- Home
- Entertainment
- నేషనల్ అవార్డు గెలిచిన అల్లు అర్జున్ గురించి అరుదైన విషయాలు.. బన్నీ తెరవెనుక కథ మామూలుగా లేదుగా
నేషనల్ అవార్డు గెలిచిన అల్లు అర్జున్ గురించి అరుదైన విషయాలు.. బన్నీ తెరవెనుక కథ మామూలుగా లేదుగా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు సినిమాలో చరిత్ర సృష్టించారు. అరుదైన రికార్డు సృష్టించారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన అరుదైన విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

దిగ్గజ హాస్యనటుడు అల్లు రామలింగయ్య నట వారసత్వాన్ని పునికిపుచ్చుకుని నటుడిగా అరంగేట్రం చేశాడు అల్లు అర్జున్. చిన్నప్పట్నుంచి నటన, డాన్సుల్లో శిక్షణ తీసుకున్నారు. అయితే హీరోగా బన్నీకి స్ఫూర్తి మాత్రం మెగాస్టార్ చిరంజీవినే. ఆయన సారధ్యంలో డాన్సులు చేస్తూ మెప్పించారు. బన్నీలోని డాన్సు మూమెంట్స్ చూసి ఎంకరేజ్ చేశాడు. అంతేకాదు తన సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 1985 లో వచ్చిన `విజేత` చిత్రంతో బాల నటుడిగా బన్నీ తెలుగు తెరకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత `స్వాతిముత్యం`లో నటించాడు. `డాడీ`లోనూ కాసేపు బాలనటుడిగా మెరిశాడు అల్లు అర్జున్.
Allu Arjun
అల్లు రామలింగయ్య తనయుడు,అల్లు అరవింద్‌కి నటన అబ్బలేదు. నిర్మాతగా రాణించారు. దీంతో తమ వారసత్వాన్ని బన్నీ తీసుకున్నారు. అలా బన్నీ హీరోగా `గంగోత్రి` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాగానే ఆడింది. ఆ తర్వాత వచ్చిన `ఆర్య` లవ్ స్టోరీస్‌లో ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. తొలి హిట్ పడింది. `బన్నీ` చిత్రంతో బిగ్ బ్రేక్ అందుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాతోనే ఆయన `బన్నీ`గా పాపులర్ అయ్యారు. అభిమానులు ఇప్పటికీ ఆయన్ని ముద్దుగా బన్నీ అనే పిలుచుకుంటారు.
`దేశముదురు`, `జులాయి`, `రేసుగుర్రం`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు`, `అలా వైకుంఠపురములో`, `పుష్ప` చిత్రాలతో విజయాలు అందుకున్నారు బన్నీ. వీటితోపాటు `హ్యాపీ`, `పరుగు`, `ఆర్య2`, `వరుడు`, `వేదం`, `బద్రినాథ్`, `నాపేరు సూర్య` వంటి డిజస్టర్లు కూడా ఉన్నాయి. `దేశముదురు` తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఐదు ఫ్లాప్‌లను చవిచూశాడు బన్నీ. అంతేకాదు `గంగోత్రి`, `ఆర్య`, `బన్నీ`లతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నాడు. మొత్తం 19 సినిమాల్లో 9 విజయం సాధించాయి.
అయితే అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ వెనక పెద్ద కథే ఉంది. అది మాత్రం చాలా రహస్యమనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా కాలంగా జరుగుతున్నాయి. ఆ ఈవెంట్‌లో బన్నీ కూడా డాన్సులు చేశారు. అయితే ఆయన డాన్సు స్టెప్పులు కొత్తగా, ఓ రిథమ్‌తో, ఎనర్జిటిక్ గా ఉండటంతో అక్కడికి వచ్చిన దర్శకుడు కె రాఘవేంద్రరావు బన్నీని చూసి ముచ్చటపడ్డారట. ఆ టైమ్‌లోనే బన్నీ తల్లి(నిర్మల) వద్దకు వెళ్లి `మీ వాడు పెద్దయ్యాక నేనే హీరోగా పరిచయం చేస్తా` అన్నాడట. అంతేకాదు వంద రూపాయల నోటు అడ్వాన్స్ గా ఇచ్చాడట. అన్నట్టుగానే పెద్దయ్యాక `గంగోత్రి` చిత్రంతో అల్లు అర్జున్‌ని హీరోగా పరిచయం చేశాడు. అయితే ఆ సమయంలో రాఘవేంద్రరావు ఇచ్చిన వంద రూపాయల నోటు ఇప్పటికీ అలానే ఉంచుకున్నాడట బన్నీ.
ఇక రెండో సినిమాకే నంది అవార్డు అందుకున్నారు. సుకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందించిన `ఆర్య` చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా 2004లో నంది అవార్డుని సొంతం చేసుకున్నారు. దీంతోపాటు టాలీవుడ్‌కి సిక్స్ ప్యాక్ కి పరిచయం చేసిన తొలి హీరో బన్నీ. ఆయన `దేశముదురు` చిత్రంలో సిక్స్ ప్యాక్ చేశారు. ఆయన సిక్స్ ప్యాక్ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాతే చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ ట్రై చేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్, రామ్, నితిన్, సుధీర్‌బాబు వంటి చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ చేశారు.
అల్లు అర్జున్.. స్నేహారెడ్డిని వివాహం చేసుకున్నారు. 2011లో వీరి వివాహం జరిగింది. వీరికి అల్లు అయాన్, అర్హ జన్మించారు. అర్హ ఇప్పటికే `శాకుంతలం` చిత్రంలో బాలనటిగా వెండితెరంగేట్రం చేసింది. ఇదిలా ఉంటే బన్నీకి పెళ్లికి ముందు ఓ హీరోయిన్ పై క్రష్ ఉండేది. ఆమె తాను కలిసి నటించిన హీరోయిన్ కాదు. ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్. ఆమె అంటే బన్నీకి విపరీతమైన క్రష్ అట. ఆమెని ఎంతగానో ఆరాదించే వాడట. ఆమెకి పెళ్లైనప్పుడు ఆయన చాలా బాధపడ్డాడట. ఓ సందర్భంలో బన్నీ ఈ విషయాన్ని చెప్పారు.
బన్నీకి సంబంధించిన మరో అరుదైన విషయం.. కోపం వస్తే చాలా చిరాకు పడతారట. కానీ కుటుంబ సభ్యుల మీద ఆ చిరాకు ఏమాత్రం చూపించరట. తనకి తానే కోపాన్ని ఫీల్ అవుతూ ఉంటారట. మరి ముఖ్యంగా కోపం వచ్చిన వెంటనే బెడ్ రూమ్ లోకి వెళ్లి ఒక్కడే బెడ్ పై పడుకొని అసలు కోపం రావడానికి కారణం ఏంటి అనే విషయం ఆలోచిస్తూ ఆ తర్వాత కాసేపు మైండ్ ఫ్రెష్ గా చేసుకుంటారట. ఒకవేళ తన కోపాన్ని కుటుంబ సభ్యులకు ప్రదర్శిస్తే బాగుండదని వచ్చిన కోపాన్ని తనలోనే దాచుకొని మళ్లీ కోపం పోయాక రూమ్ నుండి బయటికి వచ్చి పిల్లలతో కాసేపు ఆడుకుంటారట. పిల్లలతో ఆడుకోవడం వల్ల ఆయన మైండ్ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఎప్పటిలాగే మారిపోతారట. అల్లు అర్జున్‌లో ఎవరికీ తెలియని క్వాలిటీ ఆయన మంచి ఫోటోగ్రాఫర్. తన స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం ఫోటోగ్రాఫర్‌గా మారిపోతాడు.
అల్లు అర్జున్ డాన్సులకు కేరాఫ్. బెస్ట్ డాన్సర్‌గా ఆయన ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యారు. తెలుగులోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన డాన్సులకు అభిమానులున్నారు. కేరళాలలో అయితే ఏకంగా గుడి కట్టేంత ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ ఆయన్ని మల్లు అర్జున్ అంటారు. `పుష్ప` చిత్రంతో ఆయన డాన్సు క్రేజ్ ఖండాంతరాలు దాటిపోయింది. వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయ్యారు బన్నీ. ఇందులో ఆయన మేనరిజం కూడా వైరల్ అయ్యింది. `తగ్గేదెలే` అని చెప్పే డైలాగ్ దుమ్మరేపింది. `అలా వైకుంఠపురములో` చిత్రం సమయంలో తెలుగుకే పరిమితమైన బన్నీ క్రేజ్ `పుష్ప`తో పాన్ ఇండియా రేంజ్‌కి చేరింది. ఆయన మేనరిజాన్ని ఇతర దేశాల సెలబ్రిటీలు కూడా ఫాలో కావడం విశేషం. ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్ ఏకంగా బన్నీ స్టయిల్‌ని, డాన్సులను ఇమిటేట్ చేస్తూ రీల్స్ కూడా చేస్తుంటారు.
Allu Arjun
అయితే బన్నీ చిన్నప్పుడు జిమ్నాస్టిక్స్ లో శిక్షణ పొందాడు. అదే ఆయన డాన్సు స్టయిల్‌ని ప్రత్యేకంగా నిలిపింది. ఇక బన్నీ మొదట యానిమేషన్ సైడ్ వెళ్లాలనుకున్నారు. యానిమేషన్ కూడా నేర్చుకున్నారు. ఆయనలో డ్రాయింగ్ టాలెంట్ కూడా ఉంది. మరోవైపు ఫుట్‌బాల్ గేమ్ అంటే ఇష్టం. అటు వైపు వెళ్లాలనుకున్నారు. తాను యాక్టర్ కాకపోతే ఫుట్ బాల్ ప్లేయర్ అయ్యేవారు. బన్నీ చాలా వరకు తన పుట్టిన రోజుని మానసిక వికలాంగులతో జరుపుకుంటారు. అదే సమయంలో వారికి సహాయం చేస్తారు. ఇక బన్నీలో డాన్సింగ్ స్కిల్సే కాదు, సింగింగ్ టాలెంట్ కూడా ఉంది. `సరైనోడు` చిత్రంలో ఆయన గొంతు సవరించారు. ప్రస్తుతం బన్నీ వద్ద వ్యానిటీ వ్యాన్ ఉంది. అది మిగిలిన హీరోలందరికంటే ఖరీదైనది కావడం విశేషం. మరోవైపు మెగాస్టార్‌కి పెద్ద అభిమాని. ఆయన నటించిన `ఇంద్ర` చిత్రాన్ని 15సార్లు చూశాడట.
అల్లు అర్జున్ ఇప్పుడు `పుష్ప2`లో నటిస్తున్నారు. `పుష్ప`కిది రెండో పార్ట్. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తొలి చిత్రం పెద్ద విజయం సాధించడంతో భారీ స్కేల్‌లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్‌ని టార్గెట్ చేశారు బన్నీ. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి గానూ ఆయనకు జాతీయ అవార్డు వరించిన విషయం తెలిసిందే. మరి పార్ట్ 2తో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.