దళపతి విజయ్ అసలు పేరు ఏంటో తెలుసా? ఆయన ఏం చదువుకున్నాడు, ఎలా హీరో అయ్యాడు?
త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి..ప్రజాసేవ చేయబోతున్నాడు స్టార్ హీరో దళపతి విజయ్. ఆయన చివరి సినిమాగా జననాయగన్ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలో విజయ్ జీవితానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విషయాలు వైరల్ అవుతున్నాయి.

దళపతి విజయ్ చివరి సినిమా
తమిళంతో పాటుగా సౌత్ లో స్టార్ హీరోగా వెలుగు వెలిగాడు దళపతి విజయ్. ఆయన చివరి సినిమా 'జన నాయగన్'. 50 ఏళ్ల వయసులో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి.. విజయ్ పొలిటికల్ జర్నీస్టార్ట్ చేయబోతున్నాడు. ఈక్రమంలో విజయ్ చివరి సినిమా అయిన జననాయగన్ 2026 జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ ను ఖర్చు పెట్టినట్టు సమాచారం.
దళపతి విజయ్ అసలు పేరు ఏంటి?
300 కోట్ట జననాయగన్ బడ్జెట్ లో .. విజయ్ కే దాదాపు 250 కోట్లు రెమ్యునరేషన్ గా ఇచ్చినట్టు కోలీవుడ్ టాక్. ఇక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయ్ పేరుతో బాగా పాపులర్ అయిన ఈ హీరోకు.. దళపతి ట్యాగ్ లైన్ ను అభిమానులు అందించారు. కానీ విజయ్ అసలు పేరు మాత్రం వేరే ఉంది. ఆ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. ఇంతకీ ఆయన అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. కానీ సినిమాల కోసం తన పేరును సింపుల్ గా ఉండాలని విజయ్ గా మార్చుకున్నారు.
విజయ్ ఏం చదువుకున్నాడు..?
ఇక దళపతి విజయ్ విద్యార్హతల విషయానికొస్తే, ఆయన తన పాఠశాల విద్యను మొదట కోడంబాక్కంలోని ఫాతిమా స్కూల్‌లో, తర్వాత విరుగంబాక్కంలోని బాలలోక్ స్కూల్‌లో పూర్తి చేశారు. కాలేజీ చదువులు విషయానికి వస్తే.. లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్ కోసం చేరారు, కానీ నటన మీద ఇంట్రెస్ట్ తో ఆయన తన చదువులను మధ్యలోనే ఆపేశారు. యాక్టర్ గా పరిచయం అవ్వడం కోసం ప్రయత్నాలు చేశారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా విజయ్ దళపతి..
విజయ్ కేవలం 10 ఏళ్ల వయసులో నటుడిగా కొన్ని సినిమాల్లో కనిపించారు. పి.ఎస్. వీరప్ప నిర్మించి 1984లో వచ్చిన తమిళ చిత్రం 'వెట్రి'తో తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కుటుంబం (1984), వసంత రాగం (1986), సట్టం ఒరు విలయాట్టు (1987), ఇదు ఎంగళ్ నీతి (1988) వంటి సినిమాల్లో బాలనటుడిగా కనిపించారు. తన తండ్రి దర్శకత్వం వహించిన 'నాన్ సిగప్పు మనిదన్' (1985)లో రజనీకాంత్‌తో కలిసి విజయ్.. నటించారు.
హీరోగా దళపతి నటించిన తొలి సినిమా..?
విజయ్ 1992లో 18 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'నాళైయ తీర్పు' ఆయన హీరోగా నటించని తొలి సినిమా. ఆ తర్వాత సెంథూరపాండి, రసిగన్, దేవా, కోయంబత్తూర్ మాప్పిళ్ళై వంటి చిత్రాల్లో కనిపించారు. 1996లో విక్రమన్ దర్శకత్వంలో 'పూవే ఉనక్కాగ'లో నటించారు. ఈ సినిమాతో ఆయనకు మంచి పాపులారిటీ వచ్చింది. 1997లో కాలమెల్లం కాతిరుప్పేన్, లవ్ టుడే సినిమాలతో స్టార్గా మారిపోయాడు.. అప్పటి నుంచి విజయ్ హీరోగా తిరిగి చూసుకోలేదు.
దళపతి విజయ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు
విజయ్ కెరీర్ లో.. తుళ్లాద మనముమ్ తుళ్ళుమ్ (1999), శివకాశి (2005), పోకిరి (2007), కత్తి (2014), పులి (2015), తేరి (2016), మెర్సల్ (2017), సర్కార్ (2018), బిగిల్ (2019), మాస్టర్ (2021), బీస్ట్ (2022), వారిసు (2023), లియో (2023), ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (2024) వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలెన్నో ఉన్నాయి.
వ్యక్తిగత జీవితం, పెళ్లి,పిల్లలు..
ఇక విజయ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, ఆయన 1999 ఆగస్టు 25న తన వీరాభిమాని సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు సంజయ్, 'వేట్టైకారన్' సినిమాలో విజయ్‌తో కలిసి కనిపించాడు. కూతురు దివ్య, 'తేరి' సినిమాలో ఆయనతో పాటు కనిపించింది. ప్రస్తుతం విజయ్ కు ఆయన భార్యకు మధ్య విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంతో తెలియదు కానీ.. పిల్లల చదువుల కోసం విజయ్ భార్య సంగీత ఫారెన్ లో ఉంటున్నట్టు సమాచారం.

