ఛత్రపతికి హిట్ టాక్, రాజమౌళికి ఫోన్ చేసి ప్రభాస్ చెప్పిన మాటేంటో తెలుసా? అసలు ఊహించి ఉండరు!
ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఛత్రపతి. ఈ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకోవడంతో రాజమౌళికి ప్రభాస్ ఫోన్ చేశాడట. అప్పటి ప్రభాస్ వింత ప్రవర్తన తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.
ఈశ్వర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు ప్రభాస్. ఇక ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ క్లీన్ హిట్ వర్షం. దర్శకుడు శోభన్ తెరకెక్కించిన వర్షం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. త్రిష హీరోయిన్ గా నటించిన వర్షం మూవీలో గోపిచంద్ విలన్ రోల్ చేయడం విశేషం. అంజి, లక్ష్మి నరసింహ వంటి బడా హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి వర్షం 2004 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
వర్షం అనంతరం ప్రభాస్ నటించిన అడవి రాముడు, చక్రం నిరాశపరిచాయి. ప్రభాస్ కి కొంత ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. సింహాద్రి చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రాజమౌళి హీరో నితిన్ తో సై చేశాడు. ఇక నాలుగో చిత్రం ఛత్రపతి. హీరో శ్రీలంక నుండి ఇండియాకు వచ్చిన శరణార్థి. తల్లి నుండి తప్పిపోతాడు. బాల్యం నుండి తల్లి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఈ పాయింట్ కి గ్యాంగ్ స్టర్ డ్రామా జోడించి ఛత్రపతి తెరకెక్కించారు.
ఫస్ట్ షో నుండే ఛత్రపతి చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్. ఛత్రపతితో హిట్ కొట్టేశామని ఫుల్ గా ఫిక్స్ అయిన ప్రభాస్ వెంటనే రాజమౌళికి కాల్ చేశారట. ప్రభాస్ నుండి ఫోన్ రావడంతో రాజమౌళి లిఫ్ట్ చేశాడట. ప్రభాస్ ఒకటే పదం పదే రిపీట్ చేస్తున్నాడట. డార్లింగ్.. డార్లింగ్.. డార్లింగ్... ఇదే పదం గుక్క తిప్పుకోకుండా చెబుతున్నాడట. ఒక 10 -15 సార్లు డార్లింగ్ అని చెప్పాక, హిట్ కొట్టేశాము.. డార్లింగ్ అన్నాడట. రాజమౌళి ఏం చెబుతున్నా వినిపించుకోవడం లేదట.
ఛత్రపతి చిత్రానికి హిట్ టాక్ రావడంతో ప్రభాస్ ఎగ్జైట్ అయ్యాడు. ఒకింత వింతగా ప్రవర్తించాడని రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రెండు ప్లాప్స్ అనంతరం వచ్చిన హిట్ కావడంతో ప్రభాస్ అంతలా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. అలాగే అది ప్రభాస్ హీరోగా ఎదుగుతున్న సమయం. మరో రెండు మూడు ప్లాప్స్ పడితే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కరెక్ట్ టైం లో రాజమౌళితో మూవీ చేసి ప్రభాస్ స్టార్ హీరో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు.
ఛత్రపతి విజయంతో ప్రభాస్ కి మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ముఖ్యంగా యాక్షన్ లవర్స్ ప్రభాస్ ఫైట్స్ కి ఫిదా అయ్యారు. కాట్ రాజ్ పాత్రతో ప్రభాస్ ఫైట్ సీన్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఛత్రపతి అనంతరం ప్రభాస్ కి ప్లాప్స్, యావరేజ్ లో పడ్డాయి. అయినా ప్రభాస్ స్టార్డం తగ్గలేదు. బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో ప్రభాస్ తిరుగులేని స్టార్ అయ్యారు.
ఇక రాజమౌళి-ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాశాయి. తెలుగు సినిమా గతిని మార్చేశాయి. బాహుబలి 2 మొదటి వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఆ చిత్రం పేరిట ఉన్న రికార్డ్స్ ని ఏళ్ల తరబడి ఎవరూ టచ్ చేయలేదు. ప్రభాస్ తో రాజమౌళికి మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ తో అత్యధికంగా 4 సినిమాలు చేసిన రాజమౌళి, ప్రభాస్ తో మూడు సినిమాలు చేశారు.