జైల్లో నరకం చూశాను, ఎవరితో మాట్లాడలేను, విడుదలయ్యాక జానీ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్!
చంచల్ గూడ జైల్లో నెల రోజులకు పైగా ఉన్న జానీ మాస్టర్ నరకం చూశానంటూ ఆవేదన చెందాడు. జైలు నుండి బయటకు వచ్చాక మొదటిసారి నోరు విప్పాడు.
Jani Master
మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అతని మీద పోక్సో(POCSO) కేసు సైతం నమోదైంది. గతంలో తన అసిస్టెంట్ గా పని చేసిన, లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ భయంతో జానీ మాస్టర్ పరార్ అయ్యాడు. మొదట అతడు నెల్లూరులో ఉన్నాడని సమాచారం అందింది. అనంతరం లడఖ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నాలుగు బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టాయి.
Jani master
సెప్టెంబర్ 19వ తేదీ గురువారం జానీ మాస్టర్ ని గోవాలో సైబరాబాద్ ఎస్ ఓ టీ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ కి తరలించారు. రాజేంద్రనగర్ సిసిఎస్ లో జానీ మాస్టర్ ని ఉంచారు.అక్కడ ప్రాథమిక విచారణ జరిగినట్లు వార్తలు వచ్చాయి.
అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుండి నేరుగా ఉప్పరపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితుడు జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు హాజరుపరిచారు.
Jani Master
ఉప్పరపల్లి కోర్ట్ జానీ మాస్టర్ కి రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ పై పోక్సో(POCSO) యాక్ట్ నమోదు చేయడంతో, బెయిల్ రాలేదు. దాదాపు 36 రోజులు జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. ఎట్టకేలకు బెయిల్ పై విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకొచ్చిన జానీ మాస్టర్ ని సన్నిహితులు కలిసినట్లు సమాచారం అందుతుంది.
వారితో జానీ మాస్టర్ తన ఆవేదన వెళ్ళగక్కాడట. జైలులో నరకం చూశాను. ఆహారం బాగోలేదు. మనిషన్న వాడు ఎవడు జైలుకి వెళ్ళకూడదు. ఇదంతా ఎలా జరిగిందో తెలియడం లేదు. కొన్ని రోజులు మనిషిని కాలేను. రెండు రోజుల వరకు ఎవరితో మాట్లాడను. మీడియా ముందుకు వచ్చే ఉద్దేశం కూడా లేదు. త్వరలో అన్ని విషయాలు బయటపెడతాను... అన్నాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Jani Master National Award
జానీ మాస్టర్ జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఢిల్లీలో అవార్డు తీసుకునేందుకు బెయిల్ కావాలని కోరగా కోర్టు నిరాకరించింది. జానీ మాస్టర్ కి షాక్ ఇస్తూ ప్రభుత్వం అతనికి ప్రకటించిన జాతీయ అవార్డును రద్దు చేసింది. తాను గతంలో కంపోజ్ చేసిన భూల్ బులియా 3 మూవీలోని ఓ సాంగ్ ని ఉద్దేశిస్తూ.. ట్రెండ్ చేసినందుకు ధన్యవాదాలని జానీ మాస్టర్ ట్వీట్ చేయడం విశేషం.
అరెస్ట్ కి ముందు జానీ మాస్టర్ సంచలన కామెంట్స్ చేశారు. నన్ను కుట్రపూరితంగా ఇరికించారు. దీని వెనకున్న వాళ్ళను వదలను అని జానీ మాస్టర్ మీడియాతో అన్నారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు పరిశీలీస్తే... జానీ మాస్టర్ గతంలో తన మీద లైంగిక వేధింపులకు పాల్పడిన్నట్లు 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని ఆరోపించింది.
Jani Master
చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగ్ లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. మైనర్ బాలికగా ఉన్నప్పుడే జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఇక సదరు మహిళ నార్సింగ్ నివాసి అయినందున నార్సింగ్ పోలీసులకు కేసు బదిలీ చేశారు.