‘జవాన్’ప్రీ రిలీజ్ బిజినెస్! తెలుగుకు ఎంతకు అమ్మారంటే...
జవాన్ బడ్జెట్ లో దాదాపు రూ. 100 కోట్లు షారుఖ్ రెమ్యునరేషనే కావడం గమనార్హం. ఇక నయనతార కూడా భారీగానే పుచ్చుకున్నారట.
దేశ వ్యాప్తంగా సినీ అభిమానలుఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘జవాన్’. ‘పఠాన్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ రోజు (సెప్టెంబర్ 7) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.ఈ నేపధ్యంలో జవాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికరమైన విషయాలు
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జవాన్ సినిమాను 220 కోట్ల బడ్జెట్‌తో షారుఖ్‌ఖాన్ స్వీయ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు. థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. తెలుగు రైట్స్ విషయానికి వస్తే 17 కోట్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడు రైట్స్ 15 కోట్లు కు అమ్మారు. కేరళ రైట్స్ ...13 కోట్లకు వెళ్లాయి. ఇప్పటిదాకా ఏ హిందీ డబ్బింగ్ సినిమా రైట్స్ ఈ రేటుకు అమ్ముడుపోకపోవటం చెప్పుకోదగ్గ విషయం.
అలాగే నిర్మాత అయిన షారుఖ్‌ఖాన్‌కు నార్త్, ఇతర దేశాల థియేట్రికల్ రైట్స్ ద్వారా 250 కోట్ల వరకు వచ్చినట్లు తెలిసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ 130 కోట్లకు పైనేఅమ్ముడుపోయినట్లు తెలిసింది. జవాన్ శాటిలైట్ రైట్స్ 90 కోట్లు, మ్యూజికల్ రైట్స్ 36 కోట్లకు ప్రముఖ సంస్థలు దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఓవర్‌సీస్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వంద కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. రిలీజ్‌కు ముందే షారుఖ్‌ఖాన్‌కు ఈ సినిమా 300 కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక సౌత్ లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార నటించిన తొలి బాలీవుడ్ చిత్రం ‘జవాన్’. స్వతహా షారుఖ్ అభిమాని అయిన నయన్.. అతనితో కలిసి నటించే అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పిందట. అంతకు ముందు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో ‘వన్ టూ త్రీ ఫోర్’.. అనే పాటలో నటించే చాన్స్ ముందుగా నయన్‌కే వచ్చిందట. నయన్ నో చెప్పడంతో ఆ స్థానంలో ప్రియమణిని తీసుకున్నారట.
‘జవాన్’లో షారుఖ్ ద్విపాత్రాభినయం చేశాడు. అంతేకాదు పలు విభిన్న లుక్స్‌లో కనిపించబోతున్నాడు. ట్రైలర్‌లో గుండుతో కనిపించి షాకిచ్చాడు. అయితే షారుఖ్ గుండు కంటే.. ఆ గుండుపై ఉన్న టాటు బాగా వైరల్ అయింది. షారుక్ గుండుపై 'మా జగత్ జనని' అని రాసి ఉంది. అమ్మనే ప్రపంచం అని ఆ టాటు అర్థం. ఆ టాటుకి జవాన్ కథకు సంబంధం ఉందని తెలుస్తోంది. తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకునే ఓ కొడుకు కథే జవాన్ అంటున్నారు.
చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో షారుఖ్‌కు జోడిగా నటించిన దీపికా పదుకొణె.. ‘జవాన్’లో అతిథి పాత్రలో మెరవబోతుంది. గతంలో పలు సినిమాల్లో కలిసి నటించడంతో షారుఖ్, దీపికా పదుకొణెల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. షారుఖ్ కోసమే దీపికా అతిథి పాత్రను ఒప్పుకుందట
జవాన్‌లో విలన్‌గా విజయ్ సేతుపతి నటించడం మరో విశేషం. విజయ్‌కి రెండో బాలీవుడ్ చిత్రమిది. అంతకు ముందు ముంబైకర్ చిత్రంలో విజయ్ కీలక పాత్ర పోషించాడు. అయితే అది ఓటీటీలో విడుదల కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. ‘జవాన్’తో విజయ్ సేతుపతి బాలీవుడ్ భారీ విజయం అందుకోబోతున్నారని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
‘జవాన్’కోసం షారుఖ్ రిస్కీ ఫైట్స్ చేశారట. ఈ చిత్రం కోసం ఆరుగురు అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ పని చేయడం గమనార్హం. స్పిరో రజటొస్, యనిక్ బెన్, ట్రెయిన్ మాక్రే, కెచ్చా కంపాక్డీ, అనల్ అరసు మొదలగు ఆరుగురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన పోరాట దృశ్యాలు, బైక్, కారు ఛేజింగ్స్ జవాన్ చిత్రంలో హైలెట్ కానున్నాయని యూనిట్ సభ్యులు తెలిపాయి.
జవాన్ బడ్జెట్ లో దాదాపు రూ. 100 కోట్లు షారుఖ్ రెమ్యునరేషనే కావడం గమనార్హం. ఇక నయనతార కూడా భారీగానే పుచ్చుకున్నారట. తొలి బాలీవుడ్ చిత్రానికిగాను రూ. 11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ మూవీ షూటింగ్ ముంబై, పుణె, చెన్నై, రాజస్తాన్, హైదరాబాద్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగింది.
జవాన్ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. రన్‌టైం 2:49 గంటలు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. కొన్ని గంటల్లోనే తొలిరోజు షోకి సంబంధించి సుమారు 8 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. బాలీవుడ్ చరిత్రలో ఇదొక రికార్డు.