- Home
- Entertainment
- Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్ కళ్యాణ్
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్ కళ్యాణ్
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న `ఉస్తాద్ భగత్ సింగ్` నుంచి మొదటి పాట వచ్చింది. `దేఖ్ లేంగే సాలా` అంటూ సాగే పాట ఆద్యంతం అభిమానులను ఊపేస్తోంది.

`ఉస్తాద్ భగత్ సింగ్`తో రాబోతున్న పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది రెండు చిత్రాలతో సందడి చేశారు. `హరి హర వీరమల్లు`, `ఓజీ` చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత అభిమానులు కోరిక తీర్చారని చెప్పొచ్చు. ఇక మరో మూవీతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది టీమ్.
గబ్బర్ సింగ్ రోజులను గుర్తు చేసిన పాట
`ఉస్తాద్ భగత్ సింగ్` నుంచి ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. `దేఖ్ లేంగే సాలా` అంటూ సాగే పాటని శనివారం సాయంత్రం విడుదల చేశారు. పార్టీ మూడ్‌లో స్టేజ్‌పై సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఉర్రూతలూగించేలా ఉంది. బ్లాక్ కోట్ ధరించి ఇందులో పవన్ స్వాగ్ అదిరిపోయింది. వందల మంది డాన్సర్ల మధ్య పవన్ డాన్స్ లు మంచి ఊపు తెచ్చేలా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఆయన అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేయడం విశేషం. అభిమానులు ఎంజాయ్ చేసేలా ఈ పాట ఉంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. `గబ్బర్ సింగ్` రోజులను గుర్తు చేసేలా ఉంది.
పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ
ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత దేవిశ్రీ ప్రసాద్ పవన్‌కి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల వరుసగా తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ డీఎస్‌పీ కమ్ బ్యాక్ అయ్యారని చెప్పొచ్చు. ఈ పాటని విశాల్ దడ్లాని, హరిప్రియా ఆలపించారు. భాస్కరభట్ల రాశారు. ఈ పాటకి పవన్ చేత దినేష్ మాస్టర్ స్టెప్పులేయించారు. ఈ పార్టీ సాంగ్‌లో పవన్ కళ్యాణ్‌తో హీరోయిన్ శ్రీలీల కూడా స్టెప్పులేయడం విశేషం. దీంతో అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఇందులో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమెతోపాటు రాశీఖన్నా మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై అంచనాలు
`గబ్బర్ సింగ్` తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. దీంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పవన్ మార్క్ మాస్, కమర్షియల్ ఎలిమెంట్లతో హరీష్ దీన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పవన్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్‌లు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఏపీలోని రాజమండ్రిలోగల ఆధిత్య యూనివర్సిటీలో నిర్వహించారు. ఇందులో టీమ్ అంతా పాల్గొంది.
పవన్ కళ్యాణ్ వల్ల లేట్ కాలేదు
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ, `దేవి శ్రీ ప్రసాద్ అంటే నాకు ఒక ఎమోషన్. దర్శకుడిని బట్టే సంగీతం వస్తుంది అంటూ.. తన కష్టాన్ని కూడా మా ఖాతాలో వేస్తుంటాడు. ఒక పాట సంపూర్ణ తత్వాన్ని మీకు అందించడంలో అంకితభావంతో పని చేసే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. `పుష్ప` తర్వాత దేశంలోనే అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగినా కూడా ఇప్పటికీ మొదటి సినిమాకి పని చేసినట్టుగా పని చేస్తున్నాడు. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే నిర్మాతలు నవీన్ గారు, రవిశంకర్ గారు. వారి వల్లే ఈ సినిమాకి ఇంత భారీతనం. విజయాలు వచ్చినా, పరాజయాలు ఎదురైనా ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ వల్ల ఆలస్యమైందని కొందరు రాశారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వల్ల అసలు ఆలస్యం అవ్వలేదు. 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రయాణం గురించి వివరంగా చెబుతాను.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వెనుక కథ
మొదట ఒక ప్రేమ కథ చేయాలనుకున్నాం. కానీ, అభిమానులు `గబ్బర్ సింగ్` లాంటి సినిమా కావాలని కోరుతుండటంతో కన్ ఫ్యూజన్‌లో పడిపోయాం. అదే సమయంలో పాండమిక్ వచ్చింది. ఆ సమయంలో నేను కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను. ఏ కథ చేయాలనే కన్ ఫ్యూజన్‌లో నా వల్లే కొంచెం సమయం వృధా అయింది. ఒక రీమేక్ చేద్దామనుకొని అది కూడా పక్కన పెట్టాము. కొంచెం ఆలస్యమైనా పర్లేదు, అభిమానులందరూ మళ్ళీ మళ్ళీ చూసే సినిమా చేయాలని మా టీం అంతా కలిసి పని చేశాము. నిజానికి పవన్ కళ్యాణ్ గారి వల్లే చిత్రీకరణ త్వరగా పూర్తయింది. ఆయన మమ్మల్ని ఊపిరి ఆడనివ్వకుండా షూటింగ్ చేశారు. ఉదయాన్నే కేబినెట్ మీటింగ్ కి విజయవాడ వెళ్ళిపోయేవారు. రెండు రోజులు షూటింగ్ ఉండదేమో అనుకునేవాళ్ళం. కానీ, ఆయన రాత్రి పూట షూటింగ్ కి సమయం కేటాయించేవారు. ఉదయమంతా ప్రజాసేవలో ఉండి, రాత్రి ఫ్లయిట్ లో హైదరాబాద్ వచ్చి తెల్లవారుజాము వరకు షూటింగ్ చేసి, మళ్ళీ మంగళగిరి వెళ్ళిన రోజులున్నాయి. 18 గంటలు, 20 గంటలు పని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. మనస్ఫూర్తిగా ఆయనకు కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒక్కటే చెబుతుంటారు.. ప్రయత్నంలో లోపం ఉండకూడదని. ప్రయత్నంలో లోపం లేదు కాబట్టే.. అపజయాన్ని చూసి కూడా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు` అని తెలిపారు హరీష్ శంకర్.

