సింహాద్రి, మగధీర చిత్రాలు రాజమౌళికి అంత చిరాకు తెప్పించాయా.. జక్కన్న మాటంటే మాటే
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి తన విజన్ తో వెండితెరపై అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాడు. తెలుగు సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువస్తున్నాడు.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి తన విజన్ తో వెండితెరపై అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాడు. తెలుగు సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువస్తున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే నెలలో 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్.. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.
వీరిద్దరితో రాజమౌళి ఆల్రెడీ సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తో రాజమౌళి గతంలో స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ చిత్రాలు చేశారు. రాంచరణ్ తో మగధీర సినిమా చేశారు. రాజమౌళి ప్రస్తుతం ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా కీర్తింపబడుతున్నారు. ఈ స్టార్డం రాజమౌళికి ఓవర్ నైట్ లో వచ్చింది కాదు. ఒక్కో మెట్టూ ఎదుగుతూ జక్కన్న ఈ స్థాయికి చేరారు.
ఇదిలా ఉండగా రాజమౌళి తాను చేసే పనిపై ఫుల్ క్లారిటీతో ఉంటారు. సింహాద్రి, మగధీర చిత్రాల విషయంలో రాజమౌళి కొంత చిరాకుకి గురయ్యారట. అప్పటి సంగతులని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి పంచుకున్నారు. మగధీర సమయంలో మెగా ఫ్యామిలీకి, రాజమౌళికి కొంత గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది. కానీ అక్కడ వాస్తవంగా జరిగింది వేరు.. బయట ప్రచారం జరిగింది వేరు.
ఆ సంఘటనపై రాజమౌళి మాట్లాడుతూ.. తనకు మెగా ఫ్యామిలీకి ఎలాంటి గ్యాప్ రాలేదు అని రాజమౌళి అన్నారు. పైగా అల్లు అరవింద్ కి నేనంటే చాలా ఇష్టం. మగధీర 50 రోజుల పోస్టర్ లో అల్లు అరవింద్ గారే చరణ్ ని నన్ను కలిపి గుర్రాలపై ఉన్న స్టిల్స్ పోస్టర్ లో వేయించారు. నాకు ఇష్టం లేదు. కానీ ఉంటే బావుంటుంది అని అల్లు అరవింద్ గారు వేయించారు. అంత బాగా చూసుకున్నారు.
ఒక విషయంలో మాత్రం నిరాశకు గురైనట్లు రాజమౌళి తెలిపారు. అప్పట్లో స్టార్ హీరోల చిత్రాలకు 50 రోజులకు.. 100 రోజులకు థియేటర్స్ నంబర్స్ పెంచి ప్రచారం చేసుకునేవాళ్ళు. సింహాద్రి చిత్రం జెన్యూన్ గా చాలా థియేటర్స్ లో 100 రోజులు ఆడింది. ఆ విషయం తెలిసి మేమంతా చాలా సంతోషపడ్డాం. కానీ 175 రోజులకు 15 థియేటర్స్ ఎక్కువగా చూపించారు. ఇలా అందరి హీరోల సినిమాలకు అప్పట్లో ప్రచారం చేసుకునేవారు. ఇది నాకు చాలా చిరాగ్గా అనిపించేది.
మగధీర చిత్రంతో అయినా ఆ తప్పుడు ట్రెండ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నా. మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది. ఎంత విజయం సాధించాలో అంతా సాధించింది ఆ మూవీ. కనై 100 రోజులకు థియేటర్స్ పెంచి చూపించడం మొదలుపెట్టారు. అలా థియేటర్స్ పెంచి చూపించొద్దని ముందుగానే అల్లు అరవింద్ కి నేను చెప్పాను. అయినా కూడా అలానే చేశారు.
నేను వెళ్లి అడిగితే.. నిజమే రాజమౌళి, కానీ నాకు ఫ్యాన్స్ నుంచి ఎంత ఒత్తిడి ఉందో నీకు తెలియదు అని బదులిచ్చారు. ఆయన పరిస్థితి అర్థం చేసుకోగలను. కానీ తప్పుడు ప్రచారం మాత్రం నాకు ఇష్టం ఉండదు. సర్ అలా అయితే నేను 100 రోజుల ఫంక్షన్ కి హాజరు కాను అని అరవింద్ గారితో చెప్పేసినట్లు రాజమౌళి తెలిపారు.
అల్లు అరవింద్ గారితో నాకు అంత చనువు ఉంది కాబట్టే నేను ఆయనతో ధైర్యంగా ఆ మాట చెప్పినట్లు రాజమౌళి అన్నారు. అసలు జరిగింది అదే అని.. అందులో ఎలాంటి వివాదం, విభేదాలు లేవని రాజమౌళి అన్నారు.