`భారతీయుడు 2` నటుడు ఢిల్లీ గణేశ్ మృతి..
ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఢిల్లీ గణేశ్ (80) చెన్నైలో కన్నుమూశారు. 400కు పైగా సినిమాల్లో నటించిన ఆయన గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Delhi Ganesh, died, Chennai express
ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఢిల్లీ గణేశ్ (80) కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించారు. వీటితో పాటు తమిళ సీరియల్స్, వెబ్ సిరీసుల్లోనూ నటించారు. అయితే గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నైలో శనివారం రాత్రి 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
1944, ఆగస్ట్ 1న తమిళనాడులోని తిరునెల్వెలిలొ ఢిల్లీ గణేశ్ జన్మించారు. ఆయన అసలు పేరు గణేశన్. 1976లో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది.
కే.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘పట్టిన ప్రవేశం’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. 1981లో ‘ఎంగమ్మ మహారాణి’ చిత్రంలో హీరోగా నటించారు. 1964 నుంచి 1974 వరకు భారత వైమానిక దళంలో పనిచేశారు.
సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగం వదిలేసి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కెరీర్ మొదట్లో దక్షిణ భారత నాటక సభ (DBNS) థియేటర్ గ్రూప్ సభ్యుడిగా పనిచేశారు.
గణేశన్‌ను నటుడిగా పరిచయం చేసిన కె.బాలచందర్ ఆయనకు ఢిల్లీ గణేశ్‌గా నామకరణం చేశారు. 1979లో తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చేతులమీదుగా కలైమామణి పురస్కారాన్ని అందుకున్నారు.
ఢిల్లీ గణేశ్ మృతితో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఈయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఈయన కమల్ హాసన్ 'భారతీయుడు 2' మూవీలో కనిపించారు.
అంతకు ముందు తెలుగులో ఈయన 'జైత్రయాత్ర', 'నాయుడమ్మ', 'పున్నమినాగు' తదితర సినిమాల్లో నటించారు. షారుఖ్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్', సూర్య 'వీడొక్కడే', లారెన్స్ 'కాంచన 3' లాంటి డబ్బింగ్ చిత్రాల్లో ఈయన మీకు కనిపించే ఉంటారు.
1976లో ప్రారంభమైన ఢిల్లీ గణేశ్ సినీ ప్రస్థానం.. ఈ ఏడాది వరకు కొనసాగింది. సినిమా ఇండస్ట్రీ రాకముందు ఈయన భారత వైమానిక దళంలోనూ పనిచేశారు. మొదటి సినిమా కె.బాలచందర్ దర్శకత్వంలో పట్టిన ప్రవేశం (1977)లో నటించారు. 1994 కలైమామణి అవార్డును తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈయనకు అందించింది.