Gunde Ninda Gudi Gantalu: మారిపోయిన మనోజ్.. రోహిణీ, ప్రభావతిలకు ఊహించని బహుమతి
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ హాస్పిటల్ కి వెళ్లిందని తెలిసి.. నిజంగానే ప్రెగ్నెంట్ ఏమో అని అనుకుంటుంది మీనా. అదే విషయం స్వీట్ చేసి మరీ ఇంట్లో పెడుతుంది. కానీ, నిజం కాదని తెలిసి అందరూ బాధపడతారు మరి నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా...

Gunde Ninda Gudi Gantalu
రోహిణీ, మనోజ్ గొడవ పడిన విషయం ప్రభావతికి తెలుస్తుంది. తన కొడుకుని అవమానించినందుకు కోపం వచ్చి రోహిణీని తిడుతుంది. ఆ తర్వాత కొడుకుని తీసుకొని పక్కకు వస్తుంది. ‘ అంతా నా తలరాత. నీ కారణంగా ఎప్పుడూ ఎవరో ఒకరితో తిట్లు తింటూనే ఉన్నాను. అసలు తనకు ఉన్నట్టుండి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది రా?’ అని ప్రభావతి అడుగుతుంది. ‘ చెప్పాను కదమ్మా.. పిల్లల గురించి అని’ మనోజ్ బదులిస్తాడు. ‘ లేదురా.. నాకు ఎందుకో సందేహం గా ఉంది. పెళ్లికి ముందు తన జీవితం ఏంటో మనకు తెలీదు కదా’ అని ప్రభావతి అంటే.. ‘ అదేంటమ్మా అలా ఉన్నావ్.. మా ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు. తను నా దగ్గర ఏం దాచదు కూడా ’ అని మనోజ్ అంటాడు. ‘ ఒరేయ్ పిచ్చి మాలోకం.. నువ్వు దానికి అన్నీ చెప్పావ్ రా.. కానీ, తను అన్నీ నీకు చెప్పింది అనడానికి గ్యారెంటీ ఏంటి? ఎప్పుడూ నీ పక్కనుంచే కాదురా.. అన్ని వైపుల నుంచి ఆలోచించు. ఇన్ని డిగ్రీలు చదివావు అనే గానీ.. లోకం పోకడ తెలీదు మొద్దు’ అంటూ తల మీద ఒక్కటి పీకుతుంది. ‘ అమ్మా.. నువ్వు ఇప్పుడు నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నావ్’ అని మనోజ్ అంటే.. ‘ లేదురా.. తను నీ దగ్గర ఏదో విషయం దాస్తుందని అనిపిస్తోంది.. నువ్వు తన దగ్గర అన్నీ చెప్పావ్.. కానీ తను నీ దగ్గర అన్నీ చెప్పిందో లేదో కాస్త స్థిమిత పడ్డాక మెల్లగా వెళ్లి అడుగు. తనని మళ్లీ మామూలు స్థితికి తీసుకురా.. నిదానంగా ప్రేమగా అడిగి తెలుసుకో’ అని చెబుతుంది. మనోజ్ సరే అంటాడు.
పిల్లలు కావాలన్న మీనా..
బాలు.. తాము దాచిన డబ్బు ఎంత ఉందా అని లెక్క పెడుతూ ఉంటాడు. అప్పుడే మీనా వస్తుంది. కానీ, మీనా వచ్చింది బాలు పట్టించుకోడు. దీంతో మీనా కాస్త జరిగి మరీ బాలు పక్కన కూర్చొని.. ‘ రాత్రి అయ్యింది..చల్లగాలి హాయిగా ఉంది.. ఇద్దరమే ఉన్నాం’ అని మీనా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటే.. బాలు మాత్రం ఈఎంఐ, పెట్రోల్,ఇంటి ఖర్చులు అని మాట్లాడతాడు. ‘ ఎప్పుడూ డబ్బేనా?’ అని మీనా విసుక్కుంటే.. ‘రూమ్ కట్టాలి.. మేస్త్రీకి డబ్బులు ఇవ్వాలి’ అని అంటాడు. మీతో మాట్లాడాలి అని మీనా అంటే.. బాలు ఏంటి నీ గోల అని విసుక్కుంటాడు. దీంతో మీనా అలుగుతుంది. తర్వాత.. అసలు విషయం మాట్లాడటం మొదలుపెడుతుంది. ‘ రోహిణీ పిల్లల కోసం పరీక్ష చేయించుకుంది కదా.. అంటే.. పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు అనే కదా అర్థం. మనకు వాళ్ల కంటే ముందే పెళ్లి అయ్యింది కదా అంటే.. ముందు మనకే కదా పిల్లలు పుట్టాల్సింది’ అని మీనా అనగానే బాలు ఉలిక్కి పడతాడు. ‘ అయ్య బాబోయ్.. ఇప్పటికే ఈఎంఐలు కట్టాలి, రూమ్ కట్టాలి, ఇంటి ఖర్చులకు ఇవ్వాలి.. ఇన్ని ఖర్చులు పెట్టుకొని పిల్లలు అంటే.. సంపాదించింది అంతా వాళ్ల డైపర్లకే ఖర్చు అయిపోతుంది.. పిల్లలు వద్దు’ అని బాలు అంటాడు. దీంతో.. మీనా అలిగి అటుతిరిగి కూర్చొంటుంది. కానీ.. ఆమె పెట్టుకున్న మల్లెపూల వాసన బాలుని లాగుతూ ఉంటుంది. దీంతో.. ఆ డబ్బులు పక్కన పెట్టేసి.. మీనా అంటూ దగ్గరకు వస్తాడు. అప్పుడు మీనా విసుక్కుంటుంది. తర్వాత ఒక రొమాంటిక్ సాంగ్ కి ఇద్దరూ డ్యాన్స్ వేస్తారు.
రోహిణీ, తల్లికి ఖరీదైన బహుమతులు తెచ్చిన మనోజ్..
మరుసటి రోజు బాలు తన కారు గురించి తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు. మధ్యలో ప్రభావతి వచ్చి బాలు మీద కౌంటర్లు వేస్తుంది. అప్పుడే మనోజ్ వచ్చి.. రోహిణీని పిలుస్తాడు. చేతిలో సంచులు చూసి ఏంటి అవి..? అని బాలు అడిగితే..మా గురూజీ ఆశీర్వాదం అని మనోజ్ చెబుతాడు. ‘ మాటి మాటికీ గురూజీ గురూజీ అనకురా.. ఏదో ఒక రోజు నీకు గుండు చేయిస్తాడు’ అని బాలు కౌంటర్ వేస్తాడు.కానీ మనోజ్ మాత్రం.. ‘ గురూజీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధించొచ్చు’ అని అంటాడు. రోహిణీ.. ఆ బ్యాగ్స్ ఏంటి అని అడిగితే.. షాపింగ్ చేశాను అని మనోజ్ చెబుతాడు.‘ఎన్ని మింగావ్.. ఎన్ని కొన్నావ్’ అని బాలు అంటే.. ‘ ఏమండీ.. ఆయన జీవితంలో మొదటిసారి షాపింగ్ చేశారు.. మీరు ఎందుకు మింగావ్ మింగావ్ అంటారు’ అని మీనా అంటుంది. వెంటనే బాలు.. ‘ మనకు నెలకు రూ.50వేలు ఇవ్వాలి కదా ’ అనే విషయాన్ని గుర్తు చేస్తాడు. ఇక.. రోహిణీ నా కోసం ఏం తెచ్చావ్ అని అడిగితే.. గతంలో తాకట్టు పెట్టిన రోహిణీ మంగళసూత్రం తీసుకొచ్చి ఇస్తాడు. ప్రభావతి, రోహిణీ సంతోషిస్తారు. ఇచ్చిన మాట మీద నిలపడ్డాను అని మనోజ్ అంటే.. బాలు కాళ్లు ఎత్తి చూస్తాడు. ఆ సీన్ ఫన్నీగా ఉంటుంది. కాసేపు బాలు సెటైర్లు వేస్తాడు. మంగళసూత్రాన్ని ప్రభావతి చేతుల మీదగా మెడలో వేయమని మనోజ్ అంటే.. మనోజ్ నే వేయమని ప్రభావతి చెబుతుంది. రోహిణీ దానిని తీసుకొని వెళ్లి దేవుడు దగ్గర పెడుతుంది. దీని వెనక ఏదో తిరకాసు ఉందని బాలుకి అనుమానం వస్తుంది. తర్వాత.. మనోజ్ ఆ చైన్.. రోహిణీ మెడలో వేస్తాడు. వాళ్లిద్దరూ కలిసి అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ‘ మొదటిసారి పోగొట్టడం కాకుండా.. ఇంటికి బంగారం తీసుకువచ్చావ్.. మీ భార్యకు ఇంకా చాలా నగలు చేయించాలి’ అని సత్యం కూడా సంతోషంగా ఆశీర్వదిస్తాడు. ప్రభావతి మాత్రం.. బాలు, మీనా లమీద సెటైర్లు వేస్తుంది.. కొందరు చెబుతారు కానీ చేయరు అని అంటే.. బాలు వెంటనే అది మేమే.. అని అంటాడు. సత్యం.. ప్రభావతిని తిడతాడు. ‘ నీకు మనోజ్ ని పొగడాలి అనిపిస్తే.. పొగుడు కానీ.. ఇంకో కొడుకుని తక్కువ చేయద్దు’ అని అంటాడు. దానికి మీనా.. ‘ పర్వాలేదు మామయ్య.. మాకు కాస్త పట్టుదల తగ్గితే.. అత్తయ్య మాటలకు మళ్లీ పౌరుషం పెరిగి.. తొందరగా పూర్తి చేస్తాం’ అని అంటుంది.
వెంటనే అమ్మ కోసం ఏం తెచ్చావ్ అని బాలు అంటే.. పట్టుచీర తెచ్చాను అని చెప్పి.. ప్రభావతికి ఇస్తాడు. చీర చూసి ప్రభావతి మురిసిపోతుంది. మరి నాన్న కోసం ఏం తెచ్చావ్ అంటే.. వాచ్ తెచ్చాను అని చెబుతాడు. ఇంట్లో కూర్చొన్న ఆయనకు వాచ్ ఎందుకు అని ప్రభావతి అంటే.. బాలుకి కోపం వచ్చి తిడతాడు. నాకు ఎందుకులేరా వాచ్ అని సత్యం అంటే.. నీకు కాదు నాన్న.. నా కోసం తెచ్చుకున్నాను అని అంటాడు. అందరూ షాక్ అవుతారు. మనోజ్ ఆ వాచ్ రూ.51వేలు అని.. అందుకే తన కోసం తెచ్చుకున్నాను అని అంటాడు. మరోసారి రోహిణీ.. మామయ్య కోసం ఏం తెచ్చావ్ అంటే టవల్ చూపిస్తాడు. అది చూసి బాలుకి కోపం వచ్చి.. మనోజ్ ని బాగా తిడతాడు. దీంతో రోహిణీ కి కోపం వస్తుంది. ‘ ప్రతి దాంట్లో ఎందుకు పెడర్థాలు తీస్తావ్ బాలు.. నేను చాలా కాలంగా పసుపుతాడుతో ఉన్నాను అని బంగారం తెచ్చాడు.. మీనా కూడా చాలా కాలంగా పసుపు తాడుతోనే ఉంది కదా.. నీకు వీలైతే మీనాకి బంగారం కొని పెట్టు.. మీ అన్నయ్య మీద పడి ఏడుస్తావ్ ఎందుకు?’ అని రోహిణీ అనగానే.. మనోజ్ మీద పడుతూ.. బాలు అన్నా.. ఓ అన్నా అంటూ ఏడుస్తాడు.. భలే ఫన్నీగా ఉంటుంది.ఆ గొడవను ఆపేసి.. మనోజ్ వాళ్లను ప్రభావతి లోపలికి వెళ్లమని పంపుతుంది.
మళ్లీ అప్పు చేసిన మనోజ్...
ఇక తనకు తాళి తెచ్చి ఇచ్చినందుకు రోహిణీ చాలా సంతోషిస్తుంది. అదే విషయాన్ని మనోజ్ తో పంచుకుంటుంది. సడెన్ గా.. ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే డౌట్ వస్తుంది. దాచుకున్న డబ్బులో నుంచి తీశావా అని అడుగుతుంది. అయితే.. అవి కాదని.. క్రెడిట్ కార్డు నుంచి కొన్నాను అని మనోజ్ గర్వంగా చెబుతాడు. కానీ.. రోహిణీ తిడుతుంది. నాతో చెప్పకుండా ఎందుకు ఇలా చేశావ్ అని తిడుతుంది. కార్డుతో ఇవన్నీ కొన్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ.. తర్వాత కట్టేటప్పుడు వడ్డీతో కట్టాలి అని చెబుతుంది. కానీ.. మనోజ్ అర్థం చేసుకోడు. దీంతో.. రోహిణీ దిగులు పెట్టుకుంటుంది. రోహిణీ డల్ అవ్వడంతో.. మనోజ్ క్షమాపణలు చెబుతాడు. దీంతో.. ఆమె ఆలోచనలో పడుతుంది. తన ప్రేమ కోసమే కదా ఇలా చేశాడు అని ఆలోచించుకొని..తప్పేమీ కాదు.. పర్వాలేదు అని చెబుతుంది. వెంటనే మనోజ్ చిన్న పిల్లాడిలా తన వాచ్ చూసుకొని మురిసిపోతాడు. ఇక, రోహిణీ.. బాలు.. తనకంటే ముందుగా.. మీనాకి ఎక్కడ గోల్డ్ చైన్ తెస్తాడేమో అని ఫీల్ అయ్యాను అని చెబుతుంది. తర్వాత కార్డులో బ్యాలెన్స్ ఉందని.. గోవా వెళ్దామా అని అడుగుతాడు. రోహిణీ సరే అని చెబుతుంది.

