శ్రీలీల కోసం మంత్రి ప్రసంగాన్ని ఆపేసిన యాంకర్, ఇదేం పిచ్చి పని అంటూ ట్రోలింగ్
ఇటీవల శ్రీలీల హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలసి పాల్గొన్నారు. ‘సీతా’ (She Is The Hero Always) పేరుతో ప్రారంభమైన కొత్త యాప్ ప్రారంభోత్సవానికి అతిథిగా శ్రీలీల హాజరైంది.

శ్రీలీల ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. వరుస చిత్రాల్లో ఆమెకి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల శ్రీలీల హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలసి పాల్గొన్నారు. ‘సీతా’ (She Is The Hero Always) పేరుతో ప్రారంభమైన కొత్త యాప్ ప్రారంభోత్సవానికి అతిథిగా శ్రీలీల హాజరైంది. శ్రీలీల వల్ల మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది.
తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ యాప్ ప్రారంభ వేడుకలో ప్రసంగం ప్రారంభించిన కొద్ది నిమిషాల్లో, యాంకర్ ఝాన్సీ ఒక్కసారిగా మధ్యలోకి వచ్చి శ్రీధర్ బాబు ప్రసంగాన్ని అడ్డుకున్నారు.మైక్ నుంచి శ్రీధర్ బాబు పక్కకి తప్పుకున్న తర్వాత ఝాన్సీ శ్రీలీలను వేదికపైకి ఆహ్వానించారు. దీంతో మంత్రి కొద్దిసేపు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే వెంటనే చిరునవ్వు చిందించి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
శ్రీలీల వేదికపైకి వచ్చిన తర్వాత మంత్రిని వ్యక్తిగతంగా కలిసి జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత మంత్రి తన ప్రసంగాన్ని తిరిగి ప్రారంభిస్తూ, "ఇంకో హీరో మా వేదికలో చేరారు," అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ ఝాన్సీకి కనీసం సభా మర్యాద లేదా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మంత్రి ప్రసంగిస్తున్న టైంలో శ్రీలీల వేదిక కింద కూర్చుని ఉన్నారు. మంత్రి ప్రసంగాన్ని అడ్డుకుని అర్జెంట్ గా శ్రీలీలని వేదికపైకి పిలవాల్సిన అవసరం ఏంటి ? కాసేపు ఎదురుచూస్తే ఏమవుతుంది అంటూ ఝాన్సీపై విమర్శలు చేస్తున్నారు.
ఇటీవలే శ్రీలీల 'రాబిన్‌హుడ్' సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె 'జూనియర్', 'మాస్ జాతర' (రవి తేజతో), 'పరాశక్తి' (శివకార్తికేయన్‌తో), 'లెనిన్' (అఖిల్ అక్కినేనితో) చిత్రాల్లో నటిస్తున్నారు.
బాలీవుడ్‌లోనూ శ్రీలీల అడుగుపెడుతున్నారు. కార్తిక్ ఆర్యన్ సరసన అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా దీపావళి 2025 నాటికి విడుదల కానుంది. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.