రజనీకాంత్ గారే ఆదుకోవాలి, సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నా.. జైలర్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి త్వరలో రాబోతున్న చిత్రం 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా ఈ చిత్రంలో సూపర్ స్టార్ కి జోడిగా నటిస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి త్వరలో రాబోతున్న చిత్రం 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా ఈ చిత్రంలో సూపర్ స్టార్ కి జోడిగా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన 'కావాలి' అనే సాంగ్ యూట్యూబ్ లో పెను సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా తమన్నా స్టెప్పులపై నెటిజన్లు, సెలెబ్రిటీలు రీల్స్ చేస్తున్నారు. అంతగా జనాలకు ఈ సాంగ్ నచ్చేసింది.
అయితే జైలర్ మూవీ విషయంలో ఒక వివాదం కోనసాగుతోంది. మలయాళంలో ఇదే టైటిల్ తో దర్శకుడు సిక్కిర్ మడతిల్ ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా రజనీ జైలర్ విడుదలవుతున్న ఆగష్టు 10నే రిలీజ్ కానుంది. దీనితో టైటిల్ వివాదం చెలరేగింది. రజనీకాంత్ చిత్రం అదే టైటిల్ తో రిలీజ్ అయితే నష్టపోయేది తమ చిత్రమే అని దర్శకుడు సిక్కిర్ మడతిల్ వాపోతున్నాడు. మలయాళం వెర్షన్ కి అయినా టైటిల్ మార్చాలని ఇదివరకే సన్ పిక్చర్స్ సంస్థని రిక్వస్ట్ చేశారు.
కానీ అందుకు జైలర్ నిర్మాతలు అంగీకరించలేదు. దర్శకుడు సిక్కిర్ మడతిల్ కోర్టుకి వెళ్లినా ఫలితం లేకపోయింది. దీనితో జైలర్ చిత్రంపైనే తన జీవితం ఆధారపడి ఉందని సిక్కిర్ గగ్గోలు పెడుతూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మలయాళీ జైలర్ లో ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సిక్కిర్ దర్శకుడు మాత్రమే కాదు నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నారు. తాజాగా సిక్కిర్ 'జైలర్' టైటిల్ వివాదం గురించి మాట్లాడుతూ తాను ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సమస్యలతో ఉన్నట్లు తెలిపాడు.
ఆర్థిక సమస్యల కారణంగా జైలర్ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. దీనితో తన ఇంటికి, కుమార్తె బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ ఈ చిత్రానికి ఇన్వెస్ట్ చేసినట్లు సిక్కిర్ మడతిల్ తెలిపారు. కారు కూడా లోన్ లో కొనుక్కున్నాను. చాలా మంది దగ్గర అప్పు చేశాను. ఈ ఆర్థిక సమస్యలు భరించలేక సూసైడ్ కూడా చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు నా జీవితం, నా ఫ్యామిలీ భవిష్యత్తు మొత్తం జైలర్ మూవీపైనే ఆధారపడి ఉంది. రెండు చిత్రాల టైటిల్ ఒకే విధంగా ఉండడం వల్ల నా మూవీ నష్టపోయే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ గారు ఒక్కరే నన్ను ఆదుకోగలరు. ఆయన గొప్ప నటుడే కాదు మంచి మనిషి. టైటిల్ వివాదంపై ఆయనే పరిష్కారం చూపాలి అంటూ సిక్కిర్ మడతిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక సూపర్ స్టార్ రజని జైలర్ లో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ , రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రిలీజ్ కి రెండు వారాల సమయం మాత్రమే ఉంది. తాము ప్రస్తుతం రజనీకాంత్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు సిక్కిర్ తెలిపారు.