- Home
- Entertainment
- 1000 కోట్ల కల కష్టమే, భారీగా పడిపోయిన కాంతార చాప్టర్ 1 కలెక్షన్లు, ఇప్పటి వరకూ ఎంత వసూలు చేసిందంటే?
1000 కోట్ల కల కష్టమే, భారీగా పడిపోయిన కాంతార చాప్టర్ 1 కలెక్షన్లు, ఇప్పటి వరకూ ఎంత వసూలు చేసిందంటే?
కాంతార చాప్టర్ 1 కలెక్షన్లలో భారీ కుదుపు, రిషబ్ శెట్టి 1000 కోట్ల కలెక్షన్ల కలలకు గండిపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈమూవీ ఇప్పటి వరకూ ఎంత కలెక్ట్ చేసింది.

కాంతార చాప్టర్ 1 కలెక్షన్లలో భారీ పతనం!
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ , డైరెక్ట్ చేసిన సినిమా 'కాంతార చాప్టర్ 1'(Kantara Chapter 1). ఈసినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తో కొనసాగుతోంది. కానీ ఆశ్చర్యంగా సోమవారం కలెక్షన్లలో పెద్ద కుదుపును చూసింది కాంతార 1. మొదటిసారిగా ఈసినిమా కలెక్షన్లలో పతనం స్టార్ట్ అయ్యింది. అయినా కూడా ఈ సినిమా 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఎన్నో పాత రికార్డులను కాంతార-1 బద్దలు కొట్టింది.
కన్నడ పరిశ్రమకు గుర్తింపు తెచ్చిన సినిమా
2022లో విడుదలైన 'కాంతార' సినిమాను భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సినిమా లవర్స్ ఆదరించారు. ఏమాత్రం హడావిడి లేకుండా సైలెంట్ గా వచ్చిన ఈసినిమా, ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. రిషబ్ శెట్టి రాసి, దర్శకత్వం వహించి, ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, కేజీఎఫ్ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమకు భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. టాలీవుడ్ తరువాత కన్నడ ఇండస్ట్రీకి అంతలా గుర్తింపు రావడానికి కెజియఫ్ తో పాటు, కాంతార సినిమా కూడా కారణం.
కాంతార చాప్టర్ 1 పై భారీ అంచనాలు
కాంతార క్రియేట్ చేసిన వేవ్ తో కాంతార చాప్టర్ 1 పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కాంతారకు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ సినిమాగా తెరకెక్కడంతో 'కాంతార చాప్టర్ 1' ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. చాలా వరకు ప్రేక్షకుల అంచనాలను నిలబెట్టుకోవడంతో, బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను అందుకుంది మూవీ. ఇప్పుడు రెండో వారం ముగుస్తున్నా, మంచి ప్రదర్శనను కొనసాగిస్తోంది. తాజాగా కాంతార చాప్టర్ 1 సినిమా 12 రోజుల కలెక్షన్లకు సబంధించిన నివేదిక బయటకు వచ్చింది.
బాక్సాఫీస్ దగ్గర కాంతార1 కలెక్షన్ల పతనం
బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తున్నప్పటికీ, రిలీజ్ అయిన తరువాత రోజు రోజకు కలెక్షన్ల మోత మోగించిన కాంతార 1 సినిమా.. మొదటిసారిగా సోమవారం కలెక్షన్లలో అతి పెద్ద పతనాన్ని చూసింది. సోమవారం కలెక్షన్లలో 64 శాతం తగ్గుదల కనిపించింది. ఆదివారం ఇండియా నుండి 39.75 కోట్ల నెట్ కలెక్షన్ చేసిన సినిమా, సోమవారం కేవలం 13.50 కోట్లకు పడిపోయింది. అయితే సెకండ్ వీకెండ్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపించింది ఈమూవీ. ఇప్పటికే ఇండియా నుంచి 500 కోట్ల గ్రాస్‌ను దాటింది. ఇండియాలో 542 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన కాంతార చాప్టర్ 1 సినిమా 451.90 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.ఇక ఓవర్ సిస్ విషయానికి వస్తే.. ఉత్తర అమెరికా మార్కెట్లో మంచి ప్రదర్శన కారణంగా, విదేశాల నుండి 11 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసింది మూవీ.
ప్రపంచవ్యాప్తంగా కాంతార1 కలెక్షన్లు ఎంత?
కాంతార చాప్టర్ 1 మూవీ సెకండ్ వీకెండ్ మంచి కలెక్షన్స్ ను సాధించింది. వీకెండ్ 146 కోట్లతో కలిపి, 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 655 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ నుంచి సమాచారం. 12 రోజుల్లో ఇది 675 కోట్ల సమీపానికి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 750 నుంచి 800 కోట్ల వరకూ కలెక్ట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ఛావా సినిమా రికార్డును బ్రేక్ చేస్తుందా?
హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, 'కాంతార' ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్-టైమ్ టాప్ 20 కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో చేరింది. సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' (628 కోట్లు), 'బాహుబలి 1' (650 కోట్లు) సినిమాలను అధిగమించి 'కాంతార చాప్టర్ 1' ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ 'ఛావా' (808 కోట్లు) ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం, కాంతార చాప్టర్ 1 మూవీ ఛావా రికార్డును బ్రేక్ చేసే అవకాశం లేకపోలేదు. మరి ఓవర్ ఆల్ గా ఈ సినిమా కలెక్షన్లు ఎంత వరకూ వెళ్తాయో చూడాలి.