Guppedantha Manasu: కోపంతో వసుధార మీద చెయ్యిత్తిన రిషి.. నిజం చెప్పమంటూ ఒత్తిడి చేస్తున్న జగతి, వసుధార!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు జీవితం ఏమైపోతుందో అని కంగారు పడుతున్న తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో వసుధార రిషి కి ఫోన్ చేసి జగతి వాళ్ళకి యాక్సిడెంట్ అయిన విషయం చెప్తుంది. కంగారుపడిన రిషి తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరుతాడు. మరోవైపు వసుధార ఇంట్లో ఉన్న మహేంద్ర దంపతులకు డాక్టర్ ట్రీట్మెంట్ చేసి టాబ్లెట్లు రాసిచ్చి పది రోజులు వాడమని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే కంగారుగా రిషి అక్కడికి వస్తాడు.
ఎలా ఉంది, అయినా మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, మేడం రమ్మన్నారా అంటూ వసుధార వైపు చూస్తాడు రిషి. లేదు విశ్వనాథం గారు నీకు, ఏంజెల్ కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసిన విషయం ఫోన్ చేసి చెప్పారు. అందుకే మేం బయలుదేరి వచ్చాము అంటాడు మహేంద్ర. యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడుగుతాడు. మేము కంగారుగా వస్తుంటే కారు స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ జరిగింది అంతే అని అబద్ధం చెప్పేస్తాడు మహేంద్ర.
అయినా ఈ పెళ్లి, ఈ నిశ్చితార్థం ఇదంతా ఏంటి అని అడుగుతాడు మహేంద్ర. ఇప్పుడు మీరు స్ట్రెస్ తీసుకోకండి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఈ యాక్సిడెంట్ వెనక శైలేంద్ర హస్తం ఉందా అని అనుమాన పడుతుంది జగతి. తర్వాత హాల్లో కూర్చున్న రిషికి వసుధార కాఫీ తాగమని ఇస్తుంది. మన జీవితాలు ఇలా అయిపోయాయి ఏంటి.. యాక్సిడెంట్లు, గొడవలు ఇంకా ఏవేవో అయిపోతున్నాయి అసలు ఎందుకిలా జరుగుతుంది?
ఇదేనా జీవితం? ఈ ప్రశ్నలన్నింటికీ నేను సమాధానాలు ఎవరిని అడగాలి అంటాడు రిషి. ఎవరినో అడిగితే మీకు సమాధానాలు దొరకవు. లోతుగా ఆలోచిస్తే సమాధానాలు మీకే దొరుకుతాయి. మీరు లైట్ తీసుకుంటున్న కొద్ది ఇలాంటి సమస్యలు ఎదుర్కో ఎదుర్కొంటూనే ఉంటారు. ఇదంతా అవసరమా? కాస్త ఆలోచించండి మీ శత్రువులు ఎవరో మీకే తెలుస్తుంది అంటుంది వసుధార.
నీకు తెలుసు కదా చెప్పు అంటాడు రిషి. మీ అయిన వాళ్లే మీ శత్రువులు అంటుంది వసుధార. ఇంకాపు అంటూ కోపంతో వసుధార మీద చెయ్యి ఎత్తుతాడు రిషి. నా వాళ్లు నాకెందుకు ద్రోహం చేస్తారు. వాళ్ళందరూ నా మంచి కోరుకునే వాళ్లే. నాకు కాలేజీ పరంగా ఉన్న శత్రువులే ఎవరో ఇలా చేస్తున్నారు అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరతాడు రిషి. వెళ్లొద్దు అంటూ అతనిని అడ్డుకుంటుంది వసుధార. విశ్వనాథం సార్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
తప్పుకో అని ఆమెని పక్కకి నెట్టే ప్రయత్నంలో చేతికి గాయం అవుతుంది. ఆ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్లాస్టర్ పెడుతుంది వసుధార. నా పని ఇంకా అవ్వలేదు అప్పుడే రాలేను అని విశ్వనాథం సార్ కి మెసేజ్ పెట్టు అని వసుధార కి చెప్తాడు రిషి. సరే అంటూ ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. ఆ తర్వాత తండ్రి పక్కనే పడుకుంటాడు రిషి. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధారకి తండ్రి తరఫున థాంక్స్ చెప్తాడు.
ఆ తర్వాత ఫోన్ రావటంతో మెలకువ వచ్చిన మహేంద్ర ఫోన్ తీసుకోవడం కోసం మంచం దిగుతాడు. ఫోన్ తీసుకొని మాట్లాడే లోపు కళ్ళు తిరిగి పడిపోబోతాడు. అప్పుడు రిషి వచ్చి మహేంద్ర ని పట్టుకొని కూర్చోబెడతాడు. అప్పుడు మహేంద్ర నాకేం కాలేదు బానే ఉంది. నా బెంగ అంతా నీ కోసమే. ఎందుకు నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నావు.
ఇదంతా నీకు అవసరమా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు అంటాడు మహేంద్ర. ఇంతలో విశ్వనాథం మహేంద్ర కి ఫోన్ చేస్తే ఫోన్ తన చేతిలో ఉండటం మూలంగా తనకే ఫోన్ వచ్చింది అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి. అదేంటి మహేంద్ర గారికి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసావు అని అడుగుతాడు విశ్వనాథం. అప్పుడు ఆ ఫోన్ తనది కాదని తండ్రిదని గ్రహిస్తాడు రిషి. వాళ్లు వచ్చారు సార్ నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను అంటాడు. మహేంద్ర గారికి ఫోన్ ఇవ్వు అని అంటాడు విశ్వనాథం. ఆయన పడుకున్నారు అని అబద్ధం చెప్పేస్తాడు రిషి.
అయితే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టటానికి పంతులుగారు వస్తున్నారు వాళ్లని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోని 11 గంటలకల్లా నువ్వు ఇంట్లో ఉండు అంటాడు విశ్వనాథం. సరే అని ఫోన్ పెట్టేస్తాడు రిషి. ఏంటి డాడ్ ఈ బలవంతం. ఎలా తప్పించుకోవాలి అంటాడు రిషి. నిజం చెప్పి తప్పించుకోవాలి అంటూ జగతి గదిలోకి వస్తుంది. ఆమె వెనకే వచ్చిన వసుధార కూడా నిజం చెప్పటమే మంచిది అంటుంది. నేను చెప్పే పరిస్థితుల్లో లేను అంటాడు రిషి. పోనీ నేను చెప్తాము అంటుంది జగతి.
ఏమని చెప్తారు? నేను మీ కొడుకునని, మీరే నాకు నమ్మకద్రోహం చేశారని, నన్ను కాలేజీ నుంచి బయటికి గెంటేసారని చెప్తారా.. వాళ్ల ముందు కూడా నన్ను దోషిని చేయకండి. వాళ్ళకి నిజం చెప్పటం నాకు ఇష్టం లేదు అంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.