ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో 37 ఏళ్ళ యంగ్ హీరో, పాన్ ఇండియా బయోపిక్ కి రంగం సిద్ధం
Narendra Modi Biopic : ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ "మా వందే" ను సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ ప్రకటించింది. ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ బయోపిక్ చిత్రాన్ని పాన్-ఇండియా భాషల్లో విడుదల చేయనున్నారు.

ప్రధాని పాత్రలో యంగ్ హీరో
భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ నుంచి ఓ ప్రతిష్టాత్మక బయోపిక్‌కి ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి “మా వందే” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వీర్ రెడ్డి ఎం. నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ ప్రధాని మోదీ పాత్రలో కనిపించనున్నారు.
మోదీ జీవితంలో వాస్తవ సంఘటనల ఆధారంగా..
క్రాంతి కుమార్ సి.హెచ్. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. చిన్ననాటి నుంచి సమాజం కోసం కలలు కనిన ఒక బాలుడు, దేశ ప్రధానిగా ఎదిగిన అద్భుత ప్రయాణం ఈ సినిమాలో ప్రధానంగా చూపించబడనుంది. మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని కీలక సంఘటనలు వాస్తవ ఘటనల ఆధారంగా ప్రదర్శించబడతాయి.
మోదీ బయోపిక్ తెరకెక్కించడం మా అదృష్టం
ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి ఎం. మాట్లాడుతూ – “ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితకథను మా వందే పేరుతో ప్రకటించడం మా గర్వకారణం. ఈ సినిమాలో మోదీ వ్యక్తిగత, రాజకీయ ప్రయాణంలోని ఘట్టాలను సహజంగా, నిజాయితీగా చూపించబోతున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ముఖ్యంగా మోదీ, ఆయన తల్లి హీరాబెన్ మధ్య బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపిస్తాం. దేశ సేవకే అంకితమైన మహానాయకుని జీవితాన్ని ప్రేక్షకులకు అందించడం మా అదృష్టం” అని అన్నారు.
మోదీ బయోపిక్ కి పనిచేసే టీమ్
ఈ చిత్రానికి అత్యుత్తమ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.
యాక్షన్: కింగ్ సోలమన్
ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
డీవోపీ: కె.కె. సెంటిల్ కుమార్
సంగీతం: రవి బస్రూర్ అందిస్తున్నారు.
ప్రధాన తారాగణం: ఉన్ని ముకుందన్, మరికొందరు ప్రముఖ నటులు.
బ్యానర్: సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: గాంధాధర్ ఎన్.ఎస్., వనిశ్రీ బి.
లైన్ ప్రొడ్యూసర్: టి.వి.ఎన్. రాజేష్
పీఆర్‌ఓ: జీఎస్‌కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
రచయిత & దర్శకుడు: క్రాంతి కుమార్ సి.హెచ్.
పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా..
దేశవ్యాప్తంగా పాన్-ఇండియా భాషల్లో, అదనంగా ఇంగ్లీష్‌లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. భారతీయ రాజకీయ చరిత్రలో ముద్ర వేసిన మోదీ జీవితాన్ని ప్రతిబింబించే ఈ బయోపిక్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ కావడంతో ఆయన బాల్యంలో టీ స్టాల్ లో పనిచేయడం దగ్గర నుంచి ఆ తర్వాత గుజరాత్ రాజకీయాల్లో ఎలా కీలకంగా మారారు.. ప్రధానిగా ఎలా ఎదిగారు లాంటి అంశాలు చూపించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ పాత్రలో 37 ఏళ్ళ ఉన్ని ముకుందన్ కనిపించబోతుండడంతో ఎలా నటిస్తాడో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.