూడు సినిమాలు ఓటీటీలో రాబోతున్నాయా? వెంకీ నటించిన రెండు సినిమాలు, రానా, సాయిపల్లవి నటించిన చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
కరోనా ఫస్ట్ వేవ్ నుంచి బయటపడి వరుసగా సినిమాల విడుదలతో థియేటర్లు కళకళలాడుతున్న సమయంలో సెకండ్ వేవ్ విజృంభనతో మరోసారి మూత పడింది చిత్ర పరిశ్రమ. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో టోటల్ ఇండస్ట్రీనే కుదేలైపోయింది. ఇప్పుడు సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్ల ఓపెనింగ్‌పై ఆశలు మొదలయ్యాయి. జులై నుంచి థియేటర్లు ఓపెనింగ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాయిదా పడ్డ సినిమాలన్నీ తెరపైకి రాబోతున్నాయి.
అయితే ఏప్రిల్, మే, జూన్‌లో విడుదల కావాల్సిన సినిమాలన్నీ సెకండాఫ్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. `లవ్ స్టోరీ`, `టక్‌జగదీష్`, `పాగల్`, `విరాటపర్వం`, `నారప్ప`, `ఆచార్య`, `అఖండ`, `ఖిలాడీ`, `గల్లీ రౌడీ` వంటి సినిమాలన్నీ విడుదలకు రెడీ అవుతున్నాయి. అయితే ద్వితీయార్థంలో విడుదల కావాల్సిన సినిమాలపై వీటి ప్రభావం పడబోతుంది. థియేటర్ల కోసం మేకర్స్ కొట్టుకునే పరిస్థితి దారి తీసే అవకాశాలున్నాయి.
పెద్ద సినిమాలతో పోటీలో మధ్యస్థ సినిమాలు, చిన్న సినిమాలు నలిగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆ పోటీలో పడే కంటే కొన్ని ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నాయి. అదే సమయంలో థర్డ్ వేవ్ రాబోతుందని ఇప్పటికే సమాచారం ఉంది. సెప్టెంబర్, అక్టోబర్‌లోనే థర్డ్ వేవ్ ప్రభావం చూపబోతుందని, అది మరింత తీవ్రంగా ఉంటుందని వినిపిస్తుంది. దీంతో మళ్లీ థియేటర్లు మూత పడతాయి. అది మళ్లీ గందరగోళం నెలకొనే ఛాన్స్ ఉంది. రిలీజ్‌కి రెడీగా ఉన్న చిత్ర నిర్మాతలపై ఇది ఆర్థికంగా మరింత భారం కానుంది.
ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ గమనించిన సురేష్ ప్రొడక్షన్, సురేష్‌బాబు ఓ నిర్ణయానికి వచ్చారట. భారీ బడ్జెట్ సినిమాల మధ్య పోటీ పడటం కంటే, వాటి మధ్య నలిగిపోవడం కంటే సేఫ్‌గా ఓటీటీలో విడుదల చేయడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. థియేటర్లు ఓపెన్ అయి, మంచి డేట్ దొరికేంత వరకు వెయిట్ చేయడం కంటే డైరెక్ట్ ఓటీటీలో తమ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట సురేష్‌బాబు. ఇది అన్నిరకాలుగానూ సేఫ్ అని భావిస్తున్నారట.
ఈ క్రమంలో సురేష్ ప్రొడక్షన్‌లో రూపొందిన, వెంకటేష్ నటించిన `దృశ్యం 2`, `నారప్ప` చిత్రాలను, అలాగే రానా, సాయిపల్లవి నటించిన `విరాటపర్వం` చిత్రాన్ని ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే ఈ చిత్రాల డిజిటల్ రైట్స్ అమ్ముడు పోగా, ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. వెంకీ నటించిన `దృశ్యం2`, `నారప్ప` చిత్రాలను హాట్ స్టార్‌లో రిలీజ్‌కి సిద్ధమవుతున్నారట. వీటికి సంబంధించిన డీల్ కూడా పూర్తయ్యిందని, మంచి రేట్‌కి అమ్ముడుపోయినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన `విరాటపర్వం` చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదలకు ప్లాన్ జరుగుతుందట. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉందని, ఇంకా డీల్ ఫైనల్ కాలేదని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్.
అయితే దీనిపై దర్శకుడు వేణు ఉడుగుల స్పందించారు. తాము డైరెక్ట్ థియేటర్లోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఓటీటీలో రిలీజ్ అంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. మరి దీనిపై ఇంకా స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Venu Udugula