- Home
- Entertainment
- నటుడిగా, నిర్మాతగా,టీచర్ గా.. మన్నవ బాలయ్య మల్టీ టాలెంట్, విశ్వనాథ్ కే కథలు అందించిన నటుడు
నటుడిగా, నిర్మాతగా,టీచర్ గా.. మన్నవ బాలయ్య మల్టీ టాలెంట్, విశ్వనాథ్ కే కథలు అందించిన నటుడు
టాలీవుడ్ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య కన్నుమూశారు. 94 ఏళ్శ వయస్సులో అనారోగ్య కారణాల వల్ల హైదరాబాద్ లోని స్వగృహంలో ఆయన మరణించారు. తెలుగు సినీపరిశ్రమలో హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసిన బాలయ్య మల్టీ టాలెంటెడ్ గా తనను తాను నిరూపించుకున్నారు.

బాలయ్య మల్టీ టాలెంటెడ్ ఆయన ఓ వైపు నటిస్తూనే మరోవైపు టీచర్ వృత్తిని కొనసాగించారు. తన దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ కు ఇంగ్లిష్ , మ్యాథ్స్ చెప్పేవారు. బాలయ్య ఆకాలంలోనే ఇంజనీరంగ్ చదివారు.అంతే కాదు ఆయన నటుడిగానే కాకుండా.. కథలు కూడా రాసేవారు. బాలయ్య రాసిన కథలు కొన్ని అప్పట్లో.. పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి.
మిత్రుల సహకారంతో అమృతా ఫిలిమ్స్ సంస్థను స్టార్ట్ చేశారు బాలయ్య. తన కథలతో దర్శకుడు కె.విశ్వనాథ్ తో కలిసి సినిమాలు నిర్మించారు. తన కథల గురించి విశ్వనాథ్ తో డీప్ గా చర్చించేవారు. బాలయ్య రాసిన నలుపు-తెలుపు అనే కథ ఆధారంగానే గొల్లపూడి మారుతీరావుతో కలసి చెల్లెలి కాపురం సినిమా చేశారు బాలయ్య. ఈసినిమాను విశ్వనాథ్ డైక్ట్ చేశారు. శోభన్ బాబుకు ఈ సినిమా స్టార్ ఇమేజ్ ను ఇచ్చింది. బంగారు నందిని కూడా అందుకుందీ సినిమా. ఆ తరువాత కృష్ణ హీరోగా విశ్వనాథ్ దర్శకత్వంలో నేరము-శిక్ష’ తీశారు. ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది.
నేరము శిక్ష కథకు కూడా ఓ చిన్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఈ సినిమా ద్వారా ఎంతో మంది పెద్దల అభినందనలు పొందారు బాలయ్య. రష్యన్ రచయిత ఫైడర్ డోస్టోవస్కీ రాసిన క్రైమ్ అండ్ పనిష్ మెంట్ కథ ఆధారంగా ఈకథను బాలయ్య తయారు చేశారు. ఈ సినిమాలో నటునిగా బాలయ్యకు మంచి మార్కులు పడ్డాయి. ఆనాటి తమిళ సూపర్ స్టార్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్.జి.రామచంద్రన్ ఈసినిమాను చూడి ఎంతగానో అభినందించి, ఆ సినిమాను రీమేక్ చేయడానికి హక్కులు తీసుకున్నారు. నీదిక్కు తలైవనంగు పేరుతో తమిళ్ లో రీమేక్ కూడా చేశారు ఎమ్జీఆర్. తెలుగులో బాలయ్య పాత్రను తమిళంలోనూ ఆయనతోనే పోషింపచేశారు ఎమ్జీఆర్.
బాలయ్య నిర్మాతగా మారడానికి కారణం పరోక్షంగా ఎన్టీఆరే..బాలయ్య మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ చూసేవారు నటించేవారు. ముఖ్యంగా హిందీలో పృథ్వీరాజ్ కపూర్, శాంతారామ్ ను, తెలుగులో యన్టీఆర్ ను బాలయ్య మితంగా అభిమానించేవారు. యన్టీఆర్ తో కలసి పనిచేయడం వల్ల ఆయన క్రమశిక్షణకు బాలయ్య అట్రాక్ట్ అయ్యారు. యన్టీఆర్ శ్రీక్రిష్ణపాండవీయం సినిమాలో నటించే టైమ్ లోనే నిర్మాతగా రామారావు బడ్జెట్ ను ఎంతలా కంట్రోల్ చేస్తారో చూసి నేర్చుకున్నారు మన్నవ బాలయ్య. ఈ ఫార్ములాను తాను నిర్మాతగా సినిమాలు చేసేప్పుడు అప్లై చేసేవారు.
శోభాన్ బాబుతో బాలయ్య చెల్లెలి కాపురం సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా సక్సెస్ తరువాత శోభన్ బాబుతోనే నేరము-శిక్ష నిర్మించాలని చూశారు బాలయ్య. కాని ఆ క కథ విన్న శోభన్ బాబుఈ సినిమాను కలర్ లో తీస్తేనే నటిస్తానని పట్టు పట్టుకుని కూర్చున్నారు. దాంతో కృష్ణ దగ్గరకు నేరము-శిక్ష కథ వెళ్ళింది.
మన్నవ బాలయ్యకు కృష్ణతో అనుబంధం ఎక్కువగా ఉండేది. నేరము-శిక్ష తరువాత బాలయ్యకు, హీరో కృష్ణకు మంచి అనుబంధం ఏర్పడింది. బాలయ్య అన్నదమ్మల కథ తీసే రోజుల్లోనే కృష్ణ అల్లూరి సీతారామరాజు తెరకెక్కిస్తున్నారు. అందులో అగ్గిరాజు పాత్రకు తొలుత యస్వీ రంగారావును అనుకున్నారు. కానీ, ఆయన అనారోగ్య కారణాల వల్ల చేయడానికి వీలు పడలేదు. ఆ సమయంలో కృష్ణకు బాలయ్య గుర్తుకు వచ్చారు. ఆయనను పిలిపించి, టెస్ట్ చేసి, ఆ స్టిల్స్ విజయా అధినేత చక్రపాణికి చూపించారు. ఆయన కూడా ఓకే అనడంతో అగ్గిరాజు పాత్రలో బాలయ్య నటించి మంచి పేరు సంపాదించారు.
నిర్మాతగానే కాదు బాలయ్య దర్శకుడిగా కూడా తన మార్క్ చూపించారు. చిరంజీవితో ఊరికిచ్చిన మాట నిర్మించడంతో పాటు ఈసినిమాను స్వయంగా డైరెక్ట్ చేశారు. కృష్ణంరాజుతో నిజం చెబితే నేరమా తీశారు. తన తరువాత తన వారసులను ఇండస్ట్రీలో తీసుకురావాలని చూవారు బాలయ్య. తన తనయుడు తులసీరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ పసుపుతాడు సినిమాను తానే నిర్మించి..దర్శకత్వం వహించారు. రాధ నాయికగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అప్పటి నుంచే సినిమా నిర్మాణానికి దూరంగా ఉండిపోయారు బాలయ్య. నటనకే పరిమితం అయ్యారు.
నిర్మాతగా కొనసాగుతున్న సమయంలోనే బాలయ్య నటునిగానూ మెప్పించారు. నామాల తాతయ్య లో శ్రీనివాసుని గా..భక్త కన్నప్ప, జగన్మాత లాంటి సినిమాల్లో శివునిగా.. ఇలా అనేక జానపద, చారిత్రక, పౌరాణికాల్లో మెరిసారు బాలయ్య. యన్టీఆర్ తో చివరి వరకూ బాలయ్యకు మంచి అనుబంధం ఉండేది. యన్టీఆర్ చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ లోనూ ఆయన స్నేహితుడిగా బాలయయ నటించారు. ఈతరం తారలకు తాతగా చాలా సినిమాల్లో నటించిన బాలయ్య.. చివరిగా బాలకృష్ణ నటించిన బాపు శ్రీరామరాజ్యంలో వశిష్టుని పాత్రలో కనిపించారు. గత కొంతకాలంగా వయసు సహకరించక పోవడంతో నటనకు కూడా దూరంగా ఉన్నారు బాలయ్య. వృద్ధాప్య సమస్యలతో ఆయన కన్ను మూశారు.