థియేటర్ లో డిజాస్టర్, ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతున్న సినిమా ఏదో తెలుసా?
భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమా కోట్లు కొల్లగొడుతుంది అనుకుంటే డిజాస్టర్ అయ్యి షాక్ ఇచ్చింది. కానీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది మూవీ. ఇంతకీ ఏంటా సినిమా?

కొన్నిసినిమాలు ఎప్పుడు ఎలా హిట్ అవుతాయో చెప్పలేం. బాగున్నసినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టవచ్చు. బాలేని సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబట్టవచ్చు. థియేటర్ లో హిట్ అయిన సినిమా.. ఓటీటీలో ప్లాప్ అవ్వచ్చు. ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా థియేటర్ లో డిజాస్టర్ అయి ఉండవచ్చు. ఇలాంటికోవకే చెందుతుంది రీసెంట్ గా వచ్చిన కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ.
భారీ అంచనాల నడుమ 2025లో విడుదలైన సినిమా ‘థగ్ లైఫ్. కమల్ హాసన్ నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పెద్దగా ఆకట్టుకోకపోవడంతో, కమర్షియల్ గా నిరాశ కలిగించింది. కాని ఇప్పుడు ఓటీటీ వేదికపై మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీ టాప్ ట్రెండింగ్ స్థానం ఆక్రమించడం విశేషంగా మారింది. ఓ మీడియా సంస్థ రిలీజ్ చేసిన వివరాల ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1 లో థగ్ లైఫ్ మూవీ ఉండగా.. టాప్ 4 లో నాని నటించిన హిట్ 3 మూవీ ఉండటం విశేషం.
దాదాపు 30 ఏళ్ల తరువాత కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కిన ఈసినిమా తమిళంలో తెరకెక్కింది. కాని అదే అంచనాలతో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, శింబు (Simbu), మహేష్ మంజ్రేకర్, అభిరామి, నాసర్, అశోక్ సెల్వన్, అలీ ఫజల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే ..రంగరాయ శక్తివేల్ (కమల్ హాసన్) అనే మాఫియా డాన్ చుట్టూ కథ తిరుగుతుంది. అతను ఒక పోలీస్ ఎన్‌కౌంటర్ సమయంలో ఒక చిన్నపిల్లవాడిని కాపాడతాడు. అదే సమయంలో తన తండ్రి మరణించడంతో, ఆ పిల్లవాడిని తన బిడ్డగా స్వీకరిస్తాడు. శక్తివేల్ చుట్టూ ఉన్నవారే అతనిపై మోసం చేసి ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తారు. ఈ సంఘటనల అనంతరం కథలో కీలక మలుపులు తిరుగుతాయి. ఈ చిత్రంలో 70 ఏళ్ల కమల్ హాసన్ తన పాత్రలో జీవించి నటనతో ఆకట్టుకున్నారు.
ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 200 కోట్లు. కానీ విడుదల అనంతరం ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో, వసూళ్ల పరంగా తీవ్రంగా ఫెయిల్ అయ్యింది. థియేటర్లలో విడుదలైన తొలి వారం నుంచే నెగటివ్ టాక్‌తో వెనుకబడి, మొత్తం కలెక్షన్లలో 100 కోట్లను కూడా చేరుకోలేకపోయింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చాక, ప్రేక్షకుల ఆదరణ అందుకుంటోంది. ప్రస్తుతానికి ‘థగ్ లైఫ్’ నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇందులో కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌తో పాటు, యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, స్టైలిష్ విజువల్స్ ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైపోయినా, ఓటీటీ వేదికపై విజయం సాధించడం సినిమాకు మరో ఛాన్స్ దొరికినట్టు అయ్యింది. థియేటర్లలో కనెక్ట్ కాలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు తమ ఇంట్లో ఈసినిమాను ఎక్కువగా చూసేస్తున్నారు. థియేటర్లలో ఫెయిల్ అయినా ఓటీటీలో సక్సెస్ సాధించే ట్రెండ్‌తో, సినిమాల వ్యాపార విధానాల్లో పెద్ద మార్పులు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.