కంగువా తో నిండామునిగిన నిర్మాత, సూర్య ఏం చేశాడంటే?
సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ మూవీ కంగువా. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. నిర్మాత పెద్ద మొత్తంలో నష్టపోయాడు. ఈ క్రమంలో అతన్ని ఆదుకునేందుకు సూర్య ముందుకు వచ్చాడు..
Kanguva
తమిళ బాహుబలి అంటూ కంగువా చిత్రానికి ప్రచారం దక్కింది. దర్శకుడు శివ రెండు విభిన్న కాలాల నేపథ్యంలో కంగువా చిత్రాన్ని తెరకెక్కించారు. సూర్య కంగువా, ఫ్రాన్సిస్ అనే పాత్రలు చేశాడు. వేల ఏళ్ల నాటి వీరుడిగా సూర్య లుక్, మేనరిజం ఆకట్టుకున్నాయి. ట్రైలర్ సైతం మెప్పించగా అంచనాలు ఏర్పడ్డాయి.
కంగువా చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. రెండేళ్లు ఈ సినిమా కోసం సూర్య కష్టపడ్డారు. కానీ ఫలితం దక్కలేదు. కంగువా మూవీ ఫస్ట్ షో నుండే నిగిటివ్ టాక్ తెచ్చుకుంది. మూవీలో విషయం లేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కంగువాను నిడివి, స్క్రీన్ ప్లే, బీజీఎమ్ భారీగా దెబ్బతీశాయి. కనీసం ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు.
కంగువా మూవీ బాక్సాఫీస్ రన్ ముగిసింది. కేవలం రూ. 100 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ఈ మూవీ రాబట్టింది. అటు తమిళంలో కూడా కంగువా నిరాదరణకు గురైంది. కాగా కంగువా చిత్రంతో నిర్మాతలకు రూ. 130 కోట్ల మేర నష్టాలు మిగిలాయని సమాచారం. కంగువా చిత్రాన్ని కే ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అలాగే యూవీ క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.
Kanguva
సూర్యతో కే ఈ జ్ఞానవేల్ రాజాకు చాలా కాలంగా అనుబంధం ఉంది. జ్ఞానవేల్ రాజాను కంగువా కోలుకోలేని దెబ్బ తీసింది. దాంతో సూర్య ముందుకు వచ్చాడు. అతనికి భరోసా కల్పించాడు. జ్ఞానవేల్ రాజాకు మరో సినిమా చేస్తానని సూర్య హామీ ఇచ్చారట. ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమా చేస్తానని సూర్య ధైర్యం చెప్పారంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
థియేటర్స్ లో కంగువా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనుకున్న సమయానికి ముందే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 8 నుండి కంగువా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం సూర్య తన 44వ చిత్రం చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించడం విశేషం.
Kanguva
ఇక సూర్య 45వ చిత్రానికి ఆర్జే బాలాజి దర్శకుడు. ఈయన నటుడు కూడాను. మరోవైపు సూర్య చెన్నై నుండి మకాం ముంబై కి మార్చారు. భార్య జ్యోతిక, ఇద్దరు పిల్లలతో సూర్య ముంబైలో ఉంటున్నారు.