నాలుగో క్లాస్‌లో ఫ్రాక్ వేసి అమ్మాయిలా యాక్ట్ చేయమన్నారు: నవీన్ పోలిశెట్టి
నవీన్ పొలిశెట్టి తన సినీ ప్రస్థానం, చిన్నతనం జ్ఞాపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతడు ఏమన్నాడో తెలుసా.? పాఠశాలలో అమ్మాయి పాత్రల్లో నటించడం నుంచి చిచోరే షూటింగ్ సమయంలో IIT బాంబేలో ఇంజనీరింగ్ రోజులను గుర్తుచేసుకోవడం వరకు..

కెరీర్ యూట్యూబ్ వీడియోలతోనే
తన కెరీర్ యూట్యూబ్ వీడియోలతోనే ప్రారంభమైందని, అప్పటికి ఇప్పటికి టెక్నికల్ తేడాలు(720 పిక్సెల్ నుంచి 4K వరకు) ఉన్నప్పటికీ, నటన పట్ల తనకున్న అభిరుచి, అంకితభావం మాత్రం మారలేదని స్పష్టం చేశాడు. షార్ట్ ఫిల్మ్స్‌కు ఎంత కష్టపడేవాడినో, సినిమాకు కూడా అంతే శ్రమిస్తానని అన్నాడు.
నాలుగో తరగతి నుంచే..
నటన పట్ల తనకున్న ఆసక్తి నాలుగు లేదా ఐదో తరగతిలో మొదలైందని నవీన్ వెల్లడించాడు. తాను చదివిన బాయ్స్ స్కూల్లోని యాన్యువల్ కార్యక్రమాల్లో అమ్మాయి పాత్రలను పోషించడానికి ఎవరూ ఉండేవారు కాదని, అప్పుడు తన ఉపాధ్యాయులు తనను ఫ్రాక్ ధరించి నటించమని ప్రోత్సహించారని తెలిపాడు. మొదట్లో అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా నటిస్తున్నానని టీచర్లు సూచించేవారని గుర్తుచేసుకున్నాడు.
ఫ్రాక్ వేసుకుని బయటకు వస్తే..
ఒకసారి ఫ్రాక్ వేసుకుని బయటికి వస్తున్నప్పుడు తన తల్లి పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు, చుట్టూ ఉన్నవారు జోకులు వేయడంతో తాను చాలా ఏడ్చానని చెప్పాడు. అయితే, తన టీచర్ మాత్రం ఎంత బాగా చేశాడు, ఎంత అందంగా ఉన్నాడో అని మెచ్చుకోవడంతో, తర్వాతి నాటకాల్లో కూడా తననే అమ్మాయి పాత్రలకు ఎంపిక చేసేవారని అన్నాడు. ఎనిమిదో తరగతి వరకు తాను అమ్మాయి పాత్రలనే నిరంతరంగా పోషించాల్సి వచ్చిందని నవీన్ చెప్పాడు.
తొమ్మిదో తరగతి నుంచి..
తొమ్మిదో తరగతిలో, బొమ్మరిల్లు సిద్ధార్థ్ లాగా ఇంక చాలు, నా జీవితాన్ని నేనే నియంత్రించుకోవాలి అని నిర్ణయించుకుని, ఒక మేల్ క్యారెక్టర్ పోషించడానికి ప్రయత్నించానని, అప్పుడు తనకు ఒక బార్ టెండర్ పాత్ర ఇచ్చారని తెలిపాడు. అప్పటి నుంచి మేల్ క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టానని, స్కూల్లో నాటకాల్లో నటించేవాడినని అందరికీ తెలిసేదని అన్నాడు.
యాన్యువల్ డే అంటేనే..
యాన్యువల్ డే అంటే తాను చాలా ఆనందపడేవాడినని, నాటకాలు, డ్యాన్సులు చేయాలని ఎంతో ఉత్సాహపడేవాడినని చెప్పాడు. అక్కడే యాక్టింగ్ వైపు వెళ్లాలని పదో తరగతి తర్వాత నిర్ణయించుకున్నానని, ఆ తర్వాత స్టేజ్, థియేటర్, యూట్యూబ్, చివరికి సినిమాలోకి అడుగుపెట్టానని వివరించాడు.

