- Home
- Entertainment
- నన్పకల్ నేరతు మయక్కం: మమ్ముట్టీ నుంచి మన స్టార్లు నేర్చుకోవాల్సింది ఏంటి? మెగాస్టార్ అయినా...
నన్పకల్ నేరతు మయక్కం: మమ్ముట్టీ నుంచి మన స్టార్లు నేర్చుకోవాల్సింది ఏంటి? మెగాస్టార్ అయినా...
మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్... వెండితెర నటులకు అభిమానులు తగిలించిన తోకలు ఇవి. రోజులు గడిచే కొద్దీ టాలీవుడ్‌లో స్టార్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. అయితే మలయాళంలో మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మమ్మూట్టీ మాత్రం మిగిలిన స్టార్లకు భిన్నంగా కథలను ఎంచుకుంటూ సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. మమ్మూట్టీ నుంచి మన స్టార్లు, నటులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి?

Mammootty
మమ్మూట్టీ నటించిన ‘నన్పకల్ నేరతు మయక్కం’ (తెలుగులో పగటి కల అని అర్థం) అనే సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. ఆ తర్వాత నెట్‌ఫ్లెక్స్ ద్వారా ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగువారికి కూడా డబ్బింగ్ వర్షన్ అందుబాటులో ఉంది...
మమ్మూట్టీ వంటి స్టార్ నటించాడు కాబట్టి ఇందులో ఓ అరడజను సాంగ్స్, హీరోయిన్లతో డ్యూయెట్లు, ఐటెం సాంగ్స్, ఫైట్లు, డబుల్ మీనింగ్ డైలాగులు, కామెడీ... ఇలా మాస్ ఫ్యాన్స్‌కి కావాల్సిన దినుసులన్నీ ఉన్నాయనుకుంటే పొరపాటే. ఇందులో అలాంటివేమీ ఉండవు. కథలో పెద్దగా ట్విస్టులు కూడా ఏమీ ఉండవు...
సింపుల్‌గా చెప్పాలంటే ఎక్కడో కేరళ నుంచి తమిళనాడులో ఓ చర్చిని దర్శించుకోవడానికి సకుటుంబ సపరివార సమేతంగా వచ్చిన కథానాయకుడు, ఇంటికి వెళ్లే దారిలో అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు సడెన్‌గా బస్సు దిగి ఓ ఊరిలోకి వెళ్లిపోతాడు. అక్కడికి వెళ్లగానే తమిళ్ మాట్లాడుతూ ఓ కుటుంబంలో సభ్యుడిగా నడుచుకుంటాడు... ఆ కుటుంబం కూడా ఓ అనామకుడు వచ్చి తమలో ఒకడిగా ప్రవర్తిస్తుండడం చూసి అయోమయానికి గురవుతుంది...
క్రిస్టియన్ వ్యక్తి కాస్తా గుడిలో వెళ్లి పూజలు చేస్తాడు. ఇది తెలిసిన ఆయన భార్య, భర్త వింత ప్రవర్తన చూసి కుప్పకూలిపోతుంది... అతను వచ్చిన ఇంట్లో ఉన్న భర్తను కోల్పోయిన మహిళది దాదాపు ఇదే పరిస్థితి.... తీరా తెలిసిన విషయం ఏంటంటే బతుకుతెరువు కోసం ఉన్నఊరిని వదిలి వలసవెళ్లిన ఓ వ్యక్తి, అక్కడే చనిపోతాడు. అతని శవం కూడా పుట్టిన ఊరికి రాదు. అతని ఆత్మ, సడెన్‌గా కథానాయకుడికి ఆవహించి... తాను పుట్టిన ఊరిని, కన్నవారిని, కట్టుకున్న భార్యని, తాను తిరిగిన ప్రదేశాలను, తనతో పెరిగిన చెట్లుచేమలను ఒకసారి చూసి పోతుంది... సింపుల్‌గా ఇదే కథ...
Mammootty Sleep
ఇంత చిన్న కథను ఓ పెద్ద స్టార్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మమ్మూట్టీ ప్రత్యేకత అదే. మమ్మూట్టీ ఎప్పుడూ తనను ఓ స్టార్‌గా కాకుండా ఓ నటుడిగా ఆవిష్కరించుకున్నాడు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎక్కువగా చేస్తూ వచ్చాడు. అదే ఈ సినిమాలోనూ కనిపిస్తుంది...
nanpakal nerathu mayakkam
అభిమానుల కోసం మాస్ మసాలా ఉన్న సినిమాలే చేస్తామని చెప్పే స్టార్ల మధ్యన నటన కోసం, తనలోని నటుడిని మరింత కొత్తగా ఆవిష్కరించడం కోసం, తాను నటించడం కోసం కథలను ఎంచుకునే అసలైన నటుడిగా కనిపిస్తాడు మమ్మూట్టీ. ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించకపోవచ్చు, రికార్డులు బ్రేక్ చేయకపోవచ్చు...కానీ చూసిన ప్రతీ సినీ అభిమానికి ఓ సంతృప్తిని మిగులుస్తాయి...
nanpakal nerathu mayakkam
ఓ నటుడి దాహాన్ని, ఆకలిని బతికించేది ఇదే. అందుకే ‘మెగాస్టార్’ అని బిరుదు తగిలించినా, మమ్మూట్టీ ఓ సహజ నటుడిగానే మిగిలిపోయాడు. నటుడికి అభిమానులు ఉంటారు. అభిమానులకు నచ్చేలా సినిమాలు తీయడం కోసం కొందరు రీమేక్ సినిమాలే సేఫ్ అనుకుంటున్నారు, మరికొందరు మాస్ మసాలా సినిమాలే తీస్తామంటున్నారు...
‘స్టార్’ అని జోడించినంత మాత్రాన నేలను విడిచి, ఆకాశంలో విహరించాల్సిన అవసరం లేదు. తెర మీద చూసుకున్నా, మన జీవితాలే కనిపించాలి. ఇదే మమ్మూట్టీ చేస్తోంది. తన వయసు హీరోలు, కుర్ర హీరోయిన్లకు లైన్ వేస్తున్న క్యారెక్టర్లు చేస్తుంటే.. మమ్ముట్టీ మాత్రం వయసును బట్టి కథలను ఎంచుకుంటున్నాడు. ఇక్కడ ఆయన నటనలోనే కాదు, ఆలోచనా విధానంలోనూ మెచ్యూరిటీ కనిపిస్తుంది.
ఈ సినిమాలో ఆయన ఓ టీనేజ్ యువకుడికి తండ్రిగా నటించాడు. జనాలు దాన్ని స్వీకరించారు... ఇందులో ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాలో ఎక్కడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా వినిపించదు. సందర్భాన్ని బట్టి టేప్‌రికార్డర్లలో, టీవీల్లో వచ్చే సౌండ్స్ తప్ప...
Mammootty
50, 60 ఏళ్ల వయసు వచ్చినా, 20-25 ఏళ్ల హీరోయిన్‌ని పెట్టుకుని పాటలు పాడాలి, వాళ్లతో రొమాన్స్ చేయాలి... అనే ఆలోచనలో నుంచి మన స్టార్ హీరోలు బయటికి రావడం లేదు. కూతురు, మనవరాళ్ల వయసున్న హీరోయిన్లు కనిపిస్తే రొమాన్స్ పేరుతో వెకిలి చేష్టలు చేస్తున్నారు.
nanpakal nerathu mayakkam
ఆ నటులను నిజంగా అభిమానించే వాళ్లు కూడా ఈ వయసులో తమ హీరోలు తెర మీద చేసే వెకిలి చేష్టలు చూసి బాధపడుతున్నారనేది వాస్తవం. మమ్మూట్టీని చూసి అయినా మనవాళ్లు కాస్త అయినా మారతారేమో చూడాలి.. ఓ మూడు మాస్ మసాల సినిమాల మధ్య ఇలాంటి తమలోని నటుడిని బతికించే ఓ సినిమా వస్తే టాలీవుడ్ నిజంగా బాగుపడుతుంది...