'జై హనుమాన్' కి హాలీవుడ్ స్టూడియోతో టైఅప్
‘హనుమాన్’ (Hanuman)కు సీక్వెల్ గా దర్శకుడు ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) తెరకెక్కించనున్న చిత్రం ‘జై హనుమాన్’ (Jai Hanuman).

Jai Hanuman
తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తమైపోయింది. దాంతో ఇతర దేశాల నిర్మాణ సంస్దలు సైతం ఇక్కడ సినిమాలపై ఓ కన్నేసి ఉంచుతున్నాయి. అలాగే మనవాళ్లు కూడా పెరుగుతున్న బడ్జెట్ లకు తగినట్లుగా కొత్త పెట్టుబడులు అన్వేషిస్తున్నారు. ఇప్పుడు 'జై హనుమాన్' కి సైతం హాలీవుడ్ స్టూడియోతో టైఅప్ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు డిస్కషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’. సంక్రాంతి కానుకగా విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి తీసిన చిత్రం ‘హను-మాన్’ (Hanuman). అమృతాఅయ్యర్ హీరోయిన్ పాత్ర పోషించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్‌రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు. రూ.40 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అంచనా.
jai hanuman
దాంతో ‘హను-మాన్’ చిత్రానికి సీక్వెల్ కు రంగం సిద్దం చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఆ సీక్వెల్ పేరు జై హనుమాన్. ఆ సీక్వెల్ పై ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో దర్శకుడుగా ప్రశాంత్ వర్మకు అవగాహన ఉంది. అందుకు తగ్గ కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు. దాదాపు 200 కోట్లు దాకా ఈ ప్రాజెక్టుపై పెట్టాలని నిర్ణయించుకున్నట్లు అంచనా.
hanu man
‘శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్’ రూపుదిద్దుకోనుంది. 2025లో విడుదల కానుంది. జనవరి నెలలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. త్వరలోనే షూట్ ప్రారంభించనున్నారు. గత చిత్రంతో పోలిస్తే సీక్వెల్ 100 రెట్లు భారీ స్థాయిలో ఉంటుందని ప్రశాంత్ గతంలో చెప్పారు. హనుమంతుడి పాత్రలో స్టార్ హీరో యాక్ట్ చేస్తారన్నారు.
Jai hanuman
ఈ క్రమంలో 200 కోట్లు పెట్టే నిర్మాతను తెలుగులో వెతకటం కన్నా హాలీవుడ్ స్టూడియోలతో టై అప్ అయితే బెస్ట్ అని ప్రశాంత్ వర్మ భావించారట. ఇప్పటికే కొన్ని పెద్ద స్టూడియోల వారితో డిస్కషన్స్ చేసారట. వాళ్ల మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ల టెక్నాలిజీని వాడుతూ మార్వెల్ సినిమాల స్దాయిలో హనుమాన్ ని మలచాలని నిర్ణయించుకున్నారు. అయితే హాలీవుడ్ స్టూడియోలు ఎంటర్ అయితే కాపీ రైట్ ఇష్యూలు వస్తాయని, వాళ్లే హనుమాన్ ప్రాంచైజీలు తీసే అవకాసం ఉంటుందని అంటున్నారు. అవన్నీ చూసుకున్నాకే ఎగ్రిమెంట్ చేసుకుంటారు.
ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ...3D ఫార్మెట్ లో సినిమాలు తీయటం అనేది ఎప్పుడో ఆపేసారు. ఇప్పుడు ఉన్న సినిమాని 3D ఫార్మెట్ లోకి కన్వర్ట్ చేస్తారు. ఆ ఫార్మెట్ కు అవసరమైన విజువల్స్, థ్రిల్స్ ఉండేలా చూసుకుంటారు. అయితే హాలీవుడ్ టెక్నీషియన్స్ ఇందులో పండిపోయారు. కాబట్టి హాలీవుడ్ స్టూడియోతో టై అప్ అయితే ఆ సపోర్ట్ వస్తుందని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట.
ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్ గురించి శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ ప్రియులకు ఆయన మాటిచ్చారు. ‘‘ఆ శ్రీరాముడి ఆశీస్సులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులకు నేను మాటిస్తున్నా. జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ‘జై హనుమాన్’తో అద్భుతమైన అనుభూతిని అందిస్తా. మనందరికీ ఈ సినిమా ఎంతో ప్రత్యేకం కానుంది’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఈమేరకు రాముడికి హనుమంతుడు మాటిస్తున్నట్టుగా ఉన్న ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. అంచనాలు రెట్టింపు చేసింది.
ఇప్పుడు ఈ ప్రాజెక్టు కంటే ముందు ప్రశాంత్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జై హనుమాన్ షూటింగ్ కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో తన పాత పెండింగ్ ఉన్న చిత్రంపై ఫోకస్ పెట్టారట ప్రశాంత్. ఇప్పటికే 65 శాతం పూర్తి చేసిన ఆక్టోపస్ సినిమా షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆక్టోపస్ సినిమా పూర్తిగా మహిళా ప్రాధాన్యత చిత్రం అని తెలుస్తోంది. ఇందులో ఐదు మహిళా ప్రధాన పాత్రలు ఉంటాయని తెలిపారు ప్రశాంత్ వర్మ. ఇందులో ఒక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.
ఈ చిత్రం స్టోరీ లైన్ విషయానికి వస్తే.. ఐదుగురు మహిళలు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయినప్పుడు ఏమి జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. అయితే ఈ సినిమాను మొదటగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపించిన తర్వాత థియేటర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు తర్వాత మొదలెట్టే 'జై హనుమాన్' సినిమా కథంతా హనుమంతుడి చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో హనుమాన్ రోల్ లో ఏ హీరో నటిస్తారనే దాని గురించి మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం క్యాస్టింగ్ ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు ప్రశాంత్ వర్మ.. ఈ గ్యాప్ లో అసంపూర్తిగా మిగిలిపోయిన 'ఆక్టోపస్' అనే సినిమాని కంప్లీట్ చేస్తున్నారు. ఇంతకు ముందు 65 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారు. మరో 10 రోజులు షూటింగ్ చేస్తే సినిమా అంతా పూర్తవుతుందని చెప్తున్నారు.