చరిత్రలో ఎప్పుడూ ఇలా లేదు.. పూనకాలు తెప్పించేలా చిరంజీవి చిత్రాల లైనప్
ట్రెండుకి తగ్గట్లుగా సినిమాలు చేస్తున్న కుర్ర దర్శకులతో చిరు చేతులు కలుపుతున్నారు. చిరంజీవి తదుపరి చిత్రాల లైనప్ చూస్తే.. మెగాస్టార్ విషయంలో విషయంలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదే అని అనిపిస్తుంది.

సీనియర్ హీరోల్లో బాలయ్య, వెంకటేష్ దూసుకుపోతున్నారు. చిరంజీవి, నాగార్జున మాత్రం రేసులో కాస్త వెనుకబడ్డ మాట వాస్తవం. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక బాక్సాఫీస్ వసూళ్ల విషయంలో తన సత్తా చాటుకున్నారు. ఖైదీ, వాల్తేరు వీరయ్య చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టి చిరంజీవి ఇమేజ్ చెక్కు చెదరలేదని నిరూపించాయి.
కానీ ఎక్కడో తప్పు జరుగుతోంది. తన డ్రీమ్ ప్రాజెక్టు సైరా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. గాడ్ ఫాదర్ చిత్రంతో చిరు అదరగొట్టినప్పటికీ రీమేక్ కావడంతో బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. ఇక ఆచార్య, భోళా శంకర్ చిత్రాలని వీలైనంత త్వరగా మరచిపోతే బెటర్. కథల ఎంపికలో చిరంజీవి జడ్జిమెంట్ ఏమైంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీనియర్ దర్శకుల వల్ల కూడా సమస్య ఉందని మెగాస్టార్ గుర్తించారు.
ఇప్పటి ట్రెండుకి తగ్గట్లుగా సినిమాలు చేస్తున్న కుర్ర దర్శకులతో చిరు చేతులు కలుపుతున్నారు. చిరంజీవి తదుపరి చిత్రాల లైనప్ చూస్తే.. మెగాస్టార్ విషయంలో విషయంలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదే అని అనిపిస్తుంది. వరుసపెట్టి చిరు కుర్ర దర్శకుల చిత్రాలకు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి, బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
విశ్వంభర తర్వాత చిరు.. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కంప్లీట్ వైల్డ్ యాక్షన్ చిత్రంలో నటించబోతున్నారు. అదే విధంగా పరాజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిత్రం ఖరారైంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ ఇచ్చిన బాబీతో చిరంజీవి మరో చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే రెండు మూడేళ్లు చిరంజీవి కుర్ర దర్శకుల చిత్రాలతో బిజీ కాబోతున్నారు. మెగాస్టార్ నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.