KGF 2- Yash: కెజిఎఫ్ స్టార్ యష్ కి అసలు పరీక్ష మొదలు..!
ఒక్క సినిమా యస్ ఇమేజ్ మార్చేసింది. ఆయన్ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యష్ అంటే తెలియని సినీ ప్రేమికుడు లేడు. ప్రస్తుతం ఆయన పేరు మారుమ్రోగుతుంది.

kgf 2
కన్నడ చిత్ర పరిశ్రమకు వంద కోట్ల వసూళ్ళంటేనే చాలా ఎక్కువ. రూ. 50 కోట్లు మార్కెట్ కూడా లేని కన్నడ పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు కథను నమ్మి ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. హీరోగా యష్ ని ఎంచుకున్నాడు. నిర్మాతలకు నమ్మకం కలిగించి భారీ ఎత్తున కెజిఎఫ్ తెరకెక్కించారు. కన్నడతో పాటు మిగతా భాషల్లో కెజిఎఫ్ పార్ట్ 1 (KGF Part 1) మీద ఎటువంటి అంచనాలు లేవు. అందుకే చాలా తక్కువ ధరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి.
2018 డిసెంబర్ 21 కెజిఫ్ విడుదలైంది. అసలు సినిమా ఎలా ఉంది?, ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకున్నారు? అనేది క్రిటిక్స్ కూడా అర్థం కాలేదు. ఒకవేళ సినిమా బాగున్నా ఓ డబ్బింగ్ మూవీ ఏమి ఆడుతుందిలే అని కొందరు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. మెల్లగా జనాల మెదళ్లలోకి కెజిఎఫ్ ఎక్కడం మొదలైంది. ఇంతింతై వటుడింతై అన్నట్లు పాజిటివ్ మౌత్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. కెజిఎఫ్ అంటే ఓ కొత్త అనుభూతిని పంచే చిత్రంగా జనాలు చెప్పుకున్నారు. అలా కెజిఎఫ్ విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది.
సినిమాకు ఇచ్చిన ముగింపు నేపథ్యంలో పార్ట్ 2పై విపరీతమైన హైప్ నెలకొంది. దాని ఫలితమే కెజిఎఫ్ చాప్టర్ 2(KGF Chapater 2)కి వస్తున్న రెస్పాన్స్. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత విడుదలైన పార్ట్ 2 సునామీలా ఇండియన్ బాక్సాఫీస్ ని ముంచేసింది. మూడు రోజుల్లో రూ. 500 కోట్ల వసూళ్లు దాటేసిన కెజిఎఫ్ 2, వెయ్యికోట్ల దిశగా పరుగులు తీస్తుంది. కెజిఎఫ్ 1 యష్ కి గుర్తింపు తీసుకొస్తే కెజిఎఫ్ 2 అతి పెద్ద స్టార్ చేసింది.
ప్రభాస్ (Prabhas) తర్వాత యష్ దేశంలో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. అయితే ఆయనకు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. బాహుబలి(Bahubali) తర్వాత ప్రభాస్ ఎదుర్కొంటున్న సమస్యే యష్ కి ఎదురుకావచ్చు. బాహుబలి ద్వారా ప్రభాస్ కి వచ్చిన ఇమేజ్ తర్వాత చిత్రాలపై పడుతుంది. సాహో లాంటి అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ జనాలకు రుచించలేదంటే అర్థం చేసుకోవచ్చు, బాహుబలి ప్రభావం ప్రేక్షకులపై ఎంతగా ఉందో.
కెజిఎఫ్ రాకీ భాయ్ ఇమేజ్ యష్ (Yash) ని ఇప్పట్లో వదిలే దాఖలాలు లేవు. నెక్స్ట్ ఆయన ఎంచుకునే చిత్రాలపై ఈ ప్రభావం ఉంటుంది. ప్రేక్షకులు ఆయన్ని కెజిఎఫ్ దృష్టి కోణంలోనే చూస్తారు. దాని వలన దర్శకులు ఎంత గొప్పగా ఆయన్ని ప్రజెంట్ చేసినా నచ్చకపోవచ్చు. మరీ ముఖ్యంగా ప్రశాంత్ నీల్(Prashanth Neel)మాదిరి ఒక హీరోని వెండితెరపై ఎలివేట్ చేయడం మరో దర్శకుడికి సాధ్యం కాదేమో. అదే సమయంలో కెజిఎఫ్ 2 రికార్డ్స్, వసూళ్లు ఆయన్ని వెంటాడతాయి. ఈ చిత్ర వసూళ్లను బ్రేక్ చేసే చిత్రాలు చేయడం యష్ కి సాధ్యమేనా అంటే నిజంగా కాదు.
కొన్నేళ్ల వరకు కెజిఎఫ్ చాప్టర్ 2 రికార్డ్స్ కన్నడ పరిశ్రమ నుండి ఎవరూ బ్రేక్ చేయలేరు. ఇలా అనేక సవాళ్లు యష్ కోసం ఎదురుచూస్తున్నాయి. కెజిఎఫ్ సిరీస్ యష్ మార్కెట్, రెమ్యూనరేషన్, ఇమేజ్ పెంచి మేలు చేసినా... ఆ ఘనచరిత్రను భుజాలపై మోయడం పెద్ద కష్టం. మరి ఈ సవాళ్ళను యష్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.