- Home
- Entertainment
- రాజీవ్ గాంధీ సన్నిహితుడిగా.. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా.. సూపర్ స్టార్ కృష్ణ రాజకీయ ప్రస్తానం ఇదే..!
రాజీవ్ గాంధీ సన్నిహితుడిగా.. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా.. సూపర్ స్టార్ కృష్ణ రాజకీయ ప్రస్తానం ఇదే..!
సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లోనే కాకుండా కృష్ణ రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆయన ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కృష్ణకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది.

ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణ మరణంతో ఆయన కుటుంబంతో పాటు అభిమానుల్లో, తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే కృష్ణ అసలుపేరు ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి.
కృష్ణ 1943 మే 31న ఆంధ్రప్రదేశ్‌గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో జన్మించారు. సినిమాలపై ఇష్టంతో ఆయన ఇటువైపు అడుగులు వేశారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన సినీ కెరీర్‌లో కృష్ణ 350 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు.
అయితే సినిమాల్లోనే కాకుండా కృష్ణ రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆయన ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే అంతకంటే ముందే 1972లో జైఆంధ్ర ఉద్యమానికి కృష్ణ మద్దతు ప్రకటించారు. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో కృష్ణ తీసిన ఈనాడు చిత్రం ఆ పార్టీకి కొంత పాజిటివ్‌గా మారిందని చెబుతారు.
ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనను కలిసి అభినందనలు కూడా తెలిపారు. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కృష్ణకు దూరం పెరిగిందని చెబుతారు. ఇక, 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది. ఆయన ఆహ్వానంతోనే కృష్ణ కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టుగా చెబుతారు.
ఆ తర్వాత కృష్ణ తీసిన కొన్ని చిత్రాలు.. ఎన్టీఆర్‌ను, అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉండేవనే ప్రచారం జోరుగా సాగింది. అలాగే కాంగ్రెస్ తరఫున కృష్ణ విస్తృత ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే కృష్ణ 1989లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే కేవలం 16 నెలల పాటు మాత్రమే ఆయన ఎంపీగా కొనసాగారు.
1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసిన కృష్ణ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే కాంగ్రెస్‌కు మద్దతుగానే ఉన్నారు. వైఎస్సార్‌తో కృష్ణకు మంచి సంబంధాలే ఉండేవి.
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న కృష్ణ.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం కొంతకాలమే ఉన్నారు. చిత్ర పరిశ్రమలో కూడా అందరితో సన్నిహితంగా ఉండేవారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2009లో కృష్ణను పద్మభూషణ్‌తో సత్కరించింది.