- Home
- Entertainment
- ఎన్టీఆర్‌ని ప్రత్యేకంగా సత్కరించిన కన్నడ సీఎం.. సినీ, రాజకీయంగా హాట్ టాపిక్.. కారణమిదేనా?
ఎన్టీఆర్‌ని ప్రత్యేకంగా సత్కరించిన కన్నడ సీఎం.. సినీ, రాజకీయంగా హాట్ టాపిక్.. కారణమిదేనా?
ఎన్టీఆర్ మంగళవారం జరిగిన కన్నడ రాష్ట్ర రాజ్యోత్సవంలో అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ఆయన వేదిక పంచుకున్నారు. అక్కడ వారికి దక్కిన సత్కారం ఇప్పుడు సినీ, రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కన్నడ రాష్ట్ర రాజ్యోత్సవం వేడుకలో కన్నడ పవర్‌స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ కి కన్నడ రత్న బిరుదుని ప్రధానోత్సవం చేసింది కన్నడ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), ఎన్టీఆర్(Ntr)లను గెస్ట్ లుగా ఆహ్వానించారు. వీరిద్దరి చేతుల మీదుగా పునీత్ రాజ్‌కుమార్(Punit Rajkumar) భార్యకి కన్నడ రత్న బిరుదుని ప్రధానం చేశారు.
హైదరాబాద్ నుంచి స్పెషల్ జెట్‌లో బెంగుళూరు వెళ్లిన ఎన్టీఆర్‌కి, అలాగే రజనీకాంత్‌లకు కన్నడ రాష్ట ప్రభుత్వ అధికారులు, పునీత్ ఫ్యామిలీ గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పింది. కన్నడ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ రాజ్యోత్సవ వేడుకలో ఎన్టీఆర్, రజనీకాంత్ వేదికని పంచుకున్నారు. ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే వేదికపై ఉండటంతో అభిమానుల ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అదొక కనువిందు కలిగించే అంశంగా చెప్పొచ్చు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ పునీత్‌ని ఉద్దేశించి కన్నడ భాషలో మాట్లాడటం ఆకట్టుకుంది. కన్నడ ప్రజలను దోచుకుంది. మరోవైపు రజనీకాంత్ సైతం కన్నడలోనే మాట్లాడారు. అక్కడ అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. అప్పు స్నేహితుడిగా తాను ఇక్కడికి వచ్చానని. ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు అన్నారు. అప్పు కుటుంబ తనను తమ కుటుంబ సభ్యుడిగా చూస్తారన్నారు. అప్పు ఒక స్టార్ హీరో మాత్రమే కాదు.. ఒక మంచి భర్త, కొడుకు, తండ్రి.. మంచి స్నేహితుడు.. అన్నింటికీ మించి మానవత్వం కలిగిన మంచి మనిషి అంటూ అప్పుపై తన ప్రేమను చాటుకున్నారు తారక్.
ఈ సందర్భంగా కన్నడ సీఎం బసవరాజు బొమ్మై ఎన్టీఆర్‌ని ప్రత్యేకంగా సత్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమ నివాసంలో ఎన్టీఆర్‌కి స్వాగతం పలికిన సీఎం ఆయన్ని శాలువ, పూల మాలతో సత్కరించారు. ప్రస్తుతం ఈ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్, రజనీకాంత్‌లను అతిథులుగా ఆహ్వానించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతుంది.
ఆ మధ్య కేంద్ర హోంమంత్రి బీజేపీ చీఫ్ అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్టీఆర్‌ని ప్రత్యేకంగా కలిశారు. చాలా సేపు వీరిద్దరు చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు సంబంధించిన అలాగే సినిమాలకు సంబంధించి వీరి మధ్య చర్చ జరిగిందని వార్తలు బయటకు వచ్చాయి. ఇందులో నిజనిజాల విషయంలో క్లారిటీ లేదు.
మరోవైపు ఇటీవల తెలుగు రాష్ట్రాల నుంచి రైటర్ విజయేంద్ర ప్రసాద్‌కి, అలాగే తమిళనాట నుంచి ఇళయరాజాకి బీజేపీ రాజ్యసభ పదవులు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి రాజకీయంగా పట్టు దొరక్కపోతున్న నేపథ్యంలో సినిమా దిగ్గజాలకు ఎంపీ పదవులు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న కన్నడ ప్రభుత్వం ఎన్టీఆర్‌ని గెస్ట్ గా ఆహ్వానించడం మరింత చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం బీజేపీకి అనుకూలంగా ఉంటారు. ఆయన మాటలు, ప్రవర్తన సైతం బీజేపీ భావాలకు దగ్గరగా ఉంటాయి. మోడీ వంటి వారిపై రజనీ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని తమ పార్టీకి దగ్గర చేసుకునే పనిలో బీజేపీ బిజీగా ఉందని తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు రాజకీయంగానే కాకుండా, అత్యంత ప్రభావితం చేసే సినిమా స్టార్ల నుంచి ఆ ప్రభావాన్ని పెంచుకునే పనిలో ఉందని తెలుస్తుంది. ఇదే సర్వత్రా హాట్ టాపిక్‌గా మారడం విశేషం.