- Home
- Entertainment
- The RajaSaab Review: ది రాజాసాబ్ ట్విట్టర్ రివ్యూ.. సినిమాని కాపాడిన సీన్లు అవే, ప్రభాస్ కష్టం వృధానేనా ?
The RajaSaab Review: ది రాజాసాబ్ ట్విట్టర్ రివ్యూ.. సినిమాని కాపాడిన సీన్లు అవే, ప్రభాస్ కష్టం వృధానేనా ?
ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మూవీ ప్రీమియర్ షోలు ఏపీలో ప్రారంభం అయ్యాయి. దీనితో ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి స్పందన మొదలైంది. హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన రాజాసాబ్ చిత్రం ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రభాస్ ది రాజాసాబ్ ట్విట్టర్ రివ్యూ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై బడ్జెట్ మూవీ ది రాజా సాబ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజ్ కానుంది. అయితే కాస్త ముందుగానే జనవరి 8న రాత్రి ప్రీమియర్ షోల హంగామా మొదలైంది. తెలంగాణలో ప్రీమియర్ షోలు ఆలస్యమైనప్పటికీ ఏపీలో మాత్రం 9 గంటలకు ప్రీమియర్స్ మొదలయ్యాయి. డైరెక్టర్ మారుతీ ఈ చిత్రాన్ని హర్రర్ కామెడీ ఫాంటసీ చిత్రంగా రూపొందించారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ నుంచి కామెడీ చూడబోతున్నాం అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీత దర్శకుడు. ఏపీలో ప్రీమియర్ షోలు పడడంతో ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
రాజాసాబ్ రన్ టైం ఇదే
ఈ చిత్రం 3 గంటల 9 నిమిషాల లాంగ్ రన్ టైంతో ఉంది. సినిమా హర్రర్ సన్నివేశాలతో ప్రారంభం అవుతుంది. ప్రభాస్ ఎంట్రీ సింపుల్ గా ఉంటుంది. కనిపించకుండా పోయిన తన తాత కనకరాజుని ప్రభాస్ వెతకడమే ఈ చిత్ర మూల కథాంశం. ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు కామెడీ, కొన్ని కమర్షియల్ అంశాలతో ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రభాస్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో కథని తన భుజాలపై మోసే ప్రయత్నం చేశాడు. అయితే ఫస్ట్ హాఫ్ లో గంట వరకు అదిరిపోయే మూమెంట్స్ అంటూ ఏమీ లేవు.
ఇంటర్వెల్ ఎపిసోడ్ అదిరిపోయింది
కామెడీ అక్కడక్కడ మాత్రమే వర్కౌట్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల బావున్నాయి. డైరెక్టర్ మారుతి పెట్టిన కమర్షియల్ ఎలిమెంట్స్ వర్కౌట్ కాకపోగా అవుట్ డేటెడ్ గా అనిపిస్తాయి. కథపై ఆసక్తి పెరిగేది ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్స్ నుంచి మాత్రమే. ప్రభాస్ తో దర్శకుడు కామెడీ చేయించే ప్రయత్నం చేశారు కానీ రైటింగ్ లో బలం లేకపోవడంతో ఆ సీన్లు ఆకట్టుకోలేకపోయాయి. హీరోయిన్లతో వచ్చే ట్రాకులు, సాంగ్స్ మెప్పించలేకపోయాయి.
ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే
ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశాలు చాలా బావుంటాయి. వాటిని దర్శకుడు అద్భుతంగా హ్యాండిల్ చేశారు. కథలో సంజయ్ దత్ బ్యాక్ స్టోరీ, ఆయన తాంత్రిక విద్యలకు సంబంధించిన సీన్లు బాగా వచ్చాయి. మొత్తంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచింది. కానీ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పాలి.
సెకండ్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్
ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ కంటే బెటర్ అనే చెప్పాలి. అలాగని గొప్పగా ఏమీ లేవు. కథాంశం బావున్నప్పటికీ స్క్రీన్ ప్లే దెబ్బేసింది అని అంటున్నారు. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ దారుణంగా ఉన్నాయి. ఈ చిత్రంలో పాజిటివ్ అంశాలు అంటే ప్రభాస్ ఎనర్జీ, అదే విధంగా తమన్ సంగీతం అనే చెప్పాలి. తమన్ ఇచ్చిన బీజియం బావుంది.
సంక్రాంతికి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా ?
డైరెక్టర్ మారుతీ తాను అనుకున్న కథకి న్యాయం చేయదగ్గ సన్నివేశాలు ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు మాత్రమే ఉంటాయి. సెకండ్ హాఫ్ కూడా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. మారుతి రాసుకున్న కథాంశం చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా అనిపిస్తుంది. ఆ కథాంశం చుట్టూ అల్లిన సన్నివేశాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమాత్రం పని చేయలేదు. బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎలివేషన్ సీన్లు వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్ గా ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం కష్టం.

