- Home
- Entertainment
- `బొబ్బిలిపులి` మూవీ సృష్టించిన రికార్డులు.. ప్రభుత్వ ఇనుపకంచెలను తెంచుకుని ఎన్టీఆర్ సంచలనం
`బొబ్బిలిపులి` మూవీ సృష్టించిన రికార్డులు.. ప్రభుత్వ ఇనుపకంచెలను తెంచుకుని ఎన్టీఆర్ సంచలనం
ఎన్టీఆర్ నటించిన సంచలనాత్మక చిత్రాల్లో `బొబ్బిలిపులి` ఒకటి. అయితే ఇది సృష్టించిన రికార్డులు, సంచలనాలు ఇప్పటికీ పదిలం. అదే సమయంలో వివాదాలు కూడా వెంటాడాయి.

`బొబ్బిలిపులి`తో ఎన్టీఆర్ సరికొత్త సంచలనం
ఎన్టీఆర్ ఒకప్పుడు తన సినిమాలతో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. పౌరాణిక చిత్రాలు, జానపద కథలతో సినిమాలు చేసి మెప్పించారు. తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఆ తర్వాత సాంఘీకాల వైపు టర్న్ తీసుకుని తనకు ఎవరూ పోటీ లేరని నిరూపించారు.
`అడవి రాముడు`, `వేటగాడు` చిత్రాలతో దుమ్మురేపారు. ఆ జోరులో, వచ్చిన మరో సంచలనమే `బొబ్బిలిపులి`. 1982 జులై 9న విడుదలైన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు. వడ్డే రమేష్ నిర్మాత.
అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న ఎన్టీఆర్ `బొబ్బిలిపులి` మూవీ
ఎన్టీఆర్, దాసరి నారాయణరావు కాంబినేషన్‌లో వచ్చిన ఐదో సినిమా. ఇదే చివరి మూవీ కూడా. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి పనిచేయలేదు. అదే ఏడాది వచ్చిన `జస్టిస్ చౌదరీ` మూవీ సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆ మూవీ విడుదలైన నెల రోజుల్లోనే `బొబ్బిలిపులి` రిలీజ్ అయ్యింది.
అయితే ఈ చిత్రం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. కొంత నిర్మాణ పరమైన ఇబ్బందులను ఫేస్ చేస్తే, దాన్ని మించి రాజకీయ పరమైన అడ్డంకులను ఎదుర్కొంది. రాజకీయ ఇనుపకంచెలను ఫేస్ చేసింది. సెన్సార్ అభ్యంతరం వ్యక్తమైంది.
సెన్సార్, రాజకీయ అడ్డంకులను ఎదుర్కొన్న `బొబ్బిలిపులి`
`బొబ్బిలిపులి` సినిమాలో క్లైమాక్స్ లో కోర్ట్ సీన్ హైలైట్‌గా ఉంటుంది. అందులో అనేక పొలిటికల్ డైలాగ్‌లున్నాయి. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వారికి వ్యతిరేకంగా ఈ సినిమాలో డైలాగ్‌లున్నాయని అంతా అభ్యంతరం తెలిపారు.
సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నో చెప్పింది. అనేక కట్స్ చెప్పింది. ఆ కట్స్ చేస్తే ఇక సినిమానే మిగలదు. దీంతో తమ శ్రమ, డబ్బు,టైమ్ అంతా వృథా. ముఖ్యంగా ఎన్టీఆర్ కెరీర్‌కి అది పెద్ద దెబ్బ పడుతుందని అందరి ఆందోళ.
దర్శకుడు దాసరి చాలా మదనపడ్డారు. నిద్ర లేని రాత్రులు గడిపారు. ఇక నిర్మాత ఇబ్బందులు వర్ణనాతీతం. చివరికి అనేక మంది రాజకీయ నాయకులు, రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చొరవతో సెన్సార్ క్లీయర్ అయ్యింది. ఎట్టకేలకు జులై 9న ఈ మూవీ విడుదలైంది.
`బొబ్బిలిపులి` ఫస్ట్ డే కలెక్షన్లలో సరికొత్త రికార్డు
అనేక వివాదాలను దాటుకుని `బొబ్బిలిపులి` ఆడియెన్స్ ముందుకు వచ్చింది. సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం తొలి రోజే ఏకంగా రూ.13లక్షలు వసూలు చేసింది. అప్పుడు టికెట్ రేట్ కేవలం యాభై పైసల నుంచి రూ.2 మాత్రమే.
అలాంటి టికెట్ రేట్లతో ఈ చిత్రం ఫస్ట్ డే రూ.13 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఇది తెలుగులోనే కాదు, ఇండియన్ మూవీ రికార్డులను బ్రేక్ చేసి సంచలనం సృష్టించడం విశేషం. మొదటి వారంలో ఇది రూ.72లక్షలు రాబట్టిందట. ఇది కూడా అప్పట్లో రికార్డు. ఇతర హీరోల మూడు నాలుగు సినిమాల టోటల్ వసూలు కలిపితే ఈ కలెక్షన్లు కావడం విశేషం.
`బొబ్బలిపులి` టోటల్ కలెక్షన్లు
యాభై లక్షలతో నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రన్‌లో 3.5కోట్లు వసూలు చేసింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. 39 సెంటర్లలో వంద రోజులు ప్రదర్శించబడింది. రెండు మూడు సెంటర్లలో 175రోజులు ప్రదర్శించబడింది. అలాగే కొన్ని థియేటర్లలో షిఫ్ట్ లు మారుస్తూ ఏడాదిపాటు ప్రదర్శించడం విశేషం.
ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా రాజకీయాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా మారడానికి, అందరి చూపు ఆయనవైపు తిరగడానికి ఈ మూవీ పాత్ర ఎంతో ఉందని చెబుతుంటారు. ఏదేమైనా `బొబ్బిలిపులి` సినిమా అప్పట్లో సరికొత్త సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు.