చంద్రబాబు అరెస్ట్ మీకు తెలియకుండానే జరిగిందా.. ప్రధాని మోడీకి చిరంజీవి నిర్మాత ఘాటైన లేఖ
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలపై యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. దీనితో తెలుగుదేశం పార్టీ నేతలు, మద్దతు దారులు అడుగడుగునా ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలపై యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. దీనితో తెలుగుదేశం పార్టీ నేతలు, మద్దతు దారులు అడుగడుగునా ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ చేసిన పొత్తు ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార పార్టీ విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.
సిఐడి అధికారులు చంద్రబాబుని స్కిల్ డెవెలెప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష్యతోనే జరిగింది అంటూ ఆయన మద్దతు దారులు అంటున్నారు. చిత్ర పరిశ్రమ నుంచి కూడా బాబుకి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు లాంటి వారు చంద్రబాబు అరెస్ట్ ని తీవ్రంగా ఖండించారు. తాజాగా ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు చంద్రబాబు అరెస్ట్ పై ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ ఘాటైన వ్యాఖ్యలతో లేఖ రాశారు. కేఎస్ రామారావు మోడీకి రాసిన లేఖలో.. మీకు తెలియకుండానే జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయించారా అంటూ ఘాటుగా ప్రశ్నించడం ఆసక్తిగా మారింది.
'మీరు జీ 20 సదస్సులో హడావిడిగా ఉన్నప్పుడు, జగన్ లండన్ కి వెళ్ళాక ఈ అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో స్కాములు, రాజకీయ కక్ష్యలు, శాంతి భద్రత విఘాతం అక్రమ కేసులు, అవినీతి విచ్చల విడిగా పెరిగిపోయింది. ఇవన్నీ చూసి నా హృదయం రగిలిపోతోంది. ఈ రాష్ట్ర, దేశ పౌరుడిగా మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబుపై నిరాధారమైన ఆరోపణలతో కేసులు పెట్టి అరెస్ట్ చేశారు.
రాజధాని కూడా లేని రాష్ట్రానికి చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ప్రారంభోత్సవానికి మీరు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణలతో 16 నెలలు జైల్లో ఉన్న జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగన్ ఆ రాజధాని ఉండకూడదు అంటూ కుట్రలు చేస్తున్నారు. ప్రజావేదికలు కూల్చుతూ విధ్వంసాలకు పాల్పడుతున్నారు.
మీ చేతులపై శంకుస్థాపన జరిగిన అమరావతి రాజధాని విషయంలో జగన్ వైఖరి పట్ల మీరు హెచ్చరించి ఉండాల్సింది. ఐటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు వల్లే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగులు మంచి జీతాలతో జీవిస్తున్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగులే రోడ్లపైకి వచ్చి చంద్రబాబు అరెస్ట్ పై నిరసన తెలుపుతున్నారు. దీనిని మీరు ప్రధానమంత్రిగా గమనించండి.
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేధిస్తున్నారు. నేషనల్ ఫ్రంట్ కి ఎన్టీఆర్ చైర్మన్ గా ఉన్నప్పుడు బిజెపి అధికారంలోకి రావడంలో చంద్రబాబు కృషి ఎంతైనా ఉంది. ఇప్పటికైనా మీరు చంద్రబాబుని జైలు నుంచి విడుదల చేయించాలి. అలాగే తక్షణమే మీకున్న అధికారాలతో జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయండి. ఎన్నికలు జరిగేవరకు రాష్ట్రపతి పాలన విధించండి అంటూ కేఎస్ రామారావు సంచలన వ్యాఖ్యలతో మోడీకి లేఖ రాశారు. కేఎస్ రామారావు మెగాస్టార్ చిరంజీవితో ఛాలెంజ్, అభిలాష, మరణమృదంగం, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్, రాక్షసుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించారు.