- Home
- Entertainment
- డాక్టర్ తన తమ్ముడిలా భావించి చెప్పింది, అయినా ఉదయ్ కిరణ్ వినలేదు.. మొత్తం బయట పెట్టిన మురళి మోహన్
డాక్టర్ తన తమ్ముడిలా భావించి చెప్పింది, అయినా ఉదయ్ కిరణ్ వినలేదు.. మొత్తం బయట పెట్టిన మురళి మోహన్
టాలీవుడ్ లో జరిగిన విషాదాంతాల్లో ఉదయ్ కిరణ్ జీవితం ఒకటి. ఉదయ్ కిరణ్ ని ఎప్పుడు తలచుకున్నా అభిమానుల గుండెల్లో తెలియని బాధ మొదలవుతుంది.

టాలీవుడ్ లో జరిగిన విషాదాంతాల్లో ఉదయ్ కిరణ్ జీవితం ఒకటి. ఉదయ్ కిరణ్ ని ఎప్పుడు తలచుకున్నా అభిమానుల గుండెల్లో తెలియని బాధ మొదలవుతుంది. అద్భుతమైన నటుడిగా, మంచి కుర్రాడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కానీ ఒక్కసారిగా అతడి కెరీర్ పతనం కావడం.. ఫలితంగా ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు. దీనితో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉదయ్ కిరణ్ గురించి సన్నిహితులు అనేక రకాలుగా చెబుతుంటారు. కానీ అందరూ కామన్ గా చెప్పేది ఉదయ్ కిరణ్ చాలా మంచి వ్యక్తి అని. ఉదయ్ కిరణ్ తో ఇండస్ట్రీలో క్లోజ్ గా ఉండే వారిలో సీనియర్ నటులు మురళి మోహన్ కూడా ఒకరు. ఇటీవల ఇంటర్వ్యూలో మురళి మోహన్.. ఉదయ్ కిరణ్ గురించి ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు. మురళి మోహన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఉదయ్ కిరణ్ జీవితంలో అసలేం జరిగింది అని యాంకర్ ప్రశ్నించగా.. మురళి మోహన్ మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి హైపర్ టెన్షన్ ఎక్కువ. నన్ను తరచుగా కలుస్తూ ఉండేవాడు. విపరీతమైన బీపీ తరహాలో టెన్షన్ వచ్చేస్తుంది. ఆ సమయంలో మనిషి కంట్రోల్ లో ఉండడం కూడా కష్టం. ఆ టైంలో మేమంతా మాట్లాడి ఒక డాక్టర్ దగ్గర జాయిన్ చేశాం.
ఆ డాక్టర్ ఉదయ్ కిరణ్ ని సొంత తమ్ముడిగా భావించి ట్రీట్మెంట్ మొదలు పెట్టింది. అన్ని జాగ్రత్తలు చెప్పేది. ఆవేశం తగ్గించుకోవాలి అని చెప్పేది. ఉదయ్ కిరణ్ కూడా అలాగే మేడం అని చెప్పేవాడు. కానీ ఏదైనా సంఘటన జరిగితే మాత్రం ఆవేశపడిపోయేవాడు. ఉదయ్ కిరణ్ తన ప్రాబ్లెమ్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
అంతకు ముందు ఉదయ్ కిరణ్ తరచుగా చిరంజీవిని కలిసేవాడు. చిరంజీవికి ఒక అలవాటు ఉంది. ఇండస్ట్రీలోకి ఎవరు కొత్తగా వచ్చినా, మంచి ప్రదర్శన ఇచ్చినా ఫోన్ చేసి అభినందించేవారు.. హీరో, డైరెక్టర్, కెమెరా మెన్ ఇలా అందరిని అభినందించేవారు. ఉదయ్ కిరణ్ కి కూడా ఒక రోజు ఫోన్ చేసి అభినందించాడు. సార్ మిమ్మల్ని ఒకసారి కలవాలి అని ఉదయ్ కిరణ్ అడగడం.. ఆ తర్వాత వెళ్లి కలవడం జరిగింది.
పరిచయం ఏర్పడ్డాక తరచుగా చిరుని వెళ్లి కలిసేవాడు. కొత్త కారు కొనుక్కున్నా, ఇంకేదైనా సంఘటన జరిగినా వెళ్లి చిరంజీవితో షేర్ చేసుకునేవాడు. దీనితో చిరంజీవి ఉదయ్ కిరణ్ పై మంచి అభిప్రాయం ఏర్పడింది. కుర్రాడు చాలా బుద్ధిమంతుడిగా ఉన్నాడు. ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. మన ఫ్యామిలిలో కలుపుకుంటే బావుంటుంది అని ఆశపడినట్లు ఉన్నారు.
చిరంజీవి తర్వాత ఆ ఫ్యామిలీలో అన్నీ చూసుకునేది అల్లు అరవింద్. దీనితో చిరంజీవి.. అల్లు అరవింద్ తో ఉదయ్ కిరణ్ గురించి చర్చించడం.. ఫైనల్ చేసుకుని అనౌన్స్ కూడా చేశారు. మేమంతా చాలా సంతోషించాం. ఉదయ్ కిరణ్ లాంటి మంచి కుర్రాడు.. చిరంజీవి గారి ఫ్యామిలిలో భాగం అవుతున్నాడని ఆనందపడ్డాం.
ఆ తర్వాత ఉదయ్ కిరణ్ మా ఇంటికి కూడా వచ్చాడు. ఇది నీకు చాలా మంచి మ్యాచ్.. జాగ్రత్తగా చూసుకో అని సలహా కూడా ఇచ్చా. అంతా హ్యాపీగానే ఉంది. కానీ ఏమైందో ఏమో ఆ సంబంధం అప్సెట్ అయింది. ఉదయ్ కిరణ్ కెరీర్ లో కూడా చాలా సినిమాలు సరిగా ఆడలేదు. వీటన్నింటి వల్ల హైపర్ టెన్షన్ ఆల్రెడీ ఉండడంతో.. ఆ విషాదకర నిర్ణయం తీసుకున్నాడేమో. నా ఫ్యామిలీ మెంబర్ ని కోల్పోయినంత బాధ కలిగింది అని మురళి మోహన్ అన్నారు.