- Home
- Entertainment
- ఆగిపోతున్న ప్రశాంత్ వర్మ భారీ సినిమాలు.. `హనుమాన్` డైరెక్టర్ అత్యుత్సాహమే కారణమా?
ఆగిపోతున్న ప్రశాంత్ వర్మ భారీ సినిమాలు.. `హనుమాన్` డైరెక్టర్ అత్యుత్సాహమే కారణమా?
దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాలు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. `హనుమాన్`తో పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపిన ఆయన సినిమాలు ఆగిపోవడం ఆశ్చర్యంగా మారాయి.

ప్రశాంత్ వర్మ టాలెంటెడ్ డైరెక్టర్. రెండు మూడు పెద్ద హిట్లు పడితే పాన్ ఇండియాని దాటి గ్లోబల్ రేంజ్‌కి వెళ్లేంత సత్తా ఉన్న దర్శకుడు. ఆ విషయం ఇటీవల `హనుమాన్`తోనే నిరూపితమైంది. చాలా చిన్న సినిమాగా వచ్చి ఇది సంచలన విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపింది. మూడు వందలు కోట్ల కలెక్షన్లు సాధించడమంటే అంత ఈజీ కాదు. చిన్న హీరోతో ఆ స్థాయి విజయం అసాధారణమైనదని చెప్పొచ్చు.
ఇండియన్ ఆడియెన్స్ లో ఉన్న హనుమాన్ సెంటిమెంట్ ఈ మూవీకి బాగా వర్కౌట్ అయ్యింది. సోషల్ అంశాలను, మైథలాజికల్ టచ్ ఇస్తూ ఆడియెన్స్ ని కన్విన్స్ అయ్యేలా `హనుమాన్`ని తెరకెక్కించి అదరగొట్టాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతో అందరి చూపు ప్రశాంత్ వర్మపైనే పడింది. నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన `హనుమాన్`కి సీక్వెల్ `జై హనుమాన్`ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు చిన్న గ్లింప్స్ కూడా ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఈ మూవీని పక్కన పెట్టి బాలీవుడ్ వెళ్లాడు దర్శకుడు ప్రశాంత్. `హనుమాన్` క్రేజ్‌ని, సక్సెస్‌ని క్యాష్ చేసుకోవాలని హిందీలో రణ్ వీర్ సింగ్‌తో సినిమాని ప్రకటించారు. ఇది కూడా మైథలాజికి మూవీనే. `బ్రహ్మరాక్షస` అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. టెస్ట్ షూట్ కూడా జరిగింది. త్వరలోనే రెగ్యూలర్ షూట్ ప్రారంభమవుతుందనే కథనాలు వచ్చాయి. ఇంతలోనే ఊహించని ట్విస్ట్. సినిమా ఆగిపోయిందనే వార్త బయటకు వచ్చింది.
దీనిపై అటు దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇటు హీరో రణ్ వీర్ సింగ్ కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు. సినిమా ఆగిపోయిందనే విషయాన్ని వెల్లడించారు. `రణ్ వీర్ లాంటి ఎనర్జిటిక్ హీరో దొరకడం చాలా కష్టం. ఎంతో టాలెంటెడ్. భవిష్యత్‌లో ఆయనతో కలిసి పని చేస్తాను` అని ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ ఆలోచనలు మరో స్థాయిలో ఉంటాయి. మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్ చేయాలని చర్చించాం. ఫ్యూచర్‌లో తప్పకుండా పనిచేస్తామ`ని రణ్ వీర్ సింగ్ తెలిపారు. అయితే ప్రశాంత్ వర్మ ఈ మూవీని మైథలాజికల్ టచ్ ఉన్న పీరియాడికల్ డ్రామాగా సుమారు రెండు వందల కోట్లతో తెరకెక్కించాలని భావించారు. కానీ ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ మూవీ ఆగిపోయిందని తెలుస్తుంది. మైత్రీ మూవీ ఈ మూవీని తెరకెక్కించాలని భావించింది.
Prasanth Varma
ఇదే కాదు ప్రశాంత్ వర్మ `హనుమాన్` చేసే సమయంలోనే ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేస్తూ `అధీర` పేరుతో మూవీని తెరకెక్కించాలనుకున్నారు. షూటింగ్ కూడా ప్రారంభమైంది. కానీ ఈ మూవీ ఆగిపోయిందని తెలుస్తుంది. `హనుమాన్` రిలీజ్‌కి ముందు ఈ మూవీ చేశారు. `హనుమాన్` హిట్ తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల వైపు వెళ్లిన ప్రశాంత్ వర్మ `అధీర`ని పక్కన పెట్టారని సమాచారం. అయితే `నా సామిరంగ` దర్శకుడు విజయ్ బిన్నికి ఆ బాధ్యతలు అప్పగించారట. కానీ ఈ మూవీ ఉందా లేదా అనేది పెద్ద డౌట్. దీంతోపాటు `మహాకాళి` అనే మరో మూవీని చేయాలనుకున్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కూడా ఉండటం డౌటే అంటున్నారు.
మరి వరుసగా ప్రశాంత్ వర్మ భారీ సినిమాలు ఆగిపోవడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. అందరికి షాకిస్తుంది. బ్లాక్ బస్టర్ దర్శకుడికి ఇలా జరగడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అదే సమయంలో `హనుమాన్` లాంటి హిట్ తర్వాత `జై హనుమాన్` సినిమాని ప్రకటించి, ఇతర సినిమాలపై బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టడం పట్ల క్రిటిక్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. చక్కగా `జై హనుమాన్` చేసుకోగా, అత్యుత్సాహానికి వెళ్లాడని, అది రివర్స్ కొట్టిందని అంటున్నారు. తెలుగులో కమిట్ అయిన సినిమాలు చేయకుండా వెళ్లి బోల్తా పడుతున్నాడనే సెటైర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్లాన్ ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నెక్ట్స్ ఏ సినిమా చేస్తారనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.