'డీయస్ ఈరే' మూవీ రివ్యూ, రేటింగ్..సూపర్ స్టార్ కొడుకు మెప్పించాడా, తుస్సుమన్నాడా ?
మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన హర్రర్ థ్రిల్లర్ డీయస్ ఈరే చిత్రం తాజాగా తెలుగులో విడుదలయింది. ఈ మూవీ ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉందా ? థియేటర్స్ లో థ్రిల్ ని పంచిందా ? అనేది రివ్యూ లో తెలుసుకుందాం.

డీయస్ ఈరే మూవీ రివ్యూ
అగ్ర నటుల వారసులు సినిమా రంగంలో రాణించడం చూస్తూనే ఉన్నాం. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ అన్ని భాషల్లో ప్రముఖ నటుల వారసులు సినిమాల్లో గుర్తింపు పొందారు. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించారు. ప్రణవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ డీయస్ ఈరే చిత్రం తాజాగా తెలుగులో విడుదలయింది. మలయాళంలో విడుదలైన వారం తర్వాత తెలుగులోకి ఈ చిత్రాన్ని తీసుకువచ్చారు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రణవ్ మోహన్ లాల్ తో పాటు ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో, అరుణ్ అజికుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో హర్రర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం విడుదలైన సందర్భంగా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ
అమెరికాలో, కేరళలో వ్యాపారాలు ఉండే ఆర్కిటెక్ట్ రోహన్( ప్రణవ్ మోహన్ లాల్). తన వ్యాపారాలు చూసుకుంటూ రోహన్ బిజీగా ఉంటాడు. ఒకసారి స్నేహితులతో సరదాగా గడిపేందుకు కేరళకి వస్తాడు. తన స్నేహితులతో సరదాగా గడుపుతున్న సమయంలో ఒక షాకింగ్ వార్త రోహన్ కి తెలుస్తుంది. అతడి గర్ల్ ఫ్రెండ్ కని ( సుష్మిత భట్) ఆత్మహత్య చేసుకుంటుంది. తన గర్ల్ ఫ్రెండ్ తో రోహన్ కి చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తన వల్ల ఏమైనా ఆమె ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానం రోహన్ కి కలుగుతుంది. ఆమె కుటుంబ సభ్యులని వెళ్లి పరామర్శిస్తాడు. అప్పటి నుంచి తనని ఏదో ఒక ఆత్మ వెంటాడుతుందనే భయం రోహన్ కి మొదలవుతుంది. అది తన ప్రియురాలి ఆత్మే అనే అనుమానం రోహన్ కి కలుగుతుంది. అసలు ఆ ఆత్మ రోహన్ ని ఎందుకు వెంటాడుతోంది ? అది నిజంగా రోహన్ ప్రియురాలి ఆత్మేనా ? ఇలాంటి ఆసక్తికర విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి.
విశ్లేషణ
దర్శకుడు రాహుల్ సదాశివన్ ఫస్ట్ హాఫ్ లో కథని బిల్డ్ చేయడానికి, టోన్ సెట్ చేయడానికి టైం తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో భయాన్ని కలిగించే సీన్లు తక్కువ మోతాదులో ఉంటాయి. అక్కడక్కడా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు పడ్డాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. హీరోని ఆత్మ వెంటాడే సీన్లు ఫస్ట్ హాఫ్ లో రీపీటెడ్ గా అనిపిస్తాయి. అది ఈ చిత్రానికి చిన్నపాటి మైనస్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ వరకు కథని సాగదీసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఓవరాల్ గా చూస్తే ఇది రొటీన్ హర్రర్ థ్రిల్లర్ అనిపిస్తుంది. కానీ టెక్నికల్ గా దర్శకుడు అద్భుతం చేశాడు. ఈ చిత్రంలో సరికొత్త సౌండ్ డిజైన్ ఆడియన్స్ ని కట్టిపడేసే విధంగా ఉంటుంది. ఓ డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ చూస్తున్నామని ఫీలింగ్ ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్, కెమెరా పనితనం తీసుకువచ్చాయి.
ఇక సెకండ్ హాఫ్ లో దర్శకుడు రాహుల్ సదాశివన్ అద్భుతం చేశాడు. సెకండ్ హాఫ్ లో ప్రతి సీన్ థ్రిల్ ని పంచేలా ఉంటుంది. చివరి 20 నిమిషాలు అయితే స్టాండౌట్. చూపు తిప్పుకోవడం కష్టం. హర్రర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆ ఎలిమెంట్స్ తక్కువే. హర్రర్ చిత్రాల్లో థ్రిల్ తో పాటు ఆడియన్స్ భయాన్ని కూడా కోరుకుంటారు. అది కాస్త ఈ చిత్రంలో మిస్ అయింది. ఇందులో భయాన్ని కలిగించే సీన్ల కంటే సైకలాజికల్ సీన్లు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా లాజిక్ మిస్ అయిన సీన్లు కూడా ప్రేక్షకులకు పంటి కింద రాయిలా మారుతాయి.
నటీనటులు
సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ ఈ చిత్రంతో తాను ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ కి అయినా సరిపోతాను అని నిరూపించుకున్నారు. ఈ మూవీలో రోహన్ కి డైలాగులు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ సినిమా మొత్తం తన హావ భావాలతో ఎమోషన్స్ ని రగిలించిన విధానం మెప్పిస్తుంది. థియేటర్ లో ప్రణవ్ ఫీల్ అయ్యే ప్రతి ఎమోషన్ ని ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. అంతలా ప్రణవ్ ఆడియన్స్ నుంచి అటెన్షన్ పొందారు. ఈ మూవీలో జయ కురుప్ పాత్ర సర్ప్రైజింగ్ గా ఉంటుంది. దర్శకుడు తనకిచ్చిన పనిని ఆమె అద్భుతంగా పూర్తి చేశారు. అరుణ్ అజి కుమార్, జిబిన్ గోపీనాథ్ లాంటి వారు తమ పాత్రల మేరకు నటించారు.
టెక్నికల్‌గా
డైరెక్టర్ రాహుల్ సదాశివన్ రచయితగా, దర్శకుడిగా షైన్ అయ్యాడు అనే చెప్పాలి. కొన్ని మైనస్ లు ఉన్నపటికీ సెకండ్ హాఫ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లలో దర్శకుడి పనితనం కనిపిస్తుంది. మిగిలిన డిపార్ట్మెంట్స్ నుంచి అతడు రాబట్టుకున్న వర్క్ బ్రిలియంట్ అనిపించేలా ఉంది. కథలో ఉత్కంఠని రేకెత్తించేలా క్రియేట్ చేసిన సౌండ్ డిజైన్, విజువల్స్ తో ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యేలా చేసిన సినిమా టోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అనే చెప్పాలి. తెలుగు డబ్బింగ్ చాలా చక్కగా కుదిరింది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో ఇంకాస్త బెటర్ గా ఉంటే బావుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయి.
ఫైనల్‌గా
సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు నిరాశ పరచలేదు. ఫస్ట్ హాఫ్ ని ఓపిగ్గా చూస్తే సెకండ్ హాఫ్ లో థ్రిల్లింగ్ రైడ్ గ్యారెంటీ.
రేటింగ్ : 3.25/5