రేవంత్ రెడ్డితో మీటింగ్ :దిల్ రాజు ఆహ్వానించినా హాజరుకాని చిరంజీవి, ఎందుకంటే.. షాకింగ్ ట్విస్ట్
పలువురు సినీ ప్రముఖులు నేడు రేవంత్ రెడ్డిని కమాండ్ కంట్రోల్ లో భేటీ అవుతున్నారు. దిల్ రాజు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం జరుగుతోంది.
సంధ్య థియేటర్ సంఘటన, అల్లు అర్జున్ పై కేసులు ఇలా పలు వివాదాలతో చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఇకపై ప్రత్యేక షోలు, టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి సంచలనాల నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలసి రాజీ కుదుర్చుకునేందుకు చిత్ర పరిశ్రమ సిద్ధం అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.
పలువురు సినీ ప్రముఖులు నేడు రేవంత్ రెడ్డిని కమాండ్ కంట్రోల్ లో భేటీ అవుతున్నారు. దిల్ రాజు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కె ఎల్ నారాయణ, హారిక అండ్ హాసిని చినబాబు, నాగవంశీ, రాఘవేంద్ర రావు, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, బలగం వేణు, నితిన్ తో పాటు మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి హాజరు కాకపోవడం షాకింగ్ గా మారింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో చిత్ర పరిశ్రమకి సమస్యలు వచ్చినప్పుడు చిరంజీవి ముందుండి పరిష్కరించారు. ఇప్పుడు కూడా చిరంజీవి రంగంలోకి దిగి అల్లు అర్జున్ వివాదం, సంధ్య థియేటర్ ఘటన, టికెట్ ధరలు ఇలాంటి విషయాలని ప్రభుత్వంలో చర్చించి పరిష్కరిస్తారు అని అంతా భావించారు. కానీ చిరు ఊహించని షాక్ ఇచ్చారు.
అసలు చిరంజీవి సినీ ప్రముఖులతో కలసి రేవంత్ రెడ్డి సమావేశానికి హాజరు కావడం లేదు. దిల్ రాజు స్వయంగా చిరంజీవిని ఈ సమావేశానికి ఆహ్వానించారట. కానీ తాను చెన్నైలో షూటింగ్ లో ఉండడంతో రాలేనని చెప్పారట. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీని దిల్ రాజు అన్నీ తానై ముందుండి చూసుకుంటున్నారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజుని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.
అయితే చిరంజీవి హాజరు కాకపోవడంపై చెన్నైలో ఉండడం మాత్రమే కారణం కాదని అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి. వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు చిరంజీవి తన నేతృత్వంలో మహేష్, ప్రభాస్ ఇతర సినీ ప్రముఖుల్ని జగన్ వద్దకి తీసుకెళ్లారు. అప్పుడు చిరంజీవి చేతులు జోడించి జగన్ ని వేడుకున్న దృశ్యాలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపాయి. ఈ సంఘటనని పవన్ కళ్యాణ్ సైతం పలుమార్లు ప్రస్తావించారు.
చిన్న విషయాల కోసం చిరంజీవి స్వయంగా ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లడం అభిమానులకు కూడా నచ్చలేదు అనే అభిప్రాయం ఉంది. అప్పట్లో ట్రోలింగ్ కూడా జరిగింది. రేవంత్ రెడ్డితో సమావేశానికి హాజరు కాకపోవడానికి ఇది కూడా కారణం అయి ఉండొచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికి తోడు కొన్ని రాజకీయ కారణాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ కి దూరంగా.. బీజేపీకి దగ్గరగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.