- Home
- Entertainment
- Puri Jagannadh: 60 ఏళ్ళ వయసు, 6 బెస్ట్ మూవీస్.. బద్రితో మొదలు, స్లో అయ్యాక జూలు విదిల్చిన పూరి జగన్నాధ్
Puri Jagannadh: 60 ఏళ్ళ వయసు, 6 బెస్ట్ మూవీస్.. బద్రితో మొదలు, స్లో అయ్యాక జూలు విదిల్చిన పూరి జగన్నాధ్
60వ పుట్టినరోజు జరుపుకుంటున్న పూరి జగన్నాథ్‌కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఆరు సినిమాలు, ఆయన మార్క్ దర్శకుడిగా నిలిచిన తీరు ఇదే. పూరి జగన్నాధ్ బద్రితో కెరీర్ ప్రారంభించి పోకిరితో పీక్ స్టార్ డమ్ అందుకున్నారు.

Puri Jagannadh
టాలీవుడ్‌లో హీరోలను కొత్తగా చూపించడంలో, మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథలు, క్యారెక్టర్లను తీర్చిదిద్దడంలో పూరి జగన్నాథ్‌ది ప్రత్యేకమైన శైలి. 2000లో ‘బద్రి’తో దర్శకుడిగా పరిచయమైన పూరి.. రెండు దశాబ్దాలకు పైగా తనదైన మార్క్‌తో సినిమాలు తెరకెక్కించారు. కేవలం హీరో క్యారెక్టరైజేషన్ మీదే కథలు రాసి బ్లాక్ బస్టర్లు కొట్టే అరుదైన దర్శకుల్లో పూరి ఒకరు. సెప్టెంబర్ 28న 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన ఈ ఆరు సినిమాలను గుర్తు చేసుకుందాం.
బద్రి
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘బద్రి’ పూరి జగన్నాథ్ దర్శకుడిగా తొలి అడుగు. ప్రేమకథకు తనదైన ట్రీట్‌మెంట్, హీరో క్యారెక్టరైజేషన్, పంచ్ డైలాగ్స్‌తో పూరి మొదటి సినిమాతోనే తన శైలిని పరిచయం చేశారు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించి పూరికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా అవకాశం దక్కించుకోవడం కోసం పూరి జగన్నాధ్ ముందుగా పవన్ కి వేరే మూవీ కథ చెప్పి మాయ చేసి బుట్టలో వేసుకున్నారు. కానీ చివరికి బద్రి తెరకెక్కించారు. ముందు చెప్పిన స్టోరీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఈ సినిమాని పూరి రవితేజ తో తెరకెక్కించారు.
ఇడియట్
రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇడియట్’ పూరి జగన్నాథ్ కెరీర్‌లో మరో కీలకమైన సినిమా. హీరో పాత్రను చాలా ఎనర్జిటిక్‌గా, మాస్‌కు దగ్గరగా చూపిస్తూ పూరి తన టేకింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో రవితేజకు మాస్ హీరోగా మరింత గుర్తింపు రావడంతో పాటు పూరి స్టైల్ మరింత బలపడింది.
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
రవితేజ, అసిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’లో యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలను పూరి చక్కగా మేళవించారు. ముఖ్యంగా హీరో పాత్రను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తీర్చిదిద్దిన విధానం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకు పూరి రాసిన సంభాషణలకు నంది అవార్డు కూడా దక్కింది.
శివమణి
నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘శివమణి’లో పోలీస్ ఆఫీసర్ పాత్రను పూరి తనదైన మాస్ స్టైల్‌లో చూపించారు. యాక్షన్, లవ్ స్టోరీతో పాటు హీరో క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాగార్జునను పూరి చూపించిన విధానం, సినిమాలోని డైలాగ్స్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.
పోకిరి
ఆంధ్రావాలా ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాధ్ కాస్త స్లో అయ్యారు. ఒకటి రెండు చిన్న సినిమాలు చేశారు. కానీ పూరి మార్క్ కనిపించలేదు. అదే టైంలో మహేష్ బాబుతో ప్రాజెక్ట్ ఓకె అయింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘పోకిరి’ పూరి జగన్నాథ్ కెరీర్‌లోనే అత్యంత కీలకమైన సినిమాల్లో ఒకటి. తెలుగు సినిమా కమర్షియల్ లెక్కలనే మార్చేస్తూ ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాస్త స్లో అయ్యాక పూరి తిరిగి జూలు విదిల్చిన మూవీ ఇదే. హీరో క్యారెక్టరైజేషన్, యాక్షన్, ట్విస్టులు, డైలాగ్స్‌ను పూరి తనదైన వేగంతో తెరకెక్కించారు. ఈ సినిమా పూరికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంతో పాటు పలు భాషల్లో రీమేక్ అయింది.
టెంపర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘టెంపర్’లో పూరి మరోసారి హీరో క్యారెక్టరైజేషన్‌తో ఆకట్టుకున్నారు. మొదట నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రను చూపించి, ఆ తర్వాత అతడిలో వచ్చే మార్పును కథలో కీలకంగా మలిచారు. ఎన్టీఆర్‌ను కొత్త కోణంలో చూపించిన ఈ సినిమా పూరి కెరీర్‌లో మరో ముఖ్యమైన కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది.

