- Home
- Entertainment
- ఇండస్ట్రీ పెద్ద ఆయనే.. తేల్చేసిన ప్రభాస్, మహేష్, రాజమౌళి, పేర్నినాని.. కానీ చిరుపై ఈ ట్రోల్స్ ఏంటీ?
ఇండస్ట్రీ పెద్ద ఆయనే.. తేల్చేసిన ప్రభాస్, మహేష్, రాజమౌళి, పేర్నినాని.. కానీ చిరుపై ఈ ట్రోల్స్ ఏంటీ?
చిరంజీవి బృందంలోని అందరు మీడియాని అడ్రస్ చేస్తూ అందులో జరిగిన విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా అందరు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. చిరంజీవి ఆరు నెలలుగా ఈ విషయంపై కృషి చేస్తున్నారని, ఆయన వల్లే ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేశారు.

టాలీవుడ్‌లో.. ఇండస్ట్రీ పెద్ద ఎవరనేది గత కొంత కాలంగా చర్చ జరుగుతుంది. దాసరి చనిపోయిన తర్వాత ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది. చిరంజీవిని అంతా పెద్ద దిక్కుగా, ఇండస్ట్రీ పెద్దగా పిలుచుకుంటారు. కానీ మెగాస్టార్ మాత్రం తాను పెద్దగా ఉండని, ఇండస్ట్రీ బిడ్డగా ఉంటానని తెలిపారు. `మా` ఎన్నికల సమయంలో ఆయనకు జరిగిన అవమానం, ఆయనపై మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు, `మా` మాజీ అధ్యక్షులు నరేష్ వంటి వారు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం నేపథ్యంలో చిరంజీవి హర్ట్ అయినట్టు తెలుస్తుంది. అందుకే ఓ కార్యక్రమంలో ఆయన తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండబోనని తెలిపారు.
అయితే ఏపీలో థియేటర్ల సమస్య, టికెట్ల రేట్ల వివాదంకి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో మాట్లాడేందుకు సరైన నాయకత్వం లేదనే విమర్శలు వచ్చాయి. ఒకటి రెండు సార్లు చిరంజీవి, నాగార్జున సీఎం జగన్‌ని కలిసి ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. కానీ అప్పటికీ టికెట్ల రేట్ల ఇష్యూ తెరపైకి రాలేదు. ఆ సమస్య వచ్చాక పలు మార్లు సినిమా ఈవెంట్లలో చిరంజీవి సీఎం జగన్‌ని రిక్వెస్ట్ చేశారు. ఇండస్ట్రీపై పెద్ద మనసుతో ఆలోచించాలని తెలిపారు.
కానీ ఎలాంటి పరిష్కారం లభించలేదు, పైగా వివాదం మరింత పెద్దదైంది. టికెట్ రేట్లపై హీరోలు, నిర్మాతలు విమర్శలు చేయడంతో అటు ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు, ఇతర వైసీపీ నాయకులు సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ వివాదం పీక్‌లోకి వెళ్తున్న సమయంలోనే చిరంజీవికి సీఎం జగన్ నుంచి ఫోన్ రావడం, ఆ తర్వాత గురువారం చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల, ఆర్ నారాయణ మూర్తి, పోసాని, అలీ వంటి వారు వెళ్లడం జరిగింది. దీనిపై సానుకూలమైన ఫలితాలు రానున్నాయని, త్వరలోనే జీవో వస్తుందని, టికెట్ల రేట్ల సమస్య కూడా పరిష్కారం జరిగినట్టే అని నిన్నటి మీటింగ్ సారంశం చెబుతుంది.
అయితే అనంతరం చిరంజీవి బృందంలోని అందరు మీడియాని అడ్రస్ చేస్తూ అందులో జరిగిన విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా అందరు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. చిరంజీవి ఆరు నెలలుగా ఈ విషయంపై కృషి చేస్తున్నారని, ఆయన వల్లే ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేశారు. మొదట చిరంజీవి మాట్లాడిన తర్వాత మహేష్‌బాబు, రాజమౌళి, ప్రభాస్, అలాగే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సైతం ఈ విషయాన్ని వెల్లడించారు.
మహేష్‌బాబు మాట్లాడుతూ, మొదట చిరంజీవి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా అందరి తరఫున ఆయన మాట్లాడారు. మా అందరికి దారి చూపించినందుకు థ్యాంక్యూ చిరంజీవి సర్` అని పేర్కొన్నారు. రాజమౌళి చెబుతూ, సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద దిక్కుఅనే విషయాన్ని స్పష్టం చేశారు. చిరంజీవి గారికి పెద్ద అంటే ఇష్టం ఉండదు. కానీ అతని చర్యలతో ఇండస్ట్రీ పెద్ద ఆయనే అని చాటి చెప్పారు.. సీఎంతో చిరుకు ఉన్న సాన్నిహిత్యాన్ని వినియోగించి ఇంత పెద్ద సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేశారు. కొన్ని నెలలుగా అసలు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటన్న సందిగ్ధత నడుమ చిరంజీవి గారు ఇంత పెద్ద సమస్యను పరిష్కారం దిశగా తీసుకువెళుతున్నందుకు ధన్యవాదాలు` అని తెలిపారు రాజమౌళి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చెబుతూ, `చిరంజీవికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఏడెనిమిది నెలల నుంచి మేమంతా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. చిరంజీవిగారు వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లారు. బాధ్యత తీసుకున్నారు` అని తెలిపారు. ఆర్ నారాయణ మూర్తి సైతం `మీరు గ్రేట్ వర్క్ చేశారు. మీరు ఇండస్ట్రీలో పెద్ద స్టార్, మీకున్న ఇమేజ్‌తో ఇటు జగన్‌ని, అటు కేసీఆర్‌ని కలవడం, మన సమస్యలను చెప్పడం, వారు స్పందించి మనల్ని పిలవడం` అంటూ చిరుని ఆకాశానికి ఎత్తేశారు. మరోవైపు మంత్రి పేర్నినాని సైతం ఎన్ని విమర్శలు వచ్చినా, ఈ సమస్యని పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషించిన చిరంజీవిని అభినందిస్తున్నా అని తెలిపారు.
ఇలా అందరు చెప్పింది ఒక్కటే చిరంజీవి ఈ సమస్యని పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషించారని, పెద్ద దిక్కుగా వ్యవహరించారని. ఆరేడు నెలలుగా దీనిపై ఆయన కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి సంబంధించి తను బాధ్యత తీసుకుని ముందుకు సాగారని, మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేశారని అనడంతో ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి అనే విషయం తేలిపోయిందని అంతా అనుకునే సమయంలో ఇప్పుడు చిరంజీవి ట్రోల్స్ కి గురవడం అందరిని షాక్ కి గురి చేస్తుంది.
సీఎం జగన్‌తో మీటింగ్ సమయంలో చిరంజీవి మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో ఆయన జగన్‌ని ఓ తల్లిగా పోల్చుతూ సమస్యలు పరిష్కరించాలని, తమ కోరికలను నెరవేర్చాలని వేడుకుంటున్నామని చిరంజీవి రెండు చేతులు జోడించి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. నాలుగు దశబ్దాలు సినిమా రంగంలో ఉండి, ఇండస్ట్రీకి ఓ పెద్దలా ఉండి, ఓ రాజకీయ నాయకుడిగానూ ఉండి, ఇలా సీఎం ముందు చేతులు జోడించడంపై సర్వత్రా అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. రామ్‌గోపాల్ వర్మ సైతం `బెగ్గింగ్` అంటూ కామెంట్ చేయడం, పవన్ అభిమానులు సైతం చిరు దిగజారేలా వ్యవహరించారని కామెంట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు.