- Home
- Entertainment
- నాగార్జున సూపర్ హిట్ సాంగ్ ని వెటకారం చేసిన చిరంజీవి..అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా ?
నాగార్జున సూపర్ హిట్ సాంగ్ ని వెటకారం చేసిన చిరంజీవి..అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా ?
చిరంజీవి వెటకారం చేసిన ఒక పాట నాగార్జున సినిమాలో సూపర్ హిట్ అయింది. చిరంజీవి సినిమా విషయంలో జరిగిన వివాదాలని ఓ సంగీత దర్శకుడు బయటపెట్టారు. ఇంతకీ ఆ పాట ఏంటి ? ఆ సంగీత దర్శకుడు ఎవరు ? అనే వివరాలు ఈ కథనంలో చూద్దాం.

పాటలతోనే సినిమాకి పబ్లిసిటీ
తెలుగు సినిమాల్లో పాటలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పాటలు లేని సినిమాని తెలుగు ప్రేక్షకులు ఊహించుకోలేరు. ఇప్పుడంటే కొన్ని సినిమాలని పాటలు లేకుండా కేవలం కథా బలంతోనే తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు అలా కాదు. తప్పనిసరిగా అదిరిపోయే సాంగ్స్ ఉండాల్సిందే. పాటలతోనే అప్పట్లో సినిమాలకు పబ్లిసిటీ వచ్చేది. అందుకే హీరోలు, దర్శకులు తమ చిత్రాల్లో పాటలపై ప్రత్యేక శ్రద్ద పెట్టేవారు.
చిరంజీవిపై మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి.. మెగాస్టార్ చిరంజీవి నటించిన అనేక చిత్రాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, ముఠామేస్త్రి, కొదమ సింహం లాంటి చిత్రాలకు రాజ్ కోటి ద్వయం సంగీతం అందించారు. కోటి సోలోగా హిట్లర్ చిత్రానికి మ్యూజిక్ చేశారు. సంగీత దర్శకుడు కోటి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి సినిమాల విషయంలో జరిగిన వివాదాలని బయటపెట్టారు. రాజా విక్రమార్క, కొదమసింహం చిత్రాల షూటింగ్ ఒకే టైం లో జరుగుతోంది. ఆ రెండు చిత్రాలని మేమే సంగీత దర్శకులం.
ఈ పాట దర్శకుడికి నచ్చలేదు
రాజా విక్రమార్క చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకుడు. ఆయనకి ఒక ట్యూన్ వినిపించాం. స్టార్ స్టార్ మెగాస్టార్ అనే పాట ట్యూన్ ని ఆయనకి వినిపిస్తే నచ్చలేదు. సరే తర్వాత చూద్దాం లే అని అన్నారు. ఆయనకి ఈ పాటపై ఆసక్తి లేదని మాకు అర్థం అయింది. కొదమసింహం మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగినప్పుడు దర్శకుడు మురళి మోహన్ రావు కి ఇదే పాటని వినిపించాం. ఆ చిత్ర నిర్మాత, లెజెండ్రీ నటుడు కైకాల సత్యనారాయణ కూడా అక్కడే ఉన్నారు. ఆయన సాంగ్ అద్భుతంగా ఉంది అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ తో గొడవకి దిగిన దర్శకుడు
దీని రాజా విక్రమార్క కోసం కంపోజ్ చేసిన పాటని కొదమసింహం కోసం వాడేశాం. ఈ విషయం రాజా విక్రమార్క దర్శకుడు రవిరాజా పినిశెట్టికి తెలిసింది. ఆయన మమ్మల్ని పిలిపించి ఇష్టం వచ్చినట్లు తిట్టారు. మా మధ్య పెద్ద గొడవ జరిగింది. నాకు చెప్పిన పాటని మరో సినిమాలో ఎలా వాడతారు అని ప్రశ్నించారు. సార్ మీరు రిజెక్ట్ చేసిన తర్వాతే ఆ పాటని కొదమసింహంలో పెట్టాలని డిసైడ్ అయ్యాం అని చెప్పాం. నేను రిజెక్ట్ చేయలేదు. తర్వాత చూద్దాం అని వాగ్వాదానికి దిగారు. దీనితో చిరంజీవి ఇన్వాల్వ్ కావలసి వచ్చింది. చిరంజీవి ఇన్వాల్వ్ అయి.. ఆ పాటని కూడా నా సినిమాకే కదా వాడారు అని కూల్ చేశారు.
నాగార్జున పాటని వెటకారం చేసిన చిరంజీవి
మరో ఆసక్తికర సంఘటన ముఠామేస్త్రి చిత్రంలో జరిగింది. ఆ మూవీ కోసం చిరంజీవి గారికి 'అందమా అందమా' అనే సాంగ్ ని వినిపించాం. అది రోజా, చిరంజీవి మధ్య రొమాంటిక్ సాంగ్. కానీ చిరంజీవికి ఆ పాట నచ్చలేదు. ఏంటి ఈ పాట.. హీరోయిన్ తో రొమాంటిక్ సాంగ్ ని చిన్న పిల్లల కోసం పాడే పాటలా తయారు చేశారు అని వెటకారం చేశారు. ఆ పాట వద్దని చెప్పారు. ఆ తర్వాత ఎంత ఘాటు ప్రేమయో అనే సాంగ్ ని కంపోజ్ చేస్తే అది చిరంజీవి గారికి నచ్చింది. అందమా అందమా సాంగ్ అలాగే ఉంది కదా.. అదే సమయంలో రాంగోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో గోవిందా గోవిందా అనే మూవీ షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమాలో ఈ పాటని పెట్టాం. చిరంజీవి వెటకారం చేసిన సాంగ్ సూపర్ హిట్ అయింది అని కోటి తెలిపారు.

