ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్. ఆయన్ని పోలీసులు ఎలా పట్టుకున్నారో అప్ డేట్ వచ్చింది. ఫ్రెండ్సే ఆయన్ని పట్టించారు. అయితే అది ఎలాగో పోలీసులు తెలిపారు.

ఐబొమ్మ రవి హైదరాబాద్‌కి విడాకుల కోసం రాలేదా?
ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. చిత్ర పరిశ్రమకి పైరసీ పేరుతో వణుకు పుట్టించిన సైబర్ కేటుగాడు ఐబొమ్మ రవి గత వారం పోలీసులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఆయన తన అపార్ట్ మెంట్‌లో పోలీసులకు దొరికిపోయాడు. అయితే రవి దొరికిపోవడానికి తన భార్యనే కారణమనే వార్తలు వచ్చాయి. తన భార్యతో రవికి పడటం లేదు. చాలా రోజులుగా గొడవలు అవుతున్నాయి. విడాకుల వరకు వెళ్లింది. దీంతో ఆమెతో విడాకులు తీసుకునేందుకు వచ్చాడంటూ ప్రచారం జరిగింది. కానీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది.
ఐబొమ్మ రవిని పోలీసులు పట్టుకున్నది ఇలానే
హైదరాబాద్, వైజాగ్‌లో ఆయనకు కొన్ని ఆస్తులున్నాయని, పలు రియల్ ఎస్టేట్ కంపెనీలతో భాగస్వామ్యం అయ్యాడని, వాటిని అమ్ముకోవడానికే రవి ఇండియాకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది. రవిని పోలీసులు ఎలా గుర్తించారనే విషయానికి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఆయన ఫ్రెండ్ ద్వారా రవిని పట్టుకున్నారట. అప్పటికే పోలీసులు రవి ఫ్రెండ్ కాంటాక్ట్స్ ని సంపాదించారట. ఈ మెయిన్ ద్వారా తన స్నేహితుడి ఫోన్ నెంబర్‌ని గుర్తించారు పోలీసులు. అతని ఫోన్ పై నిఘా ఉంచారు. ఫ్రెండ్‌కి రవి నుంచి మెసేజ్ వచ్చిందట. `మామా హైదరాబాద్ వచ్చాను, రా కలుద్దాం` అని సందేశం పంపించాడట. తాను హైదరాబాద్‌కి వచ్చినట్టుగా, కలవడానికి ఫ్లాట్‌కి రావాలని మెసేజ్ పెట్టడంతో ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆయన ఫ్లాట్‌కి వెళ్లి పట్టుకున్నారట. తాజాగా ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
తెలియదు గుర్తులేదు
ఇక నాలుగు రోజులు పోలీసుల రిమాండ్‌లో ఉన్న రవికి రిమాండ్ ఈ రోజు సోమవారంతో ముగుస్తుంది. అయితే ఆయన పోలీసులకు ఏ వివరాలు చెప్పడం లేదట. కీలక విషయాలను చెప్పేందుకు మొండికేస్తున్నట్టు తెలుస్తోంది. గుర్తు లేదని, మర్చిపోయానని, గుర్తు వచ్చినప్పుడు చెబుతా అంటున్నాడట. తన ల్యాప్ టాప్‌లు, మొబైల్ ఫోన్లకి సంబంధించిన ఐపీ అడ్రస్ వివరాలు చెప్పడం లేదని, ఎథికల్ హ్యాకర్స్ తో వాటిని కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. రవి కేసులో హైదరాబాద్ సైబర్ పోలీసులే కాదు, ఈడీ కూడా రంగంలోకి దిగిందని, ఆయన బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
రవికి ప్రజల నుంచి సపోర్ట్
రవి అకౌంట్ల నుంచి మూడున్నర కోట్లు ఫ్రీజ్ చేశారు. ఆయన అకౌంట్ల నుంచి రూ.20కోట్ల ట్రాన్సక్షన్ జరిగింది. అంతేకాదు క్రిప్టో కరెన్సీ బదిలీ కూడా చేసినట్టు పోలీసులు గుర్తించారు. వన్ విన్, వన్ ఎక్స్ బెట్టింగ్‌యాప్‌ల ద్వారా ఇమంది రవికి ఆదాయం వచ్చిందని, ప్రహ్లాద్ పేరుతో నకిలీపాస్ పోర్ట్ ఉపయోగిస్తున్నట్టు, క్రిప్టో కరెన్సీ మార్పిడికి బినామీ ఖాతాల ద్వారా నగదు బదిలీ చేస్తున్నట్టు రవి రిమాండ్‌లో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. వెబ్ సైట్‌ని కొంత మందితో కలిసి నిర్వహిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో, దీనికి రవి క్లారిటీ ఇచ్చారట. తాను ఒక్కడినే ఇదంతా చేశానని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని తెలిపారట. అయితే హ్యాకింగ్‌కి సంబంధించి, వెబ్ సైట్ రన్ చేయడానికి సంబంధించిన వివరాలు చెప్పడం లేదట. తనని పట్టుకునేందుకు పోలీసులు వస్తున్నారని గుర్తించిన రవి ముందుగానే ల్యాప్ ట్యాప్‌లో డాటా మొత్తం డిలీట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం విచారణలో ఆయన ఎలాంటి విషయాలు చెబుతాడో చూడాలి. ఇదిలా ఉంటే ఐబొమ్మ రవికి ప్రజల నుంచి సపోర్ట్ పెరుగుతోంది. కామన్ మ్యాన్ పాలిట ఆయన దేవుడు అంటూ, హీరో అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. సినిమా టికెట్ రేట్ల పేరుతో ఇండస్ట్రీ ఆడియెన్స్ ని దోచుకుంటుందని, థియేటర్ కి వెళ్లి సినిమా చూడలేని వారికి రవి ఫ్రీగా మూవీస్ చూపిస్తున్నారని కామెంట్లు చేయడం విశేషం.

