- Home
- Entertainment
- హీరోయిన్ లేని సినిమా నాకు వద్దు, అట్టర్ ఫ్లాప్ అవుతుందనుకున్న సినిమాతో చరిత్ర సృష్టించిన కృష్ణ
హీరోయిన్ లేని సినిమా నాకు వద్దు, అట్టర్ ఫ్లాప్ అవుతుందనుకున్న సినిమాతో చరిత్ర సృష్టించిన కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ తన 100 వ సినిమా తరహాలోనే 200వ చిత్రంతో కూడా చరిత్ర సృష్టించారు. కానీ ముందుగా కృష్ణ ఆ సినిమా చేసేందుకు అంగీకరించలేదు. కృష్ణ తన 200వ చిత్రానికి చివరికి ఎలా అంగీకరించారో ఈ కథనంలో తెలుసుకోండి.

సూపర్ స్టార్ కృష్ణ 200వ సినిమా
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత తెలుగు సినిమాని ఏలిన హీరో కృష్ణ అనే చెప్పాలి. తన 100వ చిత్రం అల్లూరి సీతారామరాజుతో బాక్సాఫీస్ దద్దరిల్లే విజయం అందుకుని చరిత్ర సృష్టించారు. అదే విధంగా 200వ చిత్రంతో కృష్ణ సంచలనం సృష్టించారు. కృష్ణ నటించిన 200 వ చిత్రం ఈనాడు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచయితలు కాగా వ్యవహరించారు.
రీమేక్ మూవీ
ఈనాడు సినిమా మలయాళీ చిత్రానికి రీమేక్. మలయాళీ సినిమాని కృష్ణ కూడా చూశారు అని పరుచూరి గోపాల కృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా కృష్ణ గారే చేయాలి, ఆయనకు బావుంటుంది అనేది మా కోరిక. కృష్ణ గారే ఆ సినిమాని చూడమని మాకు చెప్పారు. మూవీ చూసి కృష్ణ గారు ఏకలవ్య షూటింగ్ లో ఉంటే అక్కడికి వెళ్లాం. సినిమా చూశారా బావుందా అని అడిగారు. చాలా బావుంది అని ఆయనకు చెప్పాం.
హీరోయిన్ తో రొమాన్స్ ఉండదు, మరి ఎలా ?
అయితే వెంటనే శ్రీధర్ గారిని హీరోగా పెట్టి సినిమా చేద్దాం అని కృష్ణ గారు అన్నారు. శ్రీధర్ గారికి ఈ కథ సెట్ కాదు అని చెప్పాం. అయితే మాదాల రంగారావు గారిని అడుగుదాం అని కృష్ణ అన్నారు. ఆయనతో కూడా వద్దు సార్ అని అన్నాం. మరి అయితే ఇంకెవరు చేస్తారు అని అడిగారు. మీరే చేయాలి సార్ అని చెప్పాం. వెంటనే కృష్ణగారు నవ్వేసి.. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు, రొమాన్స్ పాటలు ఉండవు.. నేను సూపర్ స్టార్ ని.. ఇవ్వన్నీ లేకుండా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అని అడిగారు.
ఒరిజనల్ కథలో కొన్ని మార్పులు
లేదు సార్.. మీరు నటిస్తే ఈ మూవీ చరిత్ర సృష్టించే సినిమా అవుతుంది అని చెప్పాం. సరే అయితే.. ఒక వేళ ఈ సినిమాలో నేను హీరో అయితే ఎలా ఉంటుందో సీన్ బై సీన్ నాకు రేపు వివరంగా చెప్పండి అని అడిగారు. ఆ రోజు రాత్రంతా మేము సినిమాని ప్రతి సీన్ చూస్తూ మార్పులు చేస్తూ స్క్రిప్ట్ రాసుకున్నాం. అలా రాసే క్రమంలో ఉదయం 6 అయిపొయింది టైం. కృష్ణ గారు మమ్మల్ని 8 గంటలకు రమ్మన్నారు. మేము 7 గంటలకల్లా రెడీగా ఉన్నాం. కృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా డైలాగులు మార్చాం. అదే విధంగా కొన్ని ఫ్యామిలీ సీన్స్ జోడించాం. ఒరిజినల్ లో ఫ్యామిలీ సీన్స్ ఉండవు.
ఈనాడు మూవీ సంచలన విజయం
మేము రాసిన ప్రతి డైలాగ్ కృష్ణ గారికి నచ్చింది.వెంటనే తన తమ్ముడు ఆది శేషగిరి రావుని పిలిచి నేను ఈ సినిమా చేస్తున్నాను. నా 100 వ సినిమా అల్లూరి సీతారామరాజు.. ఆ మూవీ లాగే 200వ సినిమా కూడా చరిత్ర సృష్టించాలి అని అన్నారు. కృష్ణ గారు చెప్పినట్లుగానే ఈనాడు చిత్రం సంచలనం సృష్టించింది. క్లైమాక్స్ సీన్ లో కృష్ణ గారి నటనకు బెజవాడలో థియేటర్స్ హోరెత్తిపోయాయి అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

