- Home
- Entertainment
- Tollywood celebs meeting with CM Jagan:చర్చలు సఫలం... కొనసాగుతున్న కన్ఫ్యూషన్... జీవో వచ్చాకే క్లారిటీ
Tollywood celebs meeting with CM Jagan:చర్చలు సఫలం... కొనసాగుతున్న కన్ఫ్యూషన్... జీవో వచ్చాకే క్లారిటీ
వారం రోజులుగా నడుస్తున్న ఉత్కంఠకు తెరపడింది. ఆంద్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్(CM Jagan) తో సినీ ప్రముఖుల చర్చలు ముగిశాయి. చిరంజీవి నేతృత్వంలోని బృందం నేడు ఏపీ సీఎం ని కలిశారు. మహేష్(Mahesh babu), ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆలీ, పోసాని, ఆర్ నారాయణమూర్తి ఈ బృందంలో ఉన్న ప్రముఖ సభ్యులు.

దాదాపు గంటకు పైగా సీఎం జగన్ తో చిత్ర ప్రముఖులు చర్చలు జరిపారు. సినిమా టికెట్స్ ధరలు, బెనిఫిట్ షోలకు అనుమతి, సరళతరమైన థియేటర్స్ నిబంధనలు, నంది అవార్డ్స్ వంటి పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. అలాగే ప్రభుత్వం తరపు నుండి కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. వైజాగ్ వేదికగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి,చిన్న చిత్రాల మనుగడకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పరిశ్రమ ప్రముఖులను సీఎం జగన్ కోరారు.
మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న చిత్ర ప్రముఖులు చర్చల సారాంశం వివరించారు. ముందుగా చిరంజీవి(Chiranjeevi) మాట్లాడారు. ఆయన చర్చలు సఫలమైట్లు వెల్లడించారు. అటు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా, ఇటు పరిశ్రమ మనుగడ దెబ్బతినకుండా ఉండేలా టికెట్స్ ధరల నిర్ణయంఉంటుంది . పరిశ్రమ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కొత్త జీవో సిద్ధం చేస్తున్నట్లు చిరు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం వై ఎస్ జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక మహేష్, ప్రభాస్(Prabhas), రాజమౌళి తన స్పీచ్ లో చర్చలపై సంతృప్తి వ్యక్తం చేశారు. చిరంజీవి గారి నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్ తో సమస్యకు పరిష్కారం దొరికినట్లుఅభిప్రాయపడ్డారు . అదే సమయంలో ఏమవుతుందో అన్న కన్ఫ్యూషన్ లో ఉన్న తమకు చిరంజీవి గారి చొరవతో పరిష్కారం దొరికినట్లు అభిప్రాయపడ్డారు. ఈ సంధర్భంగా సీఎం జగన్ కి, చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి (Rajamouli)చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తి రేపాయి. ఇండస్ట్రీ పెద్ద అంటే ఆయనకు నచ్చదు. కానీ తన చర్యల ద్వారా ఆయనే పెద్దని నిరూపించుకున్నారు. ఆయన చొరవతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు.
ఇక ఆర్ నారాయణమూర్తి చిరంజీవితో పాటు మంత్రి పేర్ని నానిని తన స్పీచ్ తో అసహనానికి గురిచేశారు. చిన్న సినిమా మనుగడ పెద్ద సినిమాల వలన ప్రశ్నార్ధకం అవుతుందన్న ఆయన.. ఇలాంటి మీటింగ్ కి ఫిలిం ఛాంబర్ సభ్యులను కూడా ఆహ్వానిస్తే పరిపూర్ణంగా ఉంటుందంటూ కోరారు. కోవిడ్ నిబంధనలు అంటూ చిరంజీవి, పేర్ని నాని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
మొత్తంగా చిత్ర ప్రముఖుల ప్రెస్ మీట్ పరిశీలిస్తే... సీఎం జగన్ చిత్ర పరిశ్రమ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. అయితే టికెట్స్ ధరలు (Ticket Prices)ఎంత మేరకు పెంచారు. పరిశ్రమ ప్రతిపాదనలలో ఎన్నింటికి ఆమోదం తెలిపారనే దానిపై స్పష్టత రాలేదు. ఐదవ షోకి అనుమతి ఇచ్చినట్లు మాత్రం వెల్లడించారు. రెండు మూడు వారాల్లో కొత్త జీవో రానుంది. ఆ జీవో రాకతోనే నేటి చర్చలు ఎంత మేర చిత్ర పరిశ్రమ డిమాండ్లను తీర్చాయనేది తెలియదు.