నరేష్, పవిత్రకి షాకిచ్చిన రమ్య రఘుపతి.. 'మళ్ళీ పెళ్లి' ఓటీటీ రిలీజ్ ఆపాలంటూ నోటీసులు
వివాదాస్పద సంఘటనలతోనే నరేష్ బోల్డ్ గా మళ్ళీ పెళ్లి అనే చిత్రాన్ని రూపొందించారు. నరేష్, పవిత్ర జంటగా నటించగా.. రమ్య రఘుపతి పాత్రని నెగిటివ్ యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేశారు.
సౌత్ లో సంచలనం సృష్టించిన లవ్ బర్డ్స్ నరేష్, పవిత్ర. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ప్రేమ కథలు, వ్యక్తిగత వివాదాలు సహజమే. కానీ వీళ్లిద్దరి వ్యవహారం వేరు. 60 ప్లస్ లో ఉన్న నరేష్.. 40 ప్లస్ లో ఉన్న పవిత్ర మధ్య ఘాటు ఎఫైర్ మొదలయింది. ఆ తర్వాత నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి మధ్య ఎలాంటి వివాదం చెలరేగిందో అంతా చూశారు. ప్రస్తుతం నరేష్, పవిత్ర పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. నరేష్, పవిత్ర మైసూరులో హోటల్ గదిలో ఉండగా రమ్య రఘుపతి అక్కడికి వెళ్లి రచ్చ రచ్చ చేసింది.
అలాంటి వివాదాస్పద సంఘటనలతోనే నరేష్ బోల్డ్ గా మళ్ళీ పెళ్లి అనే చిత్రాన్ని రూపొందించారు. నరేష్, పవిత్ర జంటగా నటించగా.. రమ్య రఘుపతి పాత్రని నెగిటివ్ యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేశారు. ఆమె పాత్రలో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించారు. థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన మళ్ళీపెళ్లి చిత్రం నేటి నుంచి ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. ఆల్రెడీ ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోలో కూడా నేటినుంచి అందుబాటులోకి రానుంది.
ఈ రోజుల్లో ఓటిటి వేదికల ద్వారా చిత్రాలు ఆడియన్స్ బాగా చేరువవుతున్నాయి. దీనితో తనని బదనాం చేసేలా తెరకెక్కించిన మళ్ళీపెళ్ళి చిత్రాన్ని అడ్డుకునేందుకు రమ్య రఘుపతి రంగంలోకి దిగారు. తాజాగా ఆమె ఆహా, ప్రైమ్ వీడియో సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు.
మళ్ళీ పెళ్లి చిత్రంలో వాస్తవాలని చూపించడం లేదు. పైగా తన క్యారెక్టర్ ని చెడుగా చూపించారు. తన ప్రతిష్టని దిగజార్చేందుకు సినిమా క్రియేటివిటీని, భావప్రకటనా స్వేచ్చని దుర్వినియోగం చేస్తున్నారు అంటూ రమ్య రఘుపతి నోటీసులో పేర్కొన్నారు. తనని డీమొరలైజ్ చేసే విధంగా వాళ్ళకి కన్వీనియంట్ గా మళ్ళి పెళ్లి చిత్రంలో వ్యక్తిగత వివాదాలని వాడుకున్నట్లు రమ్య రఘుపతి ఆరోపించారు.
సినిమా నెపంతో తనని మరింత క్షోభ పెట్టేలా వ్యక్తిగత వివాదాలలో తనని దోషిగా నిలిపే కుట్ర జరుగుతోంది అని రమ్య అంటున్నారు. ప్రస్తుతం ప్రజలపై ఓటిటి ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో మళ్ళీ పెళ్లి చిత్రం ఓటిటి లో రిలీజ్ అయితే తన ప్రతిష్ట మరింత దిగజారుతుంది. దీనితో ఈ చిత్ర ఓటిటి రిలీజ్ అడ్డుకునేందుకు ఆమె లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
ఓటిటి రిలీజ్ విషయంలో రమ్య రఘుపతి కోర్టుకు వెళితే నరేష్ తో మరోసారి విభేదాలు రచ్చకెక్కినట్లే. గత కొంతకాలంగా నరేష్ మౌనం వహిస్తున్నారు. పవిత్రతో సహజీవనం చేస్తూ హ్యాపీగా గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలో అతడి మూడవ భార్య బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రాన్ని ఎమ్మెస్ రాజు తెరకెక్కించగా విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ నిర్మించారు.