`నాట్యం` సినిమా రివ్యూ..
ఓ వైపు బాలకృష్ణ, ఎన్టీఆర్, రామ్‌చరణ్, చిరంజీవి వంటి వారి ప్రశంసలందుకున్న `నాట్యం` సినిమా నేడు థియేటర్‌లోకి వచ్చింది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
మర్చిపోతున్న నృత్య కళల ప్రాధాన్యతని నేటి తరానికి తెలియజేసేందుకు, దానిపై అవగాహన కల్పించేందుకు సినిమాని మాధ్యమంగా చేసుకుంది నాట్యకారిణి సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ `నాట్యం` సినిమాని నిర్మించింది. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం(అక్టోబర్ 22)ని విడుదలైంది. ఓ వైపు బాలకృష్ణ, ఎన్టీఆర్, రామ్‌చరణ్, చిరంజీవి వంటి వారి ప్రశంసలందుకున్న ఈ సినిమా నేడు థియేటర్‌లోకి వచ్చింది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
కథ ః
సితార(సంధ్యారాజు)కి చిన్నప్పటి నుంచి నాట్యమంటే ఇష్టం. పెద్దయ్యాక గొప్ప నృత్య కళాకారిణిగా రాణించాలనుకుంటుంది. నాట్యం కోసమే కష్టపడుతుంటుంది. ఈ క్రమంలో ఆమె కాదంబరి కథ గురించి వింటుంది. అది బాగా నచ్చడంతో దాన్ని తన నాట్య కళ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటుంది. ఇంతలో ఆమెకి రోహిత్(రోహిత్ బెహల్) పరిచయం అవుతాడు. తన డ్యాన్స్ కాంపిటీషన్ కోసం మంచి కాన్సెప్ట్ కావాలని సితార ఉండే గ్రామానికి వస్తాడు. అక్కడ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఇంతలో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న ఓ సంఘటన సితారని ఊరు నుంచి వెలివేసేలా చేస్తుంది. మరి మధ్యలో ఆగిపోయిన తన డ్రీమ్ ఫుల్ పిల్ చేసుకోవడం కోసం సితార ఏం చేసింది, ఆమెకి కమల్ కామరాజు పాత్రకి ఉన్న సంబంధం ఏంటి, చివరికి ఆమె కథ ఎలా సుఖాంతమైందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
మోడ్రన్ డాన్స్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో సంప్రదాయ కళ, అందులోనూ నృత్యం గురించి, అందులోని గొప్పతనాన్ని, మాధుర్యాన్ని ఇప్పటి జనాలకు చెప్పాలని నర్తకి సంధ్యారాజు, దర్శకుడు రేంత్ కోరుకొండ చేసిన ప్రయత్నం అభినందనీయం. అందుకే పెద్ద పెద్ద స్టార్ హీరోలు సపోర్ట్ చేయడం మంచి పరిణామం. అయితే సినిమా కూడా అదే స్థాయిలో మెప్పించి ఉంటే బాగుండేది. జనరల్‌గా డాన్స్ ప్రధాన సినిమాలంటేనే కొంత గ్యాప్ ఉంటుంది. వాటిలో మంచి డ్రామాని అంతే నాటకీయంగా, ఎమోషన్స్ ని మేళవిస్తూ చెప్పడం చాలా కష్టమైన విషయమే. కళాతపస్వి కె.విశ్వనాథ్ వంటి వారికే అది సాధ్యమైంది.
ఆ ప్రయత్నంలో సంధ్యారాజు, రేవంత్ ఫర్వాలేదనిపించుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. అయితే నృత్యం గురించి చెబుతూ అనేక అంశాలను చర్చించే క్రమంలో కథ ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. అనవసరమైన విషయాలకు ప్రయారిటీ ఇవ్వడం వల్ల కత సాఫీగా సాగలేకపోయింది. స్లో అయిపోయింది. పరుగులు పెట్టించేలా లేదు. ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్‌తో కొత్తగానే అనిపించింది. సినిమాని కొత్తగా నడిపించే విధానం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది.
మంచి కథని దర్శకుడు రేవంత్ తీసుకున్నా, దాన్ని అంతే ఆకట్టుకునేలా తెరపై ప్రజెంట్ చేయడంలో తడబడ్డాడు. స్ర్రీన్‌ప్లే విషయంలో ఆ తేడా కనిపిస్తుంది. సంధ్యారాజు, రోహిత్ మధ్య సన్నివేశాలు కూడా స్లోగా సాగుతుంటాయి. ప్రేమని ఎలివేట్ చేసే అంశాలు లేకపోవడం మైనస్. సినిమా కథలోని సంఘర్షణలో సోల్ మిస్ అయ్యింది. దీంతో అది సినిమాటిక్‌గానే మారిపోయింది. ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు లేకపోవడంతో కాస్త బోర్ ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో ఎమోషన్ అంశాలు వర్కౌట్ కాలేదు. అవసరం లేని అంశాలు జోడించడం వల్ల అవి సినిమా ల్యాగ్‌కి కారణమయ్యాయని చెప్పొచ్చు.
నటీనటుల ఫర్‌ఫెర్మెన్స్ః స్వతహాగా నర్తకి కావడం వల్ల సంధ్యారాజు ఆ పాత్రలో ఒదిగిపోయారు. సితార పాత్రకి న్యాయం చేసింది. సినిమా కథలో ప్రధాన భూమిక పోషించింది. రోహిత్ బెహల్ యాక్టింగ్ కూడా ఆకట్టుకుంటుంది. సెటిల్డ్ గా బాగా చేశాడు. కమల్ కామరాజు..హరి పాత్రలో ఒదిగిపోయాడు. ఆదిత్య మీనన్ కూడా ఫర్వాలేదనిపించాడు. తల్లి పాత్రలో భాను ప్రియా, అలాగే శుభలేఖ సుధాకర్ పాత్ర సైతం ఆకట్టుకుంటుంది.
టెక్నీకల్‌గాః
శ్రావణ్ భరద్వాజ్ సినిమాకి బ్యాక్ బోన్‌గా నిలించింది. నృత్య కళా చిత్రాలకు ఆర్‌ఆర్, సంగీతం ప్రాణం. ఆ విషయంలో శ్రవణ్ భరద్వాజ్ తన బెస్ట్ ఇచ్చాడు. సినిమాకు జీవం పోశాడు. పాటలు చాలా వరకు బాగున్నాయి. దర్శకుడు రేవంత్ ప్రయత్నం అభినందనీయం. సినిమాని చాలా వరకు బెటర్‌గా నడిపించారు. స్లోనరేషన్ అంశాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రయారిటీ ఇవ్వకపోవడం మైనస్‌గా మారాయి. ఈ విషయంలో ఎడిటింగ్ లోపాలున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉంది.
ప్లస్ పాయింట్స్ ః
సంధ్యా రాజు డాన్స్
శ్రవణ్ భరద్వాజ్ సంగీతం
ఇంటర్వెల్ సీన్
మైనస్ పాయింట్స్ :
ఎడిటింగ్
సాగదీత కథనం
స్క్రీన్ ప్లే
ఫైనల్ గాః `నాట్యం` ఓ మంచి ప్రయత్నం. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ లేక ఎంగేజ్ చేయలేకపోయిన `నాట్యం`గా మారింది.