- Home
- Entertainment
- రాజశేఖర్ `అన్న`తో పోటీ పడి డిజాస్టర్‌గా నిలిచిన చిత్రాలివే.. చిత్తైపోయిన సూపర్‌స్టార్ కృష్ణ
రాజశేఖర్ `అన్న`తో పోటీ పడి డిజాస్టర్‌గా నిలిచిన చిత్రాలివే.. చిత్తైపోయిన సూపర్‌స్టార్ కృష్ణ
హీరో రాజశేఖర్ 90లో తిరుగులేని స్టార్‌గా రాణించారు. అలాంటి సమయంలో తనతో పోటీ పడ్డ సూపర్ స్టార్ కృష్ణ చిత్తైపోయాడు. `అన్న` సినిమా దెబ్బకి డిజాస్టర్‌ని చవిచూడాల్సి వచ్చింది. బాలయ్య మూవీ యావరేజ్‌గా నిలిచింది.

రాజశేఖర్ `అన్న`తో పోటీ చిత్తైపోయిన కృష్ణ, నరేష్, సురేష్
హీరో రాజశేఖర్ ఇప్పుడు హీరోగా స్ట్రగుల్ అవుతున్నారు. గత కొంత కాలంగా ఆయనకు హిట్స్ లేకపోవడంతో ఆయన కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది. కానీ 90లో మాత్రం ఆయన స్టార్ హీరోగా రాణించారు. బిగ్ స్టార్స్ చిరంజీవి, కృష్ణ, బాలయ్య, నాగార్జున వంటి వారికి పోటీ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో వాళ్లకే ఝలక్ ఇచ్చారు. బ్యాక్ టూ బ్యాక్ యాక్షన్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుని ఇతర హీరోలకు నిద్ర లేకుండా చేశారు. అలా చేసిన చిత్రాల్లో `అన్న` ఒకటి. ఈ మూవీతో పోటీ పడి సూపర్ స్టార్ కృష్ణ సినిమా చిత్తైపోయింది. నరేష్, సురేష్ సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. హిట్ కావాల్సిన బాలయ్య మూవీ యావరేజ్‌గా నిలిచింది. ఆ కథేంటో చూద్దాం.
యాక్షన్ హీరోగా ఓ ఊపు ఊపేసిన రాజశేఖర్
ఒకప్పుడు యాంగ్రీయంగ్ మేన్‌గా పేరు తెచ్చుకున్నారు రాజశేఖర్. ఆయన ప్రారంభంలో అన్ని యాక్షన్ చిత్రాలే చేశారు. ఆవేశంతో కూడిన పాత్రలతో అదరగొట్టారు. ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. రాజశేఖర్ డైలాగ్ డెలివరీ, సెంటిమెంట్, యాక్షన్‌కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అందుకే బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత `అల్లరి ప్రియుడు` తర్వాత ఆయన ఇమేజ్ మారిపోయింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో రొమాంటిక్ హీరోగా మారిపోయారు.
బ్లాక్ బస్టర్‌గా నిలిచిన `అన్న` మూవీ
ఈ క్రమంలోనే వచ్చిన యాక్షన్ మూవీ `అన్న`. `అల్లరి ప్రియుడు`, `గ్యాంగ్ మాస్టర్`, `ఆవేశం` తర్వాత ఈ చిత్రం వచ్చింది. కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ మేళవింపుతో ఉన్న యాక్షన్ చిత్రమిది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో గౌతమి, రోజా హీరోయిన్లుగా నటించారు. రోజా గ్లామర్ రోల్ చేయడం విశేషం. పల్లెటూరి నుంచి పట్నం వెళ్లిన రాజశేఖర్ తమ్ముడిని ఓ రౌడీ ముఠా చంపడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ మూవీ. ఆద్యంతం సెంటిమెంట్, ఎమోషన్స్, యాక్షన్, గ్లామర్, లవ్ స్టోరీ మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. 1994 ఏప్రిల్ 7న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగానూ సంచలనాలు సృష్టించింది. అయితే ఇందులో బ్రహ్మానందం పాత్ర చనిపోవడం అందరిని కలిచివేస్తుంది.
`అన్న`తో పోటీ పడి చిత్తైపోయిన కృష్ణ `ఘరానా అల్లుడు`
సరిగ్గా ఈ మూవీతో అదే రోజు పోటీపడ్డారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన హీరోగా నటించిన `ఘరానా అల్లుడు` సినిమా కూడా ఏప్రిల్ 7నే విడుదలైంది. ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో మాలాశ్రీ హీరోయిన్‌గా నటించింది. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, సుధాకర్, అలీ, శ్రీహరి వంటి వారు నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. దీనికి పోసాని కృష్ణ మురళి కథ అందించడం, ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఇలా భారీ తారాగణం, భారీ టెక్నీషియన్లు పనిచేసినా ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. రాజశేఖర్ `అన్న` బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో ఆ సినిమా ముందు కృష్ణ `ఘరానా అల్లుడు` చిత్తైపోయింది.
యావరేజ్‌గా నిలిచిన బాలయ్య `బైరవ ద్వీపం`
రాజశేఖర్ `అన్న`కి వారం ముందు(మార్చి 31న) విడుదలైన నరేష్, దివ్యవాణి నటించిన `పెళ్లికొడుకు` మూవీ.. సురేష్, మాలాశ్రీ జంటగా నటించిన `తోడికోడల్లు` మూవీస్ కూడా డిజాస్టర్ అయ్యాయి. మొదటి వారం మామూలుగానే ఆడిన ఈ చిత్రాలు పుంజుకునే సమయంలోనే రాజశేఖర్ `అన్న` విడుదలైంది. దీంతో ఈ సినిమా దెబ్బకి అవి చిత్తైపోయాయి. అయితే `అన్న`కి వారం తర్వాత వచ్చిన బాలయ్య, రోజా ల `భైరవ ద్వీపం` బాగానే ఆడింది. కాకపోతే బ్లాక్ బస్టర్‌గా నిలవలేకపోయింది. అందుకు `అన్న` కూడా ఓ కారణం. ఇలా యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ అప్పట్లో ఓ ఊపు ఊపేశారని చెప్పడానికి ఈ సక్సెస్ ఓ కారణంగా చెప్పొచ్చు.

