- Home
- Entertainment
- అప్పుడు శ్రీదేవి, ఇప్పుడు నేహా శెట్టి.. వానపాటల్లో వీళ్లే తోపా.. రాధిక రియాక్షన్ ఏంటో తెలుసా?
అప్పుడు శ్రీదేవి, ఇప్పుడు నేహా శెట్టి.. వానపాటల్లో వీళ్లే తోపా.. రాధిక రియాక్షన్ ఏంటో తెలుసా?
`డీజే టిల్లు`తో రాధికగా పాపులర్ అయిన నేహా శెట్టి ఇప్పుడు `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` చిత్రంతో రాబోతుంది. అయితే తనని శ్రీదేవితో పోల్చుకోవడం గమనార్హం.

వానపాటలు అంటే మొదటగా గుర్తొచ్చేది శ్రీదేవినే. ఎన్టీఆర్‌తో `ఆకుచాటు పింద తడిచే` అంటూ అప్పట్లో `వేటగాడు` సినిమాలోని ఆ పాట ఓ రేంజ్‌లో ఊపేసింది. ఇప్పటికీ నేటి తరం యూత్ కూడా ఆ పాటనీ ఎంజయ్ చేసేలా ఉంటుంది. అయితే మధ్యలో తమన్నా కూడా చేసింది. రామ్ చరణ్‌తో కలిసి `వాన వాన వెల్లువాయే` అంటూ ఓ రేంజ్‌లో ఊపేసింది. మధ్యలో చాలా సినిమాల్లో వాన పాటలు వచ్చినా ఆ స్థాయి పేరు రాలేదు. కానీ ఇటీవల `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`లో వాన పాట ఉంది. విశ్వక్ సేన్, నేహా శెట్టిల మధ్య వచ్చిన `సుట్టంలా సూసి` అనే పాట బాగా ఆదరణ పొందింది. కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది.
దీంతోపాటు ఆ మధ్య `రూల్స్ రంజాన్`లోనూ సమ్మోహనుడా` అంటూ ఉర్రూతలూగించింది నేహా శెట్టి. ఇలా వానపాటలకు నేటితరం హీరోయిన్లలో నేహా శెట్టికి మంచి పేరు వచ్చింది. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. వాన పాటలకు ఫేమస్‌గా మారారనే ప్రశ్నకి ఆమె స్పందిస్తూ, అది తనకు పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నట్టుగా తెలిపింది. అప్పట్లో వాన పాట అంటే శ్రీదేవి గారే గుర్తొచ్చేవారు. ఆమెని పాట అంతగా పాపులర్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు తనకు అలాంటి కాంప్లిమెంట్స్ వస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. శ్రీదేవితో పోల్చడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది నేహా శెట్టి.
ఇక `డీజే టిల్లు`లో రాధిక పాత్ర బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటికీ అమెని రాధికా అనే పిలుస్తున్నారు కుర్రాళ్లు. దీనిపై రియాక్ట్ అవుతూ అది కూడా తాను గౌరవంగా భావిస్తానని తెలిపింది. బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్‌ని బాద్షా అని ఇప్పటికీ పిలుస్తారో, అలా తనని రాధికా అని పిలవడం సంతోషంగా ఉందని, ఆడియెన్స్ లో తనపై ఉన్న ప్రేమకు నిదర్శమని తెలిపింది నేహాశెట్టి.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`లో నేహాశెట్టితోపాటు అంజలి మరో హీరోయిన్‌గా నటించింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీ నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నేహా శెట్టి ఈ విషయాలను పంచుకుంది. ఈ మూవీలో తాను బుజ్జి పాత్రలో కనిపించబోతుందట. తన పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని తెలిపింది. `డీజే టిల్లు`లో రాధిక పాత్రతో పోల్చితే పూర్తి భిన్నమైన పాత్ర అని తనని మరో యాంగిల్‌లో ఆవిష్కరించే ఆపత్ర అవుతుందని చెప్పింది.
`బుజ్జి అనేది 90లలో ధనవంతుల కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయి పాత్ర. అందంగా కనిపిస్తూనే, ధృడంగా ఉండే పాత్ర ఇది. ట్రైలర్‌లో మీకు అందంగానే కనిపించాను, కానీ దాన్ని మించి స్ట్రాంగ్‌గా ఉంటుంది. సినిమాలో ఈ పాత్రకి సంబంధించి ఆశ్చర్యకర విషయాలు ఉంటాయి. బుజ్జి అనేది సినిమాలో బలమైన పాత్రలలో ఒకటి. ఒకమ్మాయిలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో అవన్నీ ఇందులో చూడొచ్చు. ఈ మూవీ ఒక కుటుంబ ప్రయాణంలా ఉంటుంది. 90 లలో రత్న అనే పాత్రతో పాటు రత్నమాల, బుజ్జి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఇది ఒక జీవిత కథ. ప్రచార చిత్రాలు చూసి యాక్షన్ మాత్రమే ఎక్కువ ఉంటుంది అనుకోవద్దు. రొమాన్స్, కామెడీ, డ్రామా అన్నీ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమా ఉంటుంది` అని చెప్పింది నేహా శెట్టి.
`డైరెక్టర్ ఇందులోని నా పాత్రకి శోభన గారిని రిఫరెన్స్ గా చూపించారు. చీరకట్టు, జుట్టు, కళ్ళ కాటుక ఇలా ప్రతి దాని మీద ఎంతో శ్రద్ధ పెట్టాము. 90ల నాటికి తగ్గట్టుగా నా ఆహార్యాన్ని మార్చుకోవడమే కాకుండా.. అప్పటి నటీమణుల అభినయం ఎలా ఉండేదో తెలుసుకొని, దానికి తగ్గట్టుగా హావభావాలు పలికించాను. నేను ఇప్పటివరకు ఎక్కువగా మోడ్రన్ పాత్రలే చేశాను. కానీ బుజ్జి పాత్ర అలా కాదు. మాటల కంటే ఎక్కువగా కళ్ళతోనే భావాలను పలికించే పాత్ర ఇది. ఈ బుజ్జి పాత్ర నాకు ఎంతగానో పేరు తెచ్చి పెడుతుంది` అని వెల్లడించింది.
నెక్ట్స్ సినిమాల విషయంలో కాస్త సెలక్టీవ్‌గా వెళ్తున్నట్టు తెలిపింది. వచ్చిన అన్ని చేయడం లేదని, తన పాత్రకి ప్రయారిటీ ఉన్న పాత్రలే చేస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ మూవీకి కమిట్ అయినట్టు చెప్పిన నేహా శెట్టి మరికొన్ని చిత్రాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది. అయితే శెట్టిలంతా టాలీవుడ్‌ని రూల్ చేస్తున్నారని అడగ్గా, అందుకు గర్వంగా ఉందని చెప్పింది. లక్కీగా అలా కలిసి వచ్చిందని, చాలా హ్యాపీగా ఉందని తెలిపింది నేహా శెట్టి.