- Home
- Entertainment
- TV
- Gunde Ninda Gudi Gantalu: రోహిణీ చేతిలో బకరా అయిన మనోజ్, చింటూని వారసుడిగా ఒప్పుకోనున్న ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ చేతిలో బకరా అయిన మనోజ్, చింటూని వారసుడిగా ఒప్పుకోనున్న ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ కొడుకు చింటూని దత్తత తీసుకోవాలని బాలు, మీనా డిసైడ్ అవుతారు.ఇదే విషయం ఇంట్లో చెప్పి, ఒప్పించాలని కూడా అనుకుంటారు. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీ కోసం...

గుండె నిండా గుడి గంటలు..
బాలు ఇంట్లో టెన్షన్ గా తిరుగుతూ ఉంటాడు. సత్యం కి మీనా ట్యాబ్లెట్స్ ఇస్తుంది. అప్పుడే ప్రభావతి కూడా వస్తుంది. ఈ కారు ఏంటి? అటూ ఇటూ తిరుగుతోంది? అని ప్రభావతి అడిగితే.. ఇందాకటి నుంచి నాకు కూడా అర్థం కావడం లేదు అని సత్యం చెబుతాడు.‘ మీనా మిగితా వాళ్లను కూడా పిలుచుకొని రా’ అని బాలు చెబుతాడు. మీనా వెళ్తుంది. ‘ ఏం జరుగుతోంది?’ అని ప్రభావతి అడిగితే.. ‘ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నాను’ అని బాలు అంటాడు.‘ నీ పెళ్లాన్ని తీసుకొని వేరే కాపురానికి వెళ్తున్నావా?’ అని ప్రభావతి అడిగితే.. ‘ నేను , మీనా ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతే.. నీ ముఖాన కాసిని మంచి నీళ్లు పోసే దిక్కు కూడా ఉండదు’ అని బాలు అంటాడు. ‘ నిజమే కదా వాడు చెప్పింది. రోహిణి కానీ, శ్రుతికానీ మీనాలాగా ఇంటి పట్టునే ఉండి నీకు టైమ్ కి కాఫీలు, టీలు రెడీ చేసి పెడతారా? వీడు అడుగుతాడన్న భయంతో అయినా మనోజ్ గాడు తగ్గి ఉంటున్నాడు. లేదంటే...వీడి భాషలో ఇంట్లో ఉన్న బంగారం అంతా మింగేసి.. మంచినీళ్లు తాగుతాడు. వీళ్లు ఇద్దరూ వెళ్లిపోతే మనమిద్దరం ఇంటి ముందు వాచ్ మెన్ జాబ్ చేయాల్సిందే’ అని సత్యం గట్టిగా చెబుతాడు. ఈ లోగా మీనా ఇంట్లో అందరినీ తీసుకొస్తుంది. రోహిణీ మాత్రమే ఉండదు. తను ఇంకా డ్యూటీ నుంచి ఇంటికి రాదు.
‘ ఏంటో.. ఆ చరిత్రాత్మక నిర్ణయం. పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావు అంటే.. ఏదో పెద్ద విషయమే’ అని ప్రభావతి అడుగుతుంది. సరిగ్గా అదే సమయానికి రోహిణీ.. ఇంట్లోకి వస్తూ బాలు, మీనా మాటలు విని.. గుమ్మం దగ్గరే ఆగిపోతుంది.‘ ఈ రోజు మేమిద్దరం చింటూ వాళ్ల ఇంటికి వెళ్లాం. అక్కడ ఓ రహస్యం బయటపడింది. చిన్న పిల్లాడి బర్త్ డే కాబట్టి డ్రెస్ తీసుకొని వెళ్లాం’ అని బాలు అంటే.. ‘ అయినోళ్లకు ఆకుల్లో.. కానోళ్లకు కంచాల్లో పెట్టడం నీకు అలవాటే కదా’ అని ప్రభావతి సెటైర్ వేస్తుంది. ‘ మీనా పక్కింట్లో నుంచి బాదం ఆకులు కోసుకొచ్చి.. మా అమ్మకు ఆ ఆకుల్లోనే పెట్టు’ అని బాలు కూడా సెటైర్ వేస్తాడు. ‘ ప్రభా... వాడిని విషయం చెప్పనివ్వు’ అని సత్యం అంటాడు.
ఇంట్లో వాళ్ల మాటలు విని ఏడ్చేసిన రోహిణీ..
బాలు మాట్లాడటం మొదలుపెడతాడు. ‘ చింటూ బర్త్ డేకి అని వెళ్తే.. మాకు భయంకరమైన నిజం తెలిసింది. చింటూ కన్న తల్లి గురించి తెలిసింది’ అని బాలు అనగానే...‘ అయిపోయింది.. నిజం తెలిసిపోయింది. నేను ఇటు నుంచి ఇటే పారిపోయి ఎక్కడైనా తలదాచుకోవాలి. ఇంట్లో వాళ్లు అందరూ తరిమి తరిమి కొట్టేలోగా నేనే పారిపోవాలి’ అని రోహిణీ భయపడిపోతుంది. ‘ ఆ అబ్బాయికి అమ్మా, నాన్న ఎవరూ లేరని చెప్పావు కదా’ అని సత్యం అంటే.. ‘ అదంతా అబద్ధం.. చింటూకి అమ్మ ఉంది. ఆ అమ్మ ఎవరో కాదు.. దుబాయిలో వాళ్ల అత్త ఉందని వాళ్ల అమ్మమ్మ చెబుతుంది కదా.. ఆ అత్త అత్త కాదు.. ఆమే అమ్మ’ అని బాలు అంటాడు. అయితే చింటూ అమ్మ తానే అని తెలియలేదని రోహిణీ కాస్త ఊపిరి పీల్చుకుంటుంది.
‘ చింటూ తల్లి ఆ సుగుణమ్మ కూతురేనంట. ఆ సుగుణమ్మ కూతురికి చిన్నప్పుడే పెళ్లి చేసేసిందంట.చింటూని కన్నాక వాళ్ల నాన్న చనిపోయాడంట. అప్పుడు దుబాయి వెళ్లి సంపాదించడం మొదలుపెట్టిన ఆమె.. వీళ్లకు డబ్బులు పంపుతోంది. కానీ చింటూని చూడటానికి మాత్రం రావడం లేదంట. పైగా అమ్మ అని కాకుండా.. అత్త అని పిలవమని చెబుతోందంట’ అని బాలు చెబుతాడు. ‘ కన్న తల్లిని తల్లి అని పిలవకూడదనే తల్లి అసలు తల్లేనా ?తను ఎక్కడో దూరంగా ఉంటూ ఇక్కడ కొడుకును అనాథను చేస్తుందా? ’ అని సత్యం సీరియస్ అవుతాడు. ‘ కన్న కొడుకును ఎవరైనా అలా చూస్తారా?’ అని రవి అంటే.. ‘ ఎందుకు చూడరు? మన ఇంట్లోనే ఉంది కదా మాతృమూర్తి ప్రభావతమ్మ. ఈ అమ్మావతి ఎప్పుడైనా నన్ను కొడుకుగా చూసిందా?’ అని బాలు అంటే.. ‘ నువ్వు ముందు విషయం చెప్పు’ అని ప్రభావతి అంటుంది. ‘ నీలాంటి తల్లి చింటూకి కూడా ఉంది. నీ ప్రేమ దొరకక నేను బామ్మ దగ్గర పెరిగినట్లు, తల్లి ప్రేమ దొరకక ఆ చింటూ వాళ్ల అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నాడు. తల్లి ప్రేమ దొరకకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు’ అని బాలు అంటాడు. ఆ మాటలకు అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. రోహిణీ అయితే.. బయట ఎక్కిళ్లు పెట్టి ఏడ్చేస్తుంది.
చింటూని వారసుడిగా ఒప్పుకోని ప్రభావతి
రవి, శ్రుతి కూడా చింటూ తల్లి చేసింది తప్పే అన్నట్లు గా మాట్లాడతారు. ‘ అయితే ఆ లేడీ పెద్ద కిలాడీ, కేడీ అయ్యి ఉంటుంది. పెద్ద ఫ్రాడ్ అయ్యి ఉంటుంది. కొడుకు ఉన్నా లేడు అని చెప్పుకుంటోంది. అలాగే దుబాయి లో ఎవరో బకరాని పెళ్లి చేసుకొని ఉంటుంది. ఎవరు మోసపోయారో ఏమో పాపం’ అని మనోజ్ అంటాడు. ‘ అలాంటి ఆడది ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం సర్వ నాశనం అయిపోతుంది.. అలాంటి ఆడదాని వల్ల వంశమే భ్రష్టు పట్టిపోతుంది’ అని ప్రభావతి కూడా అంటుంది.‘ పాపం.. ఆ బాబుని తలుచుకుంటే చాలా బాధగా ఉంది’ అని సత్యం అంటే.. ‘ అందుకే..ఒక నిర్ణయం తీసుకున్నాం.. నేను, మీనా కలిసి చింటూని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాం’ అని బాలు, మీనా కలిసి చెబుతారు. అది విని ఇంట్లో అందరూ, బయట ఉన్న రోహిణీ కూడా షాక్ అవుతారు.
‘ ఏమంటున్నావ్ రా..?’ అని ప్రభావతి అంటే.. ‘ వాళ్ల అమ్మమ్మ ఆరోగ్యం బాగోవడం లేదు. ఆవిడ ఉన్నంతకాలం వరకు పర్వాలేదు. ఆవిడకు ఏదైనా అయితే చింటూ అనాథ అయిపోతాడు. కన్న తల్లి తన సుఖం చూసుకొని వెళ్లిపోయింది కాబట్టి.. చింటూని పట్టించుకోదు. అందుకే... మేం దత్తత తీసుకుంటాం’ ని బాలు చెబుతాడు. అయితే.. దేవుడి నిర్ణయం అనుకూలంగా రాలేదు అని మీనా చెప్పేలోగా.. బాలు కవర్ చేస్తాడు. మీనా ని నిజం చెప్పనివ్వడు.
‘ ఏంటీ.. దేవుడు నీతో చెప్పాడా? అయితే... నేను చెబుతున్నా విను.. ఆ దేవుడు చెప్పినా నేను వినను. వాడిని దత్తత తీసుకోవడానికి నేను ఒప్పుకోను. ఇది ఏమైనా ఆశ్రమం అనుకున్నావా? అనాథలకు ఆశ్రయం ఇవ్వడానికి తల్లికే అక్కర్లేని వాడు..వాడిది ఏం జాతకం’ అని ప్రభావతి తేల్చిచెబుతుంది. ‘ ఇది నిజంగా గొప్ప నిర్ణయం. పాపం వాడికి ఎవరూ లేరు కదమ్మా’ అని రవి అంటే.. ‘ అయితే.. మన ఇల్లే దొరికిందా? పాపం అనిపిస్తే డబ్బులు, బట్టలు ఇవ్వండి, స్కూల్ ఫీజ్ కట్టండి.. ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు’ అని ప్రభావతి చాలా సీరియస్ గా చెబుతుంది.
చింటూని పెంచుకోవడానికి ఒప్పుకొమ్మని రవి అడిగితే..‘చిన్నప్పుడు నువ్వు కుక్కను పెంచుకుంటాను అంటేనే ఒప్పుకోని దానిని.. ఎవడికో పుట్టిన వాడిని నా ఇంటి వారసుడిగా ఎలా ఒప్పుకుంటాను?’ అని ప్రభావతి సీరియస్ అవుతుంది. ‘ అయినా.. నీకు పిల్లలు పుట్టరు అని ఏ డాక్టర్ చెప్పలేదు కదా.. ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయ్? ’ అని ప్రభావతి అడిగితే.. ‘ మాకు తర్వాత ఎవరు పుట్టినా.. పెద్దవాడు మాత్రం చింటూనే అవుతాడు’ అని బాలు చెబుతాడు. ‘ మీరు సంపాదించే డబ్బు మీకే సరిపోవడం లేదు.. మీరు ఇంకో కుర్రాడిని పెంచుతారా’ అని ప్రభావతి వెటకారం చేస్తుంది. ‘ అది మేం చూసుకుంటాం.. నీకు ఎందుకు ?’ అని బాలు సమాధానం ఇస్తాడు.‘ ఇది నా ఇల్లు.. ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదో నేనే చెప్పాలి’ అని ప్రభావతి అంటే.. ‘ ఇది ప్రభావతి ఇల్లు.. మేమంతా రెంట్ కి ఉంటున్నాం’ అని బోర్డు పెడతాను అని బాలు అంటాడు.
తల్లికి రోహిణీ వార్నింగ్..
సరిగ్గా అప్పుడే రోహిణీ ఇంట్లోకి వస్తుంది. ‘ పార్లరమ్మా... మేం చింటూని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాం..నువ్వేమంటావ్..?’ అని రోహిణీని బాలు అడుగుతాడు.‘ ఈ ఇంటి పెద్ద కోడలివి నువ్వు చెప్పు రోహిణీ’ అని ప్రభావతి కూడా అడుగుతుంది. ‘ బాలు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. కానీ, తరతరాలుగా మన రక్తం, మన వంశం అని మాట్లాడుకునే మనకు ఈ విషయం అంత తొందరగా జీర్ణం అవ్వదు.. పైగా అటు చింటూ వాళ్ల అమ్మమ్మ కూడా ఒప్పుకోవాలి.. అన్నింటికంటే ముందుగా చింటూ దత్తత రావడానికి ఒప్పుకోవాలి. నిజంగా ఆ అబ్బాయి ఈ ఇంటికి రావాలి అని రాసి ఉంటే.. ఆ దేవుడే చేరుస్తాడు’ అని సత్యం అంటాడు.
రోహిణీ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటుంది. రాత్రి పూట ఈ విషయం గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది.‘ ఈ బాలు వల్ల ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఈ సారి నిజంగానే, చింటూని ఇంటికి తీసుకొచ్చేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేసి ఆపాలి’ అని అనుకుంటుంది. బాగా ఆలోచించి వాళ్ల అమ్మకి ఫోన్ చేస్తుంది. చింటూ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. చింటూకి ఏదో ఒకటి చెప్పి.. వాళ్ల అమ్మకు ఫోన్ ఇవ్వమని అడుగుతుంది.
ఇక.. తల్లి ఫోన్ తీసుకొని మాట్లాడటం మొదలుపెట్టగానే.. రోహిణీ చాలా సీరియస్ అవుతుంది. తల్లిని ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంది. మీనాతో మాటలు కలపడం వల్లనే ఇలా జరిగిందని.. ఇప్పుడు వాళ్లు చింటూని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారు అనే విషయం చెబుతుంది. ఆ మాట విని సుగుణమ్మ చాలా సంతోషిస్తుంది.బాలుకి దత్తత ఇస్తే.. మీ ఇంట్లోనే ఉంటాడు.. రోజూ నువ్వు నీ కొడుకును చూసుకోవచ్చు అని సుగుణమ్మ చెబుతుంది.
కానీ రోహిణీ మాత్రం చాలా సీరియస్ అవుతుంది. నువ్వు ఇంకోసారి బాలు, మీనాలతో మాట్లాడొద్దు అని..వాళ్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయద్దు అని వార్నింగ్ ఇస్తుంది. ఇంటికి వచ్చినా ఏదో ఒకటి తిట్టి పంపేయమని చెబుతుంది. రోహిణీ చెప్పిన మాటలు నచ్చకపోయినా.. తప్పక.. సుగుణమ్మ కూడా సరే అంటుంది.
తర్వాత బాలు, మీనా చింటూ వాళ్ల అమ్మమ్మకు ఫోన్ చేస్తారు. కానీ.. కూతురు వాళ్లతో మాట్లాడొద్దని చెప్పడంతో సుగుణమ్మ ఆ ఫోన్ ఎత్తదు. ఇంటికి వెళ్లి మాట్లాడదాం అని బాలు అంటే.. తొందరపడొద్దని మీనా సర్ది చెబుతుంది. సరే అని బాలు ఒప్పుకుంటాడు.
ఇక..మరుసటి రోజు రోహిణీ తన ఫ్రెండ్ కి తన పరిస్థితి గురించి వివరిస్తుంది. సుగుణమ్మ, చింటూలను ఇల్లు మార్చాలని నిర్ణయించుకుంటుంది. తొందరలోనే తన కొడుకు గురించి నిజాలు చెప్పాలని అనుకుంటున్నట్లు చెబుతుంది.
కమింగప్ లో.. రోహిణీ రెండోసారి బిడ్డను కనేందుకు ప్లాన్ చేసుకునేందుకు హాస్పిటల్ కి వెళ్తుంది. అది కాస్త మీనా చెల్లెలు కంట పడుతుంది.

