‘ఇండియన్ 2’ను ఛాలెంజింగ్ గా తీసుకున్న కమల్ హాసన్.. ఈ వయస్సులో సాహసమనే చెప్పాలి!?
లోకనాయకుడు కమల్ హాసన్ 68 ఏండ్ల వయస్సులోనూ ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఈ మూవీ కోసం కమల్ హాసన్ శక్తికి మించి వర్క్ చేస్తున్నారు.

విలక్షణ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) - క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేష్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఇండియన్’. భారతీయ సైన్యంలో పనిచేసిన ఒక నిజాయితీపరుడైన అనుభవజ్ఞుడు పాత్రలో కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. 26 ఏండ్ల తర్వాత దీనికి సీక్వెల్ గా ‘ఇండియన్ 2’ (Indian 2) రూపుదిద్దుకుంటోంది.
గతంలోనే షూటింగ్ ప్రారంభమై.. సెట్ లో ప్రమాదం, కరోనా కారణంగా కొద్ది రోజులు చిత్రీకరణ ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీక్వెల్ ను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. రీసెంట్ గా కమల్ హాసన్ డెడికేషన్ ను వివరించే క్రమంలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) సినిమాపై ఆసక్తి పెంచే అంశాలను వెల్లడించింది.
‘విక్రమ్’తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు కమల్ హాసన్. ఏకంగా యాక్షన్ సన్నివేశాలతో థియేటర్లలో దుమ్ములేపారు. అయితే 68 ఏండ్ల వయస్సులోనూ కమల్ హాసన్ సినిమా కోసం పరితపించిపోతుండటం విశేషం. ఈ క్రమంలో శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’ను మరింత ఛాలెంజింగ్ గా తీసుకున్నారంట కమల్. మూవీలోని పాత్ర కోసం స్ట్రిక్ట్ డైట్ మెయింటేన్ చేస్తున్నారని రకుల్ ప్రీత్ తెలిపింది.
Indian 2
ఇండియన్2లో 90 ఏళ్ల వృద్ధుడిగా నటిస్తున్నారు. దీంతో పాత్రలోకి మారేందుకు ఆహార నియమాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా పాత్ర తాలుకూ ప్రోస్తేటిక్స్ మేకప్ ను వేసుకోవడానికి దాదాపు 5 గంటలు సమయం పడుతుందని తెలుస్తోంది. మళ్లీ దాన్ని తొలగించడానికి 2 గంటలు పడుతుందంట.
కేవలం మేకప్ కోసమే 7 గంటల సమయం కేటాయిస్తున్నారంట. ఇందుకోసం షూటింగ్ సమయానికంటే ఐదు గంటల ముందే సెట్స్ కు చేరుకుంటున్నారని రకుల్ వెల్లడించారు. ఆయన జీవితకాలంలో దాదాపు మూడు వంతుల జీవితం పరిశ్రమలోనే గడిచిపోయి ఉంటుందని, సినిమా గురించి కమల్ సర్ కంటే బాగా ఎవరికీ తెలియదని నమ్ముతున్నట్టు రకుల్ చెప్పుకొచ్చింది.
ఈ సినిమా సేనాపతి క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. మొదటి భాగంలో భారతీయ స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యంలో సేనాపతికి ఫ్లాష్‌బ్యాక్ కలిగి ఉంటుంది.. ఇక రెండో భాగంలో సేనాపతి తండ్రికి బలమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీంతో మళ్లీ రెండు పాత్రల్లో కమల్ అలరిస్తారని అంటున్నారు. చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లు నటిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో కమల్ హాసన్ 234 చిత్రం కూడా పట్టాలెక్కబోతోంది.